ఎన్నికల నిబంధనలు అభ్యర్థులకు దడ పుట్టిస్తున్నాయి.
ఖమ్మంరూరల్, న్యూస్‌లైన్: ఎన్నికల నిబంధనలు అభ్యర్థులకు దడ పుట్టిస్తున్నాయి. ప్రచారంలో పది మందికి మించితే సెక్షన్ 188, 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ కింద కేసుల నమోదు, ఖర్చులపై నిఘా ఏర్పాటు చేసి ఎన్నికల ఖర్చులో జమ చేస్తామని అధికారులు పేర్కొనడంతో హంగూ ఆర్బాటాలకు అభ్యర్థులు దూరంగా ఉంటున్నారు. పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వార్డు, ఎంపీటీసీ అభ్యర్థుల ఖర్చు లక్ష రూపాయలకు మించవద్దని, అంతకు మించితే ఆ అభ్యర్థిపై అనర్హత వేటు పడుతుందని కూడా హెచ్చరించడంతో అభ్యర్థులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారంలోనే బల నిరూపణ చేసేవారు.
రోజు కూలికి కొంతమందిని మాట్లాడుకుని వారితో పాటు అనుచరులను కలిపి వీధుల్లో తిరుగుతూ హంగామా చేసేవారు. ఉదయం నిద్ర లేచింది మొదలు కాఫీ, టిఫిన్ నుంచి మధ్యాహ్నం, రాత్రి భోజనాలు, ఆసక్తి ఉన్న వారికి మందు పార్టీలు ఇచ్చేవారు. మరోపక్క ఎక్కడా గోడలు ఖాళీగా ఉంచేవారు కాదు. తమ పేరుతో నినాదాలు రాసి ఓట్లు అభ్యర్థించేవారు. ఆయా ఇళ్ల యజమానులు గోడలు పాడవుతున్నాయని మొత్తుకున్నా పట్టించుకునేవారు కాదు. అడ్డుకుంటే ప్రత్యర్థి వర్గంగా ముద్రవేసి గెలిచిన తర్వాత వేధింపులకు దిగుతారేమోనని ఇళ్ల యజమానులు భయపడేవారు. కానీ ఈసారి ఎన్నికల సంఘం నిబంధనల పుణ్యమాని ఏ వీధిలో కూడా బ్యానర్లు, ఫ్లెక్సీ లు, రాతలు కనిపించకపోవడంతో ప్రజలు సంతోషంగా ఉంటున్నారు.
అభ్యర్థుల్లోను లోలోపల సంతోషం...
ఎన్నికల సంఘం నిబంధనల పట్ల పలువురు అభ్యర్థులు కూడా లోలోపల ఆనందపడుతున్నారు. డబ్బులు ఉన్న ప్రత్యర్థి ఖర్చుకు వెనుకాడకుండా వేలాది మందిలో ప్రచారం నిర్వహిస్తూ ఆర్భాటం చేస్తుండడంతో తమకు ఇబ్బంది అనిపించినా తప్పని సరిగా ఎంతో కొంత అప్పు చేసి అభ్యర్థులు ఖర్చుచేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఎన్నికల నిబంధనల పుణ్యమాని ప్రచారం సాదాసీదాగా నిర్వహిస్తుండడంతో డబ్బు ఆదా చేసుకుంటున్నారు. ప్రచారంలో హంగూ ఆర్భాటాల కోసం పెట్టే ఖర్చును ఓటర్లకు పంచితే కొన్ని ఓట్లయినా తమకు దక్కుతాయని అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.