అడ్డంకులు.. ఆంక్షలు.. అయినా జగన్‌ వెంట జనం! | Kommineni Srinivasa Rao Comments On Kutami Govt | Sakshi
Sakshi News home page

అడ్డంకులు.. ఆంక్షలు.. అయినా జగన్‌ వెంట జనం!

Aug 17 2026 9:07 AM | Updated on Aug 17 2026 9:43 AM

Kommineni Srinivasa Rao Comments On Kutami Govt

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి కర్నూలు పర్యటన ఏపీ ప్రజలకు మరింత స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలో ఉన్న దారుణమైన పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించడంలో జగన్ కృతకృత్యమయ్యారు. అంతేకాదు.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని నిర్భంధాలు పెట్టినా జగన్ పట్ల తమ అభిమానం చెక్కు చెదరదని వైఎస్సార్‌సీపీ క్యాడర్‌తో పాటు సామాన్య జనసందోహం కూడా తేల్చి చెబుతోంది.

ఏపీ కూటమి ప్రభుత్వం పోలీసులనే నమ్ముకుని వందల సంఖ్యలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలపై కేసులు పెడుతున్నా వారు పట్టించుకోవడం మానేశారన్న అభిప్రాయం కలుగుతుంది. జగన్‌ను కర్నూలు జైలులో అవమానించిన తీరు కూడా ఆయన అభిమానులలో ఆగ్రహాన్ని మరింత పెంచుతోంది. ఆలూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమ కేసులో అరెస్టు చేసి కర్నూలు జైలులో ఉంచారు. అది ఎలా అక్రమ కేసు అన్నది సాక్ష్యాధారాలతో సహా జగన్ చెప్పగలిగారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై కొందరు టీడీపీ వారు దాడి చేసిన సందర్భంలో అతనిని రక్షించడానికి విరూపాక్షి ఆ గ్రామానికి వెళ్లారు. అక్కడ టీడీపీ కార్యకర్త ఒకరు తన భార్య నైటీని తానే చించడమే కాకుండా, ఎమ్మెల్యే విరూపాక్షిపై తప్పుడు ఆరోపణ చేసి కేసు పెట్టారు. ఆ తర్వాత కారుపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ వివాదంలో పోలీసులు విరూపాక్షి ఇంటికి అర్ధరాత్రి వెళ్లి తలుపులు పగలకొట్టి లోపలకు వెళ్లడమే కాకుండా, ఆ సన్నివేశాలు తెలియకుండా ఉండడానికి సిసిటీవీ ఫుటేజ్‌ని, డిస్క్ లను అపహరించుకుని పోయారట. ఈ వివరాలన్నిటిని జగన్ తన టాబ్ ద్వారా మీడియాకు వివరించారు.

జగన్ ఏది మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడతారని ప్రజలు భావిస్తారు. దానికి తగినట్లుగానే తను చెప్పిన విషయాలకు ఆధారంగా సంబంధిత వీడియోలను ప్రదర్శించారు. పోలీసు అధికారులు కాని, ప్రభుత్వంలో ఉన్నవారు కాని వాటిపై ఇంతవరకు జవాబు ఇవ్వలేకపోతున్నారు. బాధితులు వైఎస్సార్‌సీపీ అనుకూలురు అన్న భావన కలిగితే చాలు.. పోలీసులు వారిపైనే ఏదో రకంగా కేసు పెడుతున్నారనడానికి విరూపాక్షి అక్రమ అరెస్టు ఉదాహరణ అవుతుంది. పోలీసులు ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ భార్య నైటి చించుతున్న వ్యక్తిని అడ్డుకోకపోవడం, వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి చేసినవారిమీద కేసు పెట్టకపోవడం వంటివి ఏపీ పోలీసు వ్యవస్థకు మచ్చగానే మిగులుతుంది.

కొందరు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కూటమి ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ద్వారా జగన్‌కు జనంలో విస్తారంగా పర్యటించే అవకాశాన్ని కూటమి నేతలే ఇస్తున్నారు. తద్వారా ఆయనకు జనంలో ఉన్న అభిమానాన్ని ఎప్పటికప్పుడు తెలిసేలా చేస్తున్నారు. జగన్ శ్రీకాకుళం వెళ్లినా, తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి వెళ్లినా, ఇప్పుడు కర్నూలు వెళ్లినా ఒకే రకమైన స్పందన కనిపిస్తుండడం విశేషం. అంతకుముందు గుంటూరు, కృష్ణా, నెల్లూరులలో పర్యటించినప్పుడు కూడా ఇదే సీన్ కనిపించింది. 

ఓర్వకల్లు విమానాశ్రయంలో హెలికాఫ్టర్ దిగినప్పటినుంచి కర్నూలు జైలు వద్దకు వెళ్లేవరకు 38 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి జగన్‌కు ఐదుగంటలకు పైగా పట్టింది. ఈ పరిస్థితి టీడీపీతో పాటు ఎల్లో మీడియాకు కూడా కడుపుమంటగా మారుతోంది. వారికి కంటగింపు అవుతోంది. ఇది పరామర్శయాత్రనా? లేక విజయ యాత్రనా అని ఎల్లో మీడియా వ్యాఖ్యానిస్తోంది. ఆ రకంగా జగన్‌కు జనంలో ఉన్న పట్టును టీడీపీ మీడియానే తెలియచేసినట్లవుతోంది.

జగన్‌కు జనం రాలేదని రాయాలన్నది వారి కోరిక కావచ్చు. కాని పరిస్థితి అలా ఉండడం లేదు. కర్నూలుకు జనం రాకుండా పోలీసులు ఎక్కడకక్కడ చెక్ పోస్టులు పెట్టారు. దీనిపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి పోలీసుల తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఆ దశలో వైఎస్సార్‌సీపీ అభిమానులు పోలీసు చెక్ పోస్టులను తోసుకుంటూ ముందుకు వెళ్లిపోవడం కనిపించింది. తమపై పోలీసులు కేసులు పెడతారని తెలిసినా వారు అంత ధైర్యంగా ముందుకు కదులుతున్నారంటే జగన్ పై వారికి ఏర్పడిన అభిమానం అటువంటిదన్నమాట.

అసలు ప్రజాస్వామ్యంలో తమ నాయకుడిని కలుసుకోవడానికి వెళుతున్న కార్యకర్తలను నిలువరించే పని పోలీసులు ఎందుకు పెట్టుకుంటారో అర్థం కాదు. ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనుకుంటే కట్టడి చేయవచ్చు. లేదా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంటే, దానికి తగ్గట్లు ఏర్పాటు చేయవచ్చు. అలాకాకుండా పాలక పార్టీల నేతల మెప్పు కోసం కొందరు పోలీసు అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు ఒక మాజీ ముఖ్యమంత్రి స్వయంగా జైలులో ఉన్న తన ఎమ్మెల్యేని కలవడానికి వెళితే పోలీసులు అవమానించిన తీరు కూడా తీవ్ర అభ్యంతరకరంగా ఉందని చెప్పాలి. సాదారణంగా రూల్ ప్రకారం ఎవరినైనా కూర్చోబెట్టి ఫోటో తీసిన తర్వాత ఖైదులో ఉన్న వ్యక్తిని కలవడానికి అనుమతిస్తారు. కాని జగన్‌ను మాత్రం నిలబెట్టి ఒక గేటు వద్ద ఫోటో తీయడం ద్వారా ఆయనే ఏదో కటకటాల వెనుక ఉన్నట్లు చూపించాలన్నది అధికారుల తాపత్రయం కావచ్చు. కాని ఈ విషయాన్ని జగన్ బయట చెప్పేయడంతో పోలీసు శాఖ ప్రతిష్ట మరింత దిగజారినట్లయింది.

వైఎస్సార్‌సీపీవారితో పాటు సామాన్య ప్రజలలో కూడా ఇదేమిటి ప్రభుత్వం ఇంత సంకుచితంగా మారింది అన్న అభిప్రాయం ఏర్పడింది. గతంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడును కుప్పం, అనపర్తిలలో శాంతిభద్రతల సమస్య ఉందని నిలువరించే యత్నం చేశారు. దానిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి వారి మాట కాదని టూర్ చేశారు. అనపర్తి వద్ద అయితే ఏకంగా నడుచుకుంటూ వెళతానని తన కార్యకర్తలతో కలిసి వెళ్లారు. ఆయన చేస్తే అదంతా చట్టబద్దం, వ్యతిరేక పార్టీవారు చేస్తే మాత్రం తప్పు అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతుంటారు.

కర్నూలు టూర్‌లో సుగాలి ప్రీతి తల్లి కూడా కలవడం విశేషం. పవన్ కళ్యాణ్ తనకు ఇచ్చిన హామీలను విస్మరించి, కనీసం అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదన్నది ఆమె బాధ. అలాగే డీఎస్సీ అక్రమాల బాధితులు కూడా జగన్‌ను కలిశారు. ఇలా వివిధ వర్గాలవారిని కలుసుకుంటూ, రోడ్లపై ఉన్నవారికి అభివాదం చేసుకుంటూ జగన్ ముందుకు వెళ్లారు. జగన్‌కు ఇంత ఆదరణ ఎందుకు వస్తున్నదన్నదానిపై ఆత్మవిమర్శ చేసుకోవల్సిన చంద్రబాబు నాయుడు ఆ పని చేయకుండా జగన్‌ను, వైఎస్సార్‌సీపీని తీవ్రస్థాయిలో విమర్శించడానికి, కొన్నిసార్లు దూషించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది ఆయనలోని అసహనాన్ని తెలియచేస్తుంది.

ప్రభుత్వం ఇకనైనా తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలి. వైఎస్సార్‌సీపీని అణచివేయాలని చూస్తే, అది మరింత ప్రభావం చూపుతుందని, జగన్‌ను కలవకుండా ప్రజలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే, అది తమకే నష్టమని చంద్రబాబు, లోకేష్‌లు తెలుసుకుంటే మంచిది.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement