ఎంపీపీ పదవుల కోసం హంగ్‌లారుస్తూ..!

ఎంపీపీ పదవుల కోసం హంగ్‌లారుస్తూ..! - Sakshi


 సాక్షి ప్రతినిధి, విజయనగరం : ప్రాదేశిక ఎన్నికల్లో హంగ్ ఫలితాలు వచ్చిన మండల పరిషత్‌లను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రలోభాలకు తెరలేపారు. ఆయా మండలాల్లో కీలకంగా మారిన ఇతర పార్టీల ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకునేందుకు గాలం వేస్తున్నారు. ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు నడుపుతున్న వారు తమకు మద్దతు పలికితే వైస్ ఎంపీపీ పదవులతో పాటు కార్లు, ఇళ్లు, భూ ములు, పెద్ద ఎత్తున డబ్బు నజరానా ఇచ్చేందుకు సిద్ధపడు తున్నట్టు తెలిసింది. అయితే అందరికీ ఒకే రకమైన ఆఫర్లు ఇస్తుండడంతో అసలు ఎవరికి వైస్ ఎంపీపీ పదవులు కట్టబెడతారన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

 

 12 మండలాల్లో కీలకం కానున్న టీడీపీయేతర ఎంపీటీసీలు

 జిల్లాలో 34 మండలాలు ఉండగా, ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో 12 మండలాల్లో మండల పరిషత్ అధ్యక్ష పదవులు ఎవరికీ దక్కని పరిస్థితి ఏర్పడింది. బాడంగి, బలిజి పేట, భోగాపురం, దత్తిరాజేరు, గుర్ల, మక్కువ, మెంటాడ, మెరకముడిదాం, నెల్లిమర్ల, పార్వతీపురం, రామభద్రపు రం, సాలూరు మండలాల్లో ఈ పరిస్థితి ఉంది. దీంతో అక్క డ రాజకీయం రసవత్తరంగా మారింది. ఆయా మండల పరిషత్‌లను కైవసం చేసుకునేందుకు టీడీపీ నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. అక్కడ ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులతో పాటు వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి, గెలుపొందిన అభ్యర్థులు కీలకంగా మారారు.

 

 బంపర్ ఆఫర్లు....

 రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు ఎలాగైనా జిల్లాలో పట్టు సాధించేందుకు హంగ్ ఏర్పడిన మండలాల్లో ఎంపీపీ పదవులకు దక్కించుకునే ప్రయత్నంలో పడ్డారు. ఈ మేరకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. గెలిచిన స్వతంత్రులను ఇప్పటికే రహ స్య ప్రదేశాలకు తరలించారు. వారిలో కొందరిని విహార యాత్రల పేరుతో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, సిమ్లా, షిర్డీ వంటి సూదూర ప్రాంతాలకు తీసుకువెళ్లారు. అయితే స్వతంత్రులు వచ్చినా కలిసి రాని మండలాల్లో కాంగ్రెస్, వైఎస్సార్ సీపీల నుంచి పోటీ చేసి గెలుపొందిన వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరికి స్వతంత్రుల కన్నా భారీ ఎత్తు ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నారు. ప్రధానంగా మండల ఉపాధ్యక్ష పదవితో మరికొన్ని ఆఫర్లు ఇస్తున్నారు. అయితే ఒకే మండలంలో ఇద్దరు ముగ్గురికి ఇదే తరహాలో ఆఫర్లు ఇస్తుండడంతో చివరికి ఆ పదవిని ఎవరికి కట్టబెడతారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  టీడీపీ రాజకీయాలను గమనిస్తున్న మరికొంతమంది గెలుపు వీరులు భారీ మొత్తంలో నజరానాలు ఆశిస్తుండడంతో వారి కోర్కెల చిట్టా తీర్చేందుకు స్థానిక నాయకులు జేబులు చింపుకోవాల్సి వస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top