పొత్తులపై బాబు జిత్తులు! | BJP leaders fire on Chandra Babu | Sakshi
Sakshi News home page

పొత్తులపై బాబు జిత్తులు!

Apr 18 2014 1:59 AM | Updated on Mar 29 2019 9:24 PM

పొత్తులపై బాబు జిత్తులు! - Sakshi

పొత్తులపై బాబు జిత్తులు!

పార్టీ టికెట్లిప్పిస్తామంటూ విరాళాల పేరుతో భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడటమే కాకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ పార్టీలో కర్రపెత్తనం చలాయించాలని చూడటమేంటని బీజేపీ రాష్ట్ర శాఖ నేతలు మండిపడుతున్నారు.

 మండిపడుతున్న బీజేపీ రాష్ట్ర నేతలు
 
 సాక్షి, హైదరాబాద్: పార్టీ టికెట్లిప్పిస్తామంటూ విరాళాల పేరుతో భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడటమే కాకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ పార్టీలో కర్రపెత్తనం చలాయించాలని చూడటమేంటని బీజేపీ రాష్ట్ర శాఖ నేతలు మండిపడుతున్నారు. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న అంశంపై ఇటు తెలంగాణలో అటు సీమాంధ్రలో పరస్పరం ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత నామినేషన్లకు గడువు దగ్గర పడుతున్న సమయంలో ఈ కొత్త డ్రామాలేంటని అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. బీజేపీకి బలం లేదంటూ చంద్రబాబు తాజాగా చేస్తున్న ప్రచారం తప్పకుండా సీట్ల బేరం పెట్టే ఎత్తుగడలో భాగమేనని స్పష్టం చేస్తున్నారు. తాజా పరిణామాలను సమీక్షించిన బీజేపీ నేతలు చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై, ఆయనతో పొత్తు పెట్టుకోవాలంటూ ఒత్తిడి చేసిన జాతీయ నేతలపైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు లాంటి విశ్వసనీయత లేని నాయకుడున్న టీడీపీతో అసలు పొత్తు వద్దేవద్దని ఇరు ప్రాంతాల నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా తమపై ఒత్తిడి చేసి మరీ పొత్తు కుదుర్చుకోవాలని చెప్పిన బీజేపీ జాతీయ నాయకులనువారు తప్పుబడుతున్నారు. దేశం, రెండు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నామని ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు కొందరు పారిశ్రామికవేత్తల ఒత్తిళ్లకు తలొగ్గి బీజేపీని నిర్దేశించాలని చూడటం సహించరాని విషయమని చెబుతున్నారు. నిన్నటివరకు మోడీ జపం చేసి ఇప్పుడు పారిశ్రామికవేత్తల అడుగులకు మడుగులొత్తడానికి ఈ కొత్త డ్రామాకు తెరతీశారని అంటున్నారు. ఇరుపక్షాల మధ్య సీట్ల పంపిణీ పూర్తయిన తర్వాత.. తమ పార్టీ తరఫున ఎవరికి సీట్లు ఇవ్వాలో కూడా చంద్రబాబు నిర్ణయించడమేంటని మండిపడుతున్నారు. బీజేపీ ప్రకటించిన అభ్యర్థులను మార్చాలంటూ టీడీపీ అధినేత సూచించడంపై విజయవాడలో పార్టీ నేతలు బహిరంగంగానే అగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థుల ఎంపికలో మేం జోక్యం చేసుకోనప్పుడు మా అభ్యర్థుల ఎంపికలో జోక్యం చేసుకోవడానికి చంద్రబాబెవరంటూ అక్కడి స్థానిక నేత ఒకరు ఒక టీవీ చానెల్‌తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఇరు పార్టీల మధ్య పొత్తుకు మొదట్నుంచీ వెంపర్లాడిందే బాబు అని బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు. ఎన్నికలకు ఎన్నో రోజుల ముందునుంచే మోడీ జపం చేస్తూ పైరవీతో ఆయన పాల్గొన్న పలు సభలకు సైతం చంద్రబాబు హాజరయ్యారని వారంటున్నారు. అంతాచేసి ఈ రోజు ఆంధ్రాలో మోడీ హవా లేదనీ, రాష్ట్రంలో మోడీ ప్రభావం ఉండదని లీకులు ప్రచారం చేస్తూ పొత్తు ధర్మానికి విరుద్ధంగా మాట్లాడటమేమిటంటూ బీజేపీ నేతలు ఆగ్రహోదగ్రులవుతున్నారు. తనకు వెన్నుపోటు పొడవడం అలవాటేనని, విశ్వసనీయత లేదని బాబు మరోసారి నిరూపించుకున్నారని అంటున్నారు. పొత్తు లేకుండా ఒంటరిగా ఏనాడూ ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యంలేని చంద్రబాబు ప్రతి ఎన్నికల్లోనూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం, నామినేషన్లు దగ్గర పడుతున్న సమయంలో సొంత పార్టీ నేతలకు బీ ఫారాలిచ్చి పోటీలోకి దింపడం సర్వసాధారమైన విషయంగా మారిందని విమర్శిస్తున్నారు.
 
 అసలు కథ వేరే ఉంది..
 
  చంద్రబాబు మోసపూరిత వైఖరి వెనుక అసలు కథ వేరే ఉందని బీజేపీ నేతలు అంచనాకొచ్చారు. ఆ పార్టీ వర్గాలు అందించిన సమాచారం మేరకు... టీడీపీ పూర్తిస్థాయిలో బలహీపడటంతో ఏంచేయాలో తోచక కాంగ్రెస్ నుంచి ఎవరొస్తే వారిని పార్టీలో చేర్పించుకున్నారు. తీరా వారందరికీ టిక్కెట్లు ఇవ్వలేక, ఇస్తే పార్టీ నుంచి సమస్యలొస్తాయని గ్రహించి తెలివిగా కొందరిని బీజేపీలో చేర్పించి వారికి టికెట్లు దక్కేలా చూడాలని చంద్రబాబు ప్రయత్నించారు. ఆ కోవలోనే రఘురామకృష్ణంరాజును బీజేపీలో చేర్పించి నరసాపురం లోక్‌సభ టికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అలాగే గుంటూరుకు చెందిన రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావులను కూడా బీజేపీలో చేర్పించాలని ప్రయత్నించారు. రఘురామకృష్ణంరాజు మొదట్లోనే బీజేపీలో చేరిపోగా, మిగిలిన ఇద్దరి విషయంలో సర్దుబాటు చేయలేని పరిస్థితి వచ్చింది. ఇరు పార్టీల మధ్య సీట్లు ఖరారైన తర్వాత బీజేపీ ప్రకటించిన జాబితాలో రఘురామ కృష్ణంరాజు పేరు చోటుచేసుకోలేకపోవడంతో చంద్రబాబుకు దిక్కుతోచలేదు. పైగా చంద్రబాబు వద్దని చెప్పినప్పటికీ రాజంపేట నుంచి దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ టికెట్ ఖాయం చేసింది. ఆ కారణంగా చంద్రబాబు ఈ కొత్త డ్రామాకు తెరలేపారు. సీమాంధ్రలో సర్వే నిర్వహిస్తే అసలు మోడీ ప్రభావమే లేదని, బలహీనమైన అభ్యర్థులను రంగంలోకి దింపిందంటూ పార్టీ నేతల ద్వారా లీకులు ప్రచారంలో పెట్టించారు. అలా ప్రచారం మొదలు పెట్టడమే కాకుండా బీజేపీకి కేటాయించిన స్థానాల్లో గురువారం టీడీపీ నేతలతో చంద్రబాబు ఏకంగా నామినేషన్లు వేయించారు. తాజా పరిణామాల్లో బీజేపీ నేతల నుంచి ఒత్తిళ్లు వస్తాయని, ఆ కారణంగా నామినేషన్ల ఉపసంహరణ వరకు అందుబాటులోకి కూడా రావొద్దని ఎంపిక చేసిన పలువురు నేతలను ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు రాజమండ్రి అర్బన్‌లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తాడేపల్లిగూడెం నుంచి కొట్టు సత్యనారాయణ, కైకలూరు నుంచి జయమంగళ వెంకటరమణ, పాడేరు నుంచి ప్రసాద్,  సంతనూతలపాడు నుంచి బీఎన్ విజయకుమార్, మదనపల్లి నుంచి దమ్మాలపాటి రమేష్  గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కనుమూరి రఘురామకృష్ణంరాజు నామినేషన్ దాఖలు చేశారు. రెండు నామినేషన్లు దాఖలు చేసిన ఆయన ఒకదానిలో బీజేపీ, మరో దానిలో టీడీపీ అభ్యర్థిగా పేర్కొనడం విశేషం.
 
 జాతీయ నాయకత్వానికి నేతల ఫిర్యాదులు
 
  రోజుకొక తీరున నిర్ణయాలు మార్చుకునే వారితో కలిసి పోటీ చేసినా పార్టీకి గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయని ఢిల్లీ పెద్దల వద్ద బీజేపీ రాష్ట్ర నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదట పొత్తుకు కటీఫ్ అంటూ తన అనుకూల మీడియాలో ప్రచారం మొదలుపెట్టడం.. ఆ తరువాత పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన పలు నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులను పోటీకి దింపడంపై గురువారం పలువురు రాష్ట్ర నేతలు ఢిల్లీ పెద్దలను ఫోనులోనే నిలదీసినట్టు సమాచారం. బుధవారం రాత్రి టీడీపీ మొదలుపెట్టిన ఈ డ్రామాతో విస్తుపోరుున కమలం నేతలు గురువారం మధ్యాహ్నం కల్లా తాము పోటీ చేసే స్థానాలలో టీడీపీ నాయకులు నామినేషన్లు వేయడంతో హతాశులయ్యారు. తాడేపల్లిగూడెం, మదనపల్లి, రాజమండ్రి సిటీ, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించిన మాణిక్యాలరావు, నరసింహారెడ్డి, డాక్టర్ ఆకుల సత్యనారాయణ,  కె.శ్రీనివాసరావులు తొలుత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు హరిబాబుకు ఫోను చేసి విషయం ఆరా తీశారు. తరువాత కొందరు తమకు పరిచయం ఉన్న ఢిల్లీ పెద్దలకు ఫోను చేసి చంద్రబాబు తీరుపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. నరసాపురం లోక్‌సభ బీజేపీ అభ్యర్ధిగా ఎంపికైన గోకరాజు గంగరాజు సైతం నేరుగా ఢిల్లీ నాయకులకు ఫోను చేసి టీడీపీ అధినేత వ్యవహారశైలిని ఏకరువు పెట్టినట్టు సమాచారం. బీజేపీకి కేటాయించిన సీట్లన్నీ ఓడిపోయేవేనంటూ టీడీపీ ప్రచారం చేయడాన్నీ బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రచారం ద్వారా బీజేపీ అభ్యర్థులలో అత్మస్థైర్యం దెబ్బతీస్తున్నారని ఫిర్యాదు చేశారు.
 
 పొత్తు వద్దనుకుంటే ఆయనకే నష్టం
 
 పొత్తులపై చంద్రబాబు వన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనంటూ కమలం ఢిల్లీ పెద్దలు రాష్ట్రపెద్దలకు వివరించి చెబుతున్నట్టు సమాచారం. పొత్తు వదులుకుంటే బీజేపీ కన్నా ఆయనే ఎక్కువగా నష్టపోవాల్సి ఉంటుందని.. పొత్తులు లేకుండా టీడీపీ ఏ ప్రాంతంలోనూ ఒకట్రెండు లోక్‌సభ సీట్లు గెలిచే పరిస్థితి ఉండదని వివరిస్తున్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు పొత్తు తెంచుకునేందుకు సిద్ధపడరని నచ్చజెప్పినట్టు సమాచారం. నామినేషన్ల ప్రక్రియకు ముందే టీడీపీ అభ్యర్థులుగా పోటీలో ఉండేవారందరినీ ఉపసంహరించుకునేలా తాము చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు సమాచారం.
 
 బీజేపీ అభ్యర్థులు బలహీనం
 
 పొత్తుపై చంద్రబాబు నర్మగర్భ వ్యాఖ్యలు
 
 న్యూస్‌లైన్ నెట్‌వర్క్: ‘‘నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఎంతో అవసరం. ఎన్డీఏకి సహకరించి ముందుకు పోవాలనుకున్నాను. అందుకనే తెలంగాణలో పొత్తు కుదిరింది. ఇక్కడ కూడా పొత్తు పెట్టుకోవాలనుకున్నాను. కొన్ని కారణాల వల్ల వారు పెట్టే అభ్యర్థులను చూస్తుంటే భయమేస్తోంది. బీజేపీ బలహీనమైన అభ్యర్థులను పోటీలో పెడుతుండడం వల్ల ప్రత్యర్థి పార్టీలకు లాభం చేకూరేలా ఉంది. మొన్న చూశాం. గజపతినగరం అసెంబ్లీ స్థానం కోసం వారు పట్టుబడితే పోరాడి ఆ స్థానాన్ని తెచ్చుకున్నాం. బీజేపీ సమర్థులైన అభ్యర్థులను పెట్టకపోవడం వల్ల టీడీపీ కొన్ని అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాల్లో ఓడిపోయే పరిస్థితి ఉంది. ఢిల్లీకి సంఖ్యా బలంతో పోవాలి. అందుకు ఎక్కువ సంఖ్యా బలం కావాలి. ఆ బలం తక్కువ కాకూడదు. అందుకే బీజేపీ బలహీన అభ్యర్థులు పెట్టిన చోట మన అభ్యర్థుల్ని పోటీ చేయిస్తున్నాం’’ అని బీజేపీతో పొత్తుపై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు.

 వసూళ్ల పంచాయితీయేనా..
 
 సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో టిక్కెట్లిస్తామని లేదా ఇప్పిస్తామని భారీ స్థాయిలో చేసిన వసూళ్ల వ్యవహారంలో ఎటూ తేల్చుకోలేకే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పొత్తు పంచాయితీని తెరమీదకు తెచ్చారని తెలుస్తోంది. విరాళాల పేరుతో పారిశ్రామికవేత్తల నుంచి పెద్ద ఎత్తున వసూలు చేసి తీరా వారికి టీడీపీలో టికెట్లిచ్చేందుకు వీలుకాకపోవడం, బీజేపీ తరఫునైనా ఇప్పించలేకపోవడం వల్లే ఆ పార్టీతో పొత్తు కటీఫ్ అనే ప్రచారం మొదలుపెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. పొత్తు లేదని ప్రచారం చేస్తే బీజేపీ దిగొస్తుందని, తద్వారా రెండు లోక్‌సభ, నాలుగు అసెంబ్లీ స్థానాలకు బేరం పెట్టొచ్చన్న ఆలోచనతో టీడీపీ అధినేత ఉన్నట్టు చెబుతున్నారు. సామాజిక సమీకరణల కారణంగా టీడీపీ నుంచి టికెట్ ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడటంతో బీజేపీలో చేరాల్సిందిగా పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు సూచించారు. ఆ పార్టీలో చేరిన తర్వాత టికెట్ ఇప్పించే బాధ్యతను కూడా తీసుకున్నారు. అరుుతే బీజేపీ జాబితాలో బాబు సూచించిన పారిశ్రామికవేత్తల పేర్లు కనిపించలేదు. దీంతో కోట్ల మొత్తంలో సమర్పించుకున్న పారిశ్రామికవేత్తలు చంద్రబాబుపై ఒత్తిడి పెంచారు. రూ.40 కోట్లు విరాళం పేరిట సమర్పించుకున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక పారిశ్రామికవేత్త చంద్రబాబు సూచన మేరకు బీజేపీలో చేరారు. కానీ పార్టీ టికెట్ దక్కకపోవడంతో అసలు సమస్య మొదలైంది. మరోవైపు దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ టికెట్ ఖరారు చేయడం, ఇంకోవైపు సినీనటుడు సూచించిన పొట్లూరి వరప్రసాద్‌కు విజయవాడ లోక్‌సభ స్థానాన్ని వదులుకున్నా చివరకు అది కూడా అనుకున్నట్టు జరగకపోవడం.. వెరసి ఇంటా బయటా వచ్చిన ఒత్తిళ్ల మధ్య చంద్రబాబు బీజేపీ పొత్తు విషయంలో కొత్త డ్రామాకు తెరలేపారని అంటున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement