ఓటరు తీర్పు నేడే విడుదల! | AP Lok Sabha 16th May Election Results 2014 | Sakshi
Sakshi News home page

ఓటరు తీర్పు నేడే విడుదల!

May 16 2014 2:00 AM | Updated on Sep 2 2018 4:48 PM

దేశంలో.. రాష్ట్రం లో.. నెలకొన్న రాజకీయ పరిణామాలకు అద్దం పడుతూ ఈసారి ఎన్నికల పర్వం ఆద్యంతం ఆసక్తిదాయకంగా సాగింది. లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం మార్చిలోనే

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: దేశంలో.. రాష్ట్రం లో.. నెలకొన్న రాజకీయ పరిణామాలకు అద్దం పడుతూ ఈసారి ఎన్నికల పర్వం ఆద్యంతం ఆసక్తిదాయకంగా సాగింది. లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం మార్చిలోనే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. అప్పటినుంచి జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన రాజకీయ పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్‌లు ఎన్నికల సన్నాహాలను వేగవంతం చేశాయి. ఏప్రిల్ 12న నోటిఫికేషన్ విడుదల కావడంతో అసలైన యుద్ధానికి తెరలేచింది. ఏప్రిల్ 12 నుంచి 19 వరకు నామినేషన్లు స్వీకరించారు.
 
 21న నామినేషన్ల పరిశీలన పూర్తికాగా 23 వరకు ఉపసంహరణకు అవకాశమిచ్చారు. ఈ ప్రక్రియ ముగిశాక శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి 10 మంది, పది అసెంబ్లీ నియోజకవర్గాలకు 84 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అనంతరం మే 5 వరకు ఎన్నికల ప్రచారానికి అవకాశమిచ్చారు. కీలకమైన పోలింగ్‌ను 7న నిర్వహించారు. జిల్లాలోని 19,85,245 మంది ఓటర్లలో 14,89,087 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 75.01 శాతం ఓటింగ్ నమోదైంది. పురుషుల కంటే మహిళలు అధికంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం విశేషం. జిల్లాలో 9,92,070 మంది పురుష ఓటర్లు ఉండగా 7,22,764 మంది అంటే 72.85 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 9,92,999 మంది మహిళా ఓటర్లు ఉండగా 7,66,323 మంది అంటే 77.17 శాతం మంది ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
 సర్వశక్తులు ఒడ్డిన రాజకీయ పార్టీలు
 ఇంత సుదీర్ఘమైన, ఆసక్తికరమైన ఎన్నికల యుద్ధంలో రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డి పోరాడాయి. వైఎస్సా ర్ కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్‌లు ప్రధాన పార్టీలు అయినప్పటికీ.. ప్రధాన పోటీ మాత్రం వైఎస్సార్ కాం గ్రెస్, టీడీపీల మధ్యే కేంద్రీకృతమైంది. రాజకీయ పార్టీగా ఆవిర్భవించాక తొలిసారి సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్లింది. సామాజిక సమతుల్యత పాటించి వివాదాలకు తావులేకుండా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసింది. జిల్లాలో వర్గ విభేదాలు లేకపోవడం ఆ పార్టీకి కలసివచ్చింది. సీనియర్ నేతలు, కొత్త నేతల మేలుకలయికతో వైఎస్సార్ కాంగ్రెస్ జట్టు సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల రణరంగంలో దూసుకుపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ తరపున ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మలు ఎన్నికల ప్రచారంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వారిద్దరి ప్రచార సభలకు అశేష జనస్పందన లభించడం పార్టీ శ్రేణులకు నూతనోత్సాహాన్నిచ్చింది. పార్టీ ప్రకటించిన సంక్షేమ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో పార్టీ శ్రేణులు సఫలీకృతమయ్యాయి. అందుకు తగినవిధంగానే ప్రజలు పార్టీ పట్ల సానుకూలంగా స్పందించారని ఓటింగ్ సరళి స్పష్టం చేసింది. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు గెలుపుపై ధీమాతో ఉన్నాయి.
 
 విభేదాలతో టీడీపీ సతమతం
 ఇక ప్రధాన పోటీదారు టీడీపీ కూడా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది. కాగా వర్గ విభేదాలు ఆ పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. కింజరాపు అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పార్టీ చీలిపోవడం ప్రతికూలంగా పరిణమించింది. బీజేపీతో పొత్తు, సీట్ల కేటాయింపు, అనంతరం రద్దు... తదితర వ్యవహారాలతో అంతా రచ్చరచ్చగా మారింది. అభ్యర్థుల తరఫున పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, సినీ నటులు బాలకృష్ణ, పవన్ కల్యాణ్‌లు ప్రచారం నిర్వహించారు.
 
 దిక్కూ.. దివాణం లేని కాంగ్రెస్
 ఇక ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ను పట్టించుకున్న నాథుడే లేకుండాపోయాడు. ముందే ఓటమి ఖాయం కావడంతో అభ్యర్థులు కూడా ఎన్నికలపై ఆసక్తి చూపించలేదు. కాంగ్రెస్ తరపున పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, చిరంజీవి తదితరులు నిర్వహించిన ప్రచారానికి ఏమాత్రం ప్రజాస్పందన లభించలేదు. ఓటమి తప్పదని నిర్ధారణ కావడంతో జిల్లాలోని కాంగ్రెస్ నేతలు టీడీపీతో కుమ్మక్కు రాజకీయాలకు తెరతీశారు. ఏకంగా అభ్యర్థులే టీడీపీకి లొంగిపోవడం విస్మయపరిచిన వాస్తవం. వీటన్నింటినీ ఓ కంట కనిపెడుతూ వచ్చిన ఓటర్లు అన్ని అంశాలను బేరీజు వేసుకుని తమ తీర్పును ఈనెల 7న ప్రకటించారు. ఈవీఎం లలో నిక్షిప్తమైన ఆ తీర్పు శుక్రవారం విడుదల కానుంది. తీర్పు ఎలా ఉండబోతోందన్నది అటు రాజకీయ పార్టీల్లోనూ, ఇటు ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంఠ కలిగిస్తోంది.
 
 ఓట్ల లెక్కింపునకు భారీ ఏర్పాట్లు
 ఇంతటి ఆసక్తి కలిగిస్తున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికార యం త్రాంగం విసృ్తత ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని రెండు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పాలకొండ మినహా మిగిలిన 9 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎచ్చెర్ల శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తారు. పాలకొండ నియోజకవర్గ ఓట్లను మాత్రం పాలకొండలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) భవనంలో లెక్కిస్తారు. ప్రతి నియోజకవర్గానికి 20 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఆయా నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్యను బట్టి ఓట్ల లెక్కింపు రౌండ్లను నిర్ణయించారు.అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత లోక్‌సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలను అధికార యంత్రాంగం చేపట్టింది. శుక్రవారం ఉదయం 8 గంట లకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
 
 ఉదయం 10 గంటలకు తొలి ఫలితం వెలువడవచ్చని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకల్లా అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం 2 గంటలకల్లా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘర్షణలు, ఇతరత్రా అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. నిషేధాజ్ఞలు అమల్లోకి తెచ్చారు. ఈ విధంగా నెలన్నర రోజుల ఎన్నికల క్రతువు తుది అంకానికి సర్వం సిద్ధమైంది.ఓటరు తీర్పు ఎలా ఉండనుందో తెలుసుకోవాలన్న ఆసక్తి, ఉత్కంఠతో రాజకీయ పార్టీలవారూ, ప్రజలూ ఓట్ల లెక్కింపుపైనే దృష్టి సారించారు. మరోవైపు.. ఫలితాలపై బెట్టింగులూ జోరు గా సాగుతున్నాయి. ఓట్ల లెక్కింపు వివరాలను అనుక్షణం ప్రసారం చేసే టీవీ చానళ్లపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement