గుంపుతో క్యాంపు! | still four days to go elections counting | Sakshi
Sakshi News home page

గుంపుతో క్యాంపు!

Published Mon, May 12 2014 3:40 AM | Last Updated on Thu, Apr 4 2019 4:46 PM

ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? జిల్లా అంతటా ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు ప్రధాన పార్టీలన్నింటా క్యాంపు రాజకీయాల బెడద మొదలైంది.

ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? జిల్లా అంతటా ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు ప్రధాన పార్టీలన్నింటా క్యాంపు రాజకీయాల బెడద మొదలైంది. ఫలితాలు వెలువడ్డాక  గెలిచిన సభ్యులను ఎలా కాపాడుకోవాలి? ప్రత్యర్థులను ఎలా చిత్తు చేయాలి? పరోక్ష పద్ధతిన జరిగే మున్సిపల్ చైర్మన్లు, మేయర్ పదవులను ఎలా కైవసం చేసుకోవాలి? మెజారిటీ బలాన్ని నిరూపించుకునేందుకు ఎవరికి వల వేయాలి? ఏమేం ఎర వేయాలి? అందరి నోటా ఇదే చర్చ జరుగుతోంది.
 
 సాక్షి ప్రతినిధి, కరీంనగర్:  నేటి మధ్యాహ్నానికల్లా జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగరపంచాయతీలకు సంబంధించిన ఫలితా లు వెల్లడవుతాయి. ఎన్నికలు జరిగిన డివిజ న్లు, వార్డులన్నింటా కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా కొలువుదీరే విజేతలెవరో తేలిపోతుంది. మంగళవారం ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఫలితాలు వెల్లడవుతాయి. కానీ... తరువాయి భాగమైన కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్లు, నగర పంచాయతీ అధ్యక్ష స్థానాల ఎన్నికలకు ముహూర్తం ఇంకా ఖరారు కాలేదు. ఎక్కడికక్కడే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ ను.. కౌన్సిలర్లు చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప రోక్ష పద్ధతిన జరిగే ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఉన్న సభ్యుడిని చైర్మన్‌గా ఎన్నుకుంటారు. ఎమ్మెల్యే, ఎంపీలకు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఈ ఎన్నికలో ఓటుహక్కు ఉంటుంది. అందుకే కొత్తగా కొలువు దీరను న్న ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రమాణ స్వీకారం తర్వాతే ము న్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. దీంతో.. అప్పటిదాకా చైర్మన్లు, మేయర్ల ఎన్నిక వాయిదా పడ్డట్లయింది. ఎంపీపీ పదవుల ఎన్నికకు కూడా తేదీ ప్రకటించక పోవడంతో మండలాల్లోనూ నిరీక్షణ తప్పదు.
 
 క్యాంపు రాజకీయాలపై దృష్టి
 సాధారణంగా అన్ని చోట్ల ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీ అక్కడి మేయర్, చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశముంది. కానీ.. అనిశ్చిత బలాబలాలతో హంగ్ లాంటి పరిస్థితి ఉత్పన్నమైతే.. చైర్మన్, మేయర్ ఎన్నిక ఉత్కంఠ రేపటం ఖాయం. ఒకటి రెండు ఓట్లు తారుమారైతే ఎవరైనా లోపాయకారీగా ప్రత్యర్థి పార్టీలకు మొగ్గు చూపినా, ఎన్నిక జరిగే సమయానికి ఎవరైనా గైర్హాజరైనా ఫలితం తారుమారయ్యే పరిస్థితి ఉంటుంది.
 
 మేజిక్ ఫిగర్‌కు ఒక ఓటు అటు ఇటయినా ఫలితం చేజారిపోవటం ఖాయం. అందుకే ప్రధాన పార్టీలతో పాటు చైర్మన్, మేయర్ రేసులో ఉన్న అభ్యర్థులకు రాబోయే ఎన్నిక సవాలు కానుంది. పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికలు కావటంతో విప్ జారీ చేసే అవకాశం ఉన్నప్పటికీ.. లొసుగులను ఆసరాగా చేసుకొని విప్‌ను ఉల్లంఘించిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి.
 
 అందుకే తమకున్న బలగాన్ని చైర్మన్, మేయర్ ఎన్నిక జరిగే వరకు భద్రంగా కాపాడుకునేందుకు ప్రధాన పార్టీలు, అభ్యర్థులు ఇప్పట్నుంచే ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. తమ సభ్యులతోపాటు తమకు అవసరమై న ఓట్ల మేరకు సభ్యులతో బేరసారాలాడి ఎన్నిక వరకు ఎక్కడికైనా తరలించే క్యాంపు రాజకీయాలపై దృష్టి సారించాయి. వచ్చే నెలలో జరిగే ఎన్నికకు ఇప్పట్నుంచే క్యాంపులు నిర్వహించటం సాధ్యమయ్యే పని కాదని, ఖర్చు తడిసి మోపెడవుతుందని రేసులో ఉన్న అభ్యర్థు లు వెనుకంజ వేస్తున్నారు. డబ్బుకు భయపడితే పదవిని ప్రత్యర్థులు ఎగరేసుకుపోయే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. మధ్యేమార్గంగా బేరసారాలు ఇప్పుడు చేసుకొని.. ఎన్నికకు వారం రోజుల ముందు రహస్యంగా శిబిరాలకు తరలించేందుకు నాయకులు మొగ్గు చూపుతున్నారు.
 
 కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 50 డివిజ న్లున్నాయి. 26 సీట్లు సాధించిన పార్టీ మేయర్ పీఠాన్ని గెలిచే అవకాశముంది. పక్కాగా 20 సీట్లు గెలిచే ధీమా తో ఉన్న ఒక ప్రధాన పార్టీ వివిధ డివిజన్లలో గెలిచే అవకాశమున్న ఆరుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఇప్పటికే వల వేసింది. ఎన్నికలకు వారు ఖర్చు చేసిన డబ్బు ముట్టజెప్పే ఒప్పందంతో తమవైపు తిప్పుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రత్యర్థులు మరింత డబ్బు ఆఫర్ చేస్తే పరిస్థితి చేజారిపోతుందనే అనుమానం ఆ పార్టీనేతలను వెంటాడుతోంది. అందుకే ఫలితాలు వెలు వడిన వెంటనే ప్రత్యర్థులకు చిక్కకుండ ఆరుగురు ఇండిపెండెంట్లను క్యాంపునకు తరలించాలని యోచిస్తోంది.
 
 మండలాల్లో ఈ క్యాంపు రాజకీయాలు మరింత జో రుగా సాగే అవకాశముంది. అన్నిచోట్ల ఎంపీటీసీలుగా గెలిచే సభ్యులకు.. ఎంతో కొంత ముట్టజెప్పి ఎంపీపీ పదవులను తమ వశం చేసుకునేందుకు అన్ని పార్టీల నాయకులు కాచుక్కూచున్నారు. అందుకే ఫలితాలు వె లువడ్డ వెంటనే ఎంపీటీసీ సభ్యులను విహారయాత్రల పేరుతో క్యాంపులకు తీసుకెళ్లే ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. పార్టీ ఆఫీసుల్లో సమావేశాలున్నాయని చెప్పి ముందుగా గెలిచిన ఎంపీటీసీ సభ్యులందరినీ హైదరాబాద్‌కు తరలించాలని ఒక ప్రధాన పార్టీ ఎత్తుగడ వేసింది.
 
 మరోవైపు సొంత పార్టీ సభ్యులు క్యాంపుల దారి పట్టకుండా ఉండేందుకు విప్ జారీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. పదవిని అందుకోవాలని ఎంపీపీ రేసులో ఉన్న అభ్యర్థులు తమ శక్తియుక్తులతో పాటు డబ్బులు కుమ్మరించేందుకు సిద్ధపడగా.. ప్రధాన పార్టీల ముఖ్య నేతలు సైతం ఎక్కువ ఎంపీపీ స్థానాలు తమ ఖాతాలో వేసుకోవాలని ఎత్తుగడలు వేస్తుండటంతో.. క్యాంపులు.. ఎన్ని రూట్లు మారుతాయో వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement