ఈవీఎంలపై అవగాహనేదీ? | Sakshi
Sakshi News home page

ఈవీఎంలపై అవగాహనేదీ?

Published Sat, Apr 12 2014 2:56 AM

ఈవీఎంలపై అవగాహనేదీ? - Sakshi

నూతనంగా రెండు ఆప్షన్లు
నోటా, వీవీపాట్‌పై ప్రచారం కరువు

 
 కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఓటర్ల కోసం ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన నూతన ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లపై ప్రచారం కరువైంది. నూతన ఆప్షన్లతో ప్రవేశపెట్టిన ఈవీఎంలపై ఓటర్లు, రాజకీయ నాయకులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అవగాహన పొందలేకపోయారు. మరోవైపు ఈవీఎంలలో మరో రెండు ఆప్షన్లను చేర్చారు. ఒకటి ఁనోటా* (నన్ ఆఫ్ ది ఎబో), రెండో వీవీపాట్ (ఓటర్ వెరిఫైయబుల్ ప్రింట్ ఆడిట్ ట్రయల్).

నచ్చిన వ్యక్తికి ఓటేయడంతో పాటు బరిలో నిలిచిన అభ్యర్థులు నచ్చకుంటే నోటా అనే బటన్‌ను నొక్కి తిరస్కరించవచ్చు. అలాగే తమ ఓటు సక్రమంగా నమోదైందా? లేదా? అనే విషయం తెలుసుకునేందుకు (వీవీపాట్) రశీదు అందుతుంది.

 అవగాహన కరువు..
 నూతనంగా ప్రవేశపెట్టిన ఈ వెసులుబాట్లపై ఎంతమందికి అవగాహన ఉందనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఇన్ని రోజులు ఈవీఎంలో ఏదో ఒక మీటను నొక్కి.. నచ్చిన వ్యక్తికి ఓటేయడం మాత్రమే ఓటర్లకు తెలుసు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో తొలిసారిగా అమలవుతున్న తిరస్కరణ ఓటు (నోటా), ఓటు రశీదు (వీవీపాట్)పై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

జిల్లాలో ఇటీవల నిర్వహించిన మున్సిపల్, నగరపాలక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించినా అందులో నోటా, వీవీపాట్ ప్రవేశపెట్టలేదు. మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. దీంతో ఈవీఎంలపై ఓటర్లకు అవగాహన లేకుండాపోయింది. ఈవీఎంల పనితీరుపై గతంలో రాజకీయ పార్టీలు అనేక అనుమానాలు వెలిబుచ్చాయి. ఈ క్రమంలో నాయకుల సమక్షంలో ఈవీఎంల పనితీరుపై అవగాహన కల్పించాల్సి ఉన్నా.. చర్యలు తీసుకోవడంలో అధికారులు జాప్యం చేస్తున్నారు.

 ఓటు రశీదు
 జిల్లాలో 13 అసెంబ్లీ, రెండు ఎంపీ నియోజకవర్గాలున్నాయి. వీటి పరిధిలో 3,390 పోలింగ్ బూతులున్నాయి. 9500 బ్యాలెట్ యూనిట్లు, 7500 కంట్రోల్ యూనిట్లు జిల్లాకు వచ్చాయి. ఇంకా 100 కంట్రోల్ యూనిట్లు, దాదాపు 500 బ్యాలెట్ యూనిట్లు రావాల్సి ఉంది. ప్రతి ఈవీఎంలలో బ్యాలెట్ యూనిట్లు పేరుతో రెండు విడివిడి బాగాలుంటాయి.

సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం వచ్చిన ఈ సరికొత్త ఈవీఎంల పనితీరును ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంజినీర్లు పరిశీలిస్తారు. నోటా మీట నొక్కి అభ్యర్థులను తిరస్కరించే వెసులుబాటుతో పాటు ఓటు వేసిన అనంతరం ఓటరు చేతికి రశీదు అందజేస్తారు. అయితే ఓటరు రశీదు పొందే విధానాన్ని ఈసారి జిల్లాలో ప్రవేశపెట్టే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement