వారణాసిపై ఎటూ తేల్చని కాంగ్రెస్ | Congress' sixth list doesn't name any candidate to take on Narendra Modi in Varanasi | Sakshi
Sakshi News home page

వారణాసిపై ఎటూ తేల్చని కాంగ్రెస్

Mar 25 2014 3:03 AM | Updated on Aug 15 2018 2:14 PM

వారణాసిపై ఎటూ తేల్చని కాంగ్రెస్ - Sakshi

వారణాసిపై ఎటూ తేల్చని కాంగ్రెస్

రాజకీయ విశ్లేషకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారణాసి కాంగ్రెస్ అభ్యర్థిపై ఆపార్టీ ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉంది.

16 మందితో ఆరో జాబితా విడుదల
మోడీపై పోటీకి రాజేష్ మిశ్రా పేరు పరిశీలన!

 
న్యూఢిల్లీ: రాజకీయ విశ్లేషకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారణాసి కాంగ్రెస్ అభ్యర్థిపై ఆపార్టీ ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉంది. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆపార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పేరు ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ ఎవరిని నిలబెడుతుందో అనే అంశం సర్వత్రా ఆసక్తిగా మారింది. మరోపక్క, కాంగ్రెస్ పార్టీ ఈ వారణాసి స్థానానికి స్థానిక నేత రాజేష్ మిశ్రా పేరును పరిశీలిస్తున్నట్టు తెలిసింది. 2004-09 మధ్య ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన మిశ్రా తాను మోడీపై పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్ అధిష్టానానికి ఇప్పటికే సంకేతాలు పంపారు. అయితే, మిశ్రా విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయమూ వెలువడలేదు. కాగా, పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌ను అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
 
 ఈ నేపథ్యంలో మోడీపై వారణాసి నుంచి పోటీకి తాను సిద్ధమంటూ దిగ్విజయ్ సోమవారం భోపాల్‌లో వెల్లడించారు. మరోపక్క, లోక్‌సభకు పోటీచేసే 16 మంది అభ్యర్థులతో కూడిన ఆరో జాబితాను కాంగ్రెస్ సోమవారం ఇక్కడ విడుదల చేసింది. కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఈ జాబితాలో చోటు సంపాదించారు. కాగా, మహారాష్ట్రలోని నాందేడ్ స్థానాన్ని ఎవరికీ కేటాయించలేదు. ఈ స్థానాన్ని ‘ఆదర్శ్’ కుంభకోణం నేపథ్యంలో పదవికి రాజీనామా చేసిన మాజీ సీఎం అశోక్‌చవాన్.. తనకు లేదా తన భార్యకు కేటాయించాలని కోరుతున్నారు. తెలంగాణకు చెందిన అభ్యర్థుల జాబితాపై కమిటీ బుధవారం కసరత్తు చేసి, ఈ నెల 28న జాబితా విడుదల చేయనున్నట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement