బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పాలనలో ఉన్న గుజరాత్‌లో ఇదివరకు ఎన్నడూ లేని రీతిలో చిన్నాచితక పార్టీల జోరు కనిపిస్తోంది.
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పాలనలో ఉన్న గుజరాత్‌లో ఇదివరకు ఎన్నడూ లేని రీతిలో చిన్నాచితక పార్టీల జోరు కనిపిస్తోంది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో 21 చిల్లర పార్టీలు 48 మంది అభ్యర్థులను గుజరాత్‌లోని వివిధ నియోజకవర్గాల నుంచి బరిలోకి దించాయి. ఆప్నా దేశ్ పార్టీ, యువ సర్కార్, నేషనల్ యూత్ పార్టీ, ఆదివాసీ సేన పార్టీ, భారతీయ నేషనల్ జనతాదళ్, బహుజన ముక్తి పార్టీ, బహుజన సురక్షాదళ్, బహుజన ముక్తిదళ్, విశ్వహిందూ సంఘటన్, లోకతాంత్రిక్ సమాజ్‌వాదీ పార్టీ, హిందుస్తాన్ నిర్మాణ్ దళ్, హిందుస్తాన్ జనతా పార్టీ వంటి పార్టీల పేరు ఇదివరకు ఎవరికీ తెలియకపోయినా, ఈ ఎన్నికల్లో ఈ పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దించి, యథాశక్తి ప్రచారం సాగిస్తున్నాయి.
ఈ పార్టీలన్నీ ఓటర్లను ఆకట్టుకునేందుకు చిత్రవిచిత్రమైన హామీలతో మేనిఫెస్టోలు విడుదల చేశాయి. తాము అధికారంలోకి వస్తే ఆదాయపు పన్ను, రోడ్డు సుంకం రద్దు చేసేస్తామని, వ్యాట్‌ను, విద్యుత్ చార్జీలను భారీగా తగ్గిస్తామని భారతీయ నేషనల్ జనతాదళ్ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. యువకులకే పదవులు నినాదంలోకి రంగంలోకి దిగిన నేషనల్ యూత్ పార్టీ గాంధీనగర్ నుంచి బీజేపీ కురువృద్ధుడు అద్వానీపై పీయూష్ పటేల్ అనే కాలేజీ విద్యార్థిని పోటీకి నిలిపింది.