ఎన్నికల సందర్భంగా ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ఆతర్వాత పత్తా లేకుండా పోయే పార్టీలపై కోర్టుల్లో కేసు వేసే అధికారాన్ని ఓటర్లకు ఇవ్వాలని సీపీఐ అనుబంధ రైతు సంఘం, రైతు స్వరాజ్య వేదిక ఎన్నికల సంఘాన్ని కోరాయి.
హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ఆతర్వాత పత్తా లేకుండా పోయే పార్టీలపై కోర్టుల్లో కేసు వేసే అధికారాన్ని ఓటర్లకు ఇవ్వాలని సీపీఐ అనుబంధ రైతు సంఘం, రైతు స్వరాజ్య వేదిక ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఈమేరకు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికి లేఖ రాశాయి. వ్యవసాయ రుణాల మాఫిపై వివిధ పార్టీలు ఇస్తున్న హామీలను ఈ లేఖలో ప్రధానంగా ప్రస్తావించాయి. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం ఎన్నికల సంఘం నిబంధనావళికి విరుద్ధమని పేర్కొన్నాయి.
నిజంగానే వ్యవసాయ రుణాల మాఫీకి ఆయా పార్టీలు కట్టుబడి ఉంటే నిధులు, లబ్ధిదారుల వివరాలను కూడా ఎన్నికలకు ముందుగానే ప్రకటించేలా ఎన్నికల సంఘం ఆదేశించాలని రైతు నేతలు పశ్య పద్మ, డాక్టర్ జీవీ రామాంజనేయులు, కన్నెగంటి రవి విజ్ఞప్తి చేశారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయని పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని, లేకుంటే ఓటర్లే కోర్టుల్లో కేసు వేసేలా మార్గదర్శకాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఆయా పార్టీల నాయకులు తదుపరి ఎన్నికల్లో నిలబడకుండా నిషేధించాలని కోరారు.