అత్యంత గౌరవనీయ వ్యక్తుల్లో | most honorable man | Sakshi
Sakshi News home page

అత్యంత గౌరవనీయ వ్యక్తుల్లో

Nov 5 2015 1:55 AM | Updated on Sep 3 2017 12:00 PM

‘ఏషియా సీఈఓ ఆఫ్ ది ఇయర్’గా హెచ్‌పీసీఎల్ సీఎండీ వాసుదేవ హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్

 ‘ఏషియా సీఈఓ ఆఫ్ ది ఇయర్’గా  హెచ్‌పీసీఎల్ సీఎండీ వాసుదేవ  హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) సీఎండీ నిషి వాసుదేవకు ఏషియా సీఈఓ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. ఇంగ్లండ్‌కు చెందిన ‘ప్లాట్స్’ అనే వ్యాపారసంస్థ ఈ అవార్డును అందజేస్తుంది. ఈ అవార్డు ఏషియా పసిఫిక్ రీజియన్‌లో భారతీయ మహిళకు దక్కడం ఇదే మొదటిసారి. నిషి వాసుదేవ 1974 నుంచి హెచ్‌పీసీఎల్‌లో పనిచేస్తున్నారు. 2014 నుంచి సీఎండీగా విధులు నిర్వహిస్తున్నారు.
 
 బ్రిటన్‌లో హైకమిషనర్‌గా నవతేజ్‌సింగ్
 బ్రిటన్‌లో భారత కొత్త హైకమిషనర్‌గా దౌత్యవేత్త నవతేజ్ సింగ్ సర్న అక్టోబరు 31న నియమితులయ్యారు. ఆయన 1980వ బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి. ప్రస్తుతం విదేశీ వ్యవహారాల శాఖలో కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
 
 రాష్ట్రీయం
 దేశంలో అత్యంత పొడవైన వ్యక్తి  గట్టయ్య మృతి  దేశంలోనే అత్యంత పొడవైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న గట్టయ్య(40) హైదరాబాద్‌లో అక్టోబరు 31న అనారోగ్యంతో మృతి చెందాడు. ఈయన ఎత్తు 7 అడుగుల 6 అంగుళాలు. కాగా గట్టయ్య ఆసియాలోనే రెండో పొడవైన వ్యక్తిగా కూడా గుర్తింపు పొందాడు.
 
 హైదరాబాద్‌లో జాతీయ విత్తన సదస్సు
 కేంద్ర ప్రభుత్వ సహకారంతో అక్టోబరు 27న హైదరాబాద్‌లోని హెచ్‌ఐఐసీలో 8వ జాతీయ విత్తన సదస్సును నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి ‘దేశానికే విత్తన భాండాగారంగా తెలంగాణ’ పేరిట ఓ దర్శన పత్రాన్ని విడుదల చేశారు. విత్తన పంటలకు ప్రత్యేక బీమా, కనీసమద్దతు ధర, 15 నెలల పాటు విత్తనాలను నిల్వ ఉంచే టెక్నాలజీ వంటి అంశాలను ఈ సదస్సులో తీర్మానించారు.
 
 సైన్‌‌స అండ్ టెక్నాలజీ
  జలాంతర్గామి కల్వరి నీటి ప్రవేశం  జలాంతర్గామి కల్వరిని ముంబయిలో అక్టోబరు 29న విజయవంతంగా నీటిలో ప్రవేశపెట్టారు. ఇది మొట్టమొదటి స్కార్పీన్ శ్రేణి జలాంతర్గామి. ఈ శ్రేణిలో ఆరు జలాంతర్గాములు తయారుచేయనున్నారు. 2020 నాటికి మొత్తం తయారుకానున్నాయి. ఈ జలాంతర్గామిని త్వరలో సముద్రంలో పరీక్షించనున్నారు. ఇందులో నౌకా విధ్వంసక క్షిపణులు, టార్పెడోలను మోహరిస్తారు.
 
 యుద్ధనౌక నుంచి బ్రహ్మోస్ పరీక్ష
 యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కోచి నుంచి జరిపిన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ పరీక్ష విజయవంతమయింది. నవంబరు 1న దేశ పశ్చిమ తీరం నుంచి 290 కి.మీ.ల దూరంలో అరేబియా సముద్రంలో గల లక్ష్యనౌక అలెప్పిని ఈ క్షిపణి విజయవంతంగా ఛేదించింది. బ్రహ్మోస్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించడం ఇది 49వ సారి.
 
 అంతర్జాతీయం
 ఒకే బిడ్డ విధానం రద్దుచేసిన చైనా చైనాలో ఒకే బిడ్డ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు అధికార కమ్యూనిస్టు పార్టీ అక్టోబరు 29న ప్రకటించింది. ఇకపై ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతినిచ్చింది. దేశంలో వృద్దుల సంఖ్య పెరగడం, కార్మిక శక్తి తగ్గడంతో రెండింటి మధ్య సమతుల్యం పాటించేందుకు ఒకే బిడ్డ విధానాన్ని రద్దు చేసింది. ఈ విధానం 1970 చివర్లో అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి పట్టణప్రాంతాల్లోని జంటలు ఒకే బిడ్డను కనాలి. గ్రామీణ ప్రాంతాల్లో తొలికాన్పు ఆడపిల్ల పుడితేనే రెండో కాన్పునకు అనుమతి ఉంటుంది. 2013 లెక్కల ప్రకారం చైనా జనాభా 135 కోట్లకు పైగా ఉంది.
 
 టాంజానియా అధ్యక్షుడిగా
 పాంబే మగుఫులి విజయం టాంజానియా అధ్యక్ష ఎన్నికల్లో అధికార చమా చమ పిండుజి(సీసీఎం) పార్టీకి చెందిన జాన్ పాంబే మగుఫులి విజయం సాధించారు. అక్టోబరు 25న జరిగిన ఎన్నికల్లో ముగుఫులికి 58.46 శాతం ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష అభ్యర్థి, మాజీ ప్రధాన మంత్రి ఎడ్వర్డ్ లొవస్సాకు 39.97 శాతం ఓట్లు వచ్చాయి. టాంజానియాలో 1977 నుంచి సీసీఎం పార్టీ అధికారంలో కొనసాగుతోంది.
 
 వ్యాపార అనుకూల దేశాల జాబితాలో
 భారత్‌కు 130వ స్థానం ప్రపంచబ్యాంకు ‘డూయింగ్ బిజినెస్ 2016’ పేరిట రూపొందించిన జాబితాలో భారత్ 130వ స్థానంలో నిలిచింది. 189 దేశాల జాబితాను ప్రపంచబ్యాంకు అక్టోబరు 28న విడుదల చేసింది. కొత్త కంపెనీల చట్టం, మెరుగైన విద్యుత్ సరఫరా వంటి అంశాలు భారత్‌ను 130వ స్థానంలో నిలిపాయి. మొత్తం జాబితాలో సింగపూర్‌కు మొదటి ర్యాంక్ వచ్చింది. న్యూజిలాండ్, డెన్మార్క్ తర్వాత స్థానాల్లో నిలిచాయి.
 
 గ్వాటెమాలా అధ్యక్షుడిగా జిమ్మీ మోరల్స్
 గ్వాటెమాల కొత్త అధ్యక్షుడిగా టీవీ హాస్య నటుడు జిమ్మీ మోరల్స్ ఎన్నికయ్యారు. నేషనల్ కన్వర్జన్‌‌స ఫ్రంట్‌కు చెందిన ఆయనకు 69 శాతం ఓట్లు లభించాయి. ప్రత్యర్థి,మాజీ అధ్యక్షురాలు శాండ్రాటోర్స్‌కు 31 శాతం ఓట్లు దక్కాయి. సెప్టెంబరు 3న అప్పటి అధ్యక్షుడు ఒట్టోపెరెజ్ అవినీతి ఆరోపణలతో అరెస్టవడంతో ఈ ఎన్నికలు జరిగాయి.
 
 రష్యా విమానం కూలిన దుర్ఘటనలో
 224 మంది మృతి రష్యాకు చెందిన విమానం ఈజిప్ట్‌లోని సినాయ్ ద్వీపకల్పంలో అక్టోబరు 31న కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 224 మంది ప్రయాణికులు చనిపోయారు. ఈ విమానం ఎర్రసముద్రంలోని పర్యాటక ప్రాంతం షర్‌‌మఎల్ షేక్ నుంచి రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు వెళ్తుంది. ప్రయాణికుల్లో రష్యాకు చెందిన 214 మంది, ఉక్రెయిన్‌కు చెందిన ముగ్గురితో పాటు ఏడుగురు సిబ్బంది కూడా ఉన్నారు. కాగా ఈ విమానాన్ని తామే కూల్చినట్లు ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) అనుబంధ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. రష్యాలో తమసంస్థపై దాడులకు ప్రతీకారంగా విమానాన్ని కూల్చివేసినట్లు పేర్కొంది. అయితే సాంకేతిక కారణాల వల్ల కూలిపోయి ఉంటుందని రష్యా వెల్లడించింది.
 
 అత్యంత విలువైన జాతీయ బ్రాండ్ల జాబితాలో భారత్‌కు 7వస్థానం ప్రపంచంలో అత్యంత విలువైన జాతీయబ్రాండ్ల జాబితాలో భారత్‌కు ఈ ఏడాది 7వ స్థానం దక్కింది. భారత బ్రాండ్ ఫైనాన్స్ నవంబరు 1న విడుదల చేసిన 100 దేశాల జాబితాలో భారత్ ఒకస్థానం మెరుగుపరుచుకుని 7వ స్థానానికి చేరుకుంది. భారత్ బ్రాండ్ విలువ 210 కోట్ల డాలర్లకు చేరుకుంది. అమెరికా, చైనా, జర్మనీ, బ్రిటన్, జపాన్‌లు వరసగా టాప్ స్థానాల్లో ఉన్నాయి. అమెరికా బ్రాండ్ విలువ 1970 కోట్ల డాలర్లుగా ఉంది. ఒకదేశంలోని అన్ని బ్రాండ్ల ఐదేళ్ల విక్రయాల ఆధారంగా జాతీయ బ్రాండు విలువను లెక్కిస్తారు.
 
 2014లో క్షయవ్యాధితో 15 లక్షల మంది మృతి ప్రపంచవ్యాప్తంగా 2014లో క్షయవ్యాధితో 15 లక్షల మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అక్టోబరు 29న తన నివేదికలో ప్రకటించింది. 2014లో ప్రపంచవ్యాప్తంగా 96 లక్షల మందికి కొత్తగా క్షయ వ్యాధి సోకింది. భారత్‌లో అత్యధికంగా 23 శాతం కేసులు నమోదయ్యాయి. ఇండోనేషియా, చైనాలో 10 శాతం చొప్పున నమోదయ్యాయి. 2014లో మరణించిన 15 లక్షల మందిలో మూడింట రెండొంతుల మంది భారత్, నైజీరియాలోనే ఉన్నారు. క్షయవ్యాప్తి 1990లో కన్నా 2015లో 42 శాతం తగ్గినట్లు నివేదిక తెలిపింది.
 
 నేపాల్ అధ్యక్షురాలిగా విద్యాదేవి భండారీ
 నేపాల్ తొలి మహిళా అధ్యక్షురాలిగా కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు విద్యాదేవి భండారీ అక్టోబరు 28న ఎన్నికయ్యారు. నేపాల్ పార్లమెంట్‌లో విద్యాదేవికి 327 ఓట్లు లభించగా ప్రత్యర్థి నేపాలీ కాంగ్రెస్ నేత కుల్ బహదూర్ గురుంగ్‌కు 214 ఓట్లు దక్కాయి. సీపీఎన్-యూఎంఎల్ ఉపాధ్యక్షురాలిగా ఉన్న విద్యాదేవి (54) గతంలో నేపాల్ తొలి రక్షణ మంత్రిగా 2009 మే నుంచి 2011 ఫిబ్రవరి వరకు పనిచేశారు.
 
 క్రీడలు
 సానియా-హింగిస్‌లకు డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్ సానియా మీర్జా(భారత్), మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్)లు డబ్ల్యూటీఏ ఫైనల్స్ మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. నవంబరు 1న సింగపూర్‌లో జరిగిన ఫైనల్లో ముగురుజ-సురెజ్ నవారో(స్పెయిన్) జోడిని సానియా-హింగిస్ ఓడించారు. ఈ సీజన్‌లో వీరు పది టోర్నమెంట్లలో ఫైనల్స్‌కు చేరుకోగా తొమ్మిదింట్లో గెలిచారు. ఇందులో వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ కూడా ఉన్నాయి. సానియాకు ఇది రెండో డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్. ఈ గెలుపుతో హింగిస్ కెరీర్‌లో 50 డబ్ల్యూటీఏ టైటిళ్లు సాధించిన క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది.
 
 వార్తల్లో వ్యక్తులు
 హీరో సంస్థ వ్యవస్థాపకుడు ముంజాల్ మృతి ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ వ్యవస్థాపకుడు మోహన్‌లాల్ ముంజాల్ (92) ఢిల్లీలో నవంబరు 1న మృతి చెందారు. లూథియానాలో సైకిల్ విడిభాగాల తయారీని ఆయన తొలుత ప్రారంభించారు. 1956లో హీరో సంస్థను ఏర్పాటు చేశారు.
 
 అవార్డులు
  రైఫ్ బదావీకి  ఐరోపా మానవహక్కుల అవార్డు సౌదీ బ్లాగర్ రైఫ్ బదావీకి ప్రతిష్టాత్మక సఖరోవ్ మానవహక్కుల పురస్కారం లభించింది. అక్టోబరు 29న ఐరోపా పార్లమెంట్ బదావీకి ఈ అవార్డును ప్రకటించింది. వాక్ స్వాతంత్య్రం కోసం బదావీ పోరాడారు. సౌదీ లిబరల్ నెట్‌వర్క్ అనే చర్చావేదికను ఏర్పాటు చేసి ప్రజా జీవితంపై మత ప్రభావాన్ని అరికట్టాలని ఆయన పిలుపు నిచ్చారు. 2012లో ఆయనను అరెస్ట్ చేసి వెబ్‌సైట్‌ను మూసివేశారు.
 
 అత్యంత గౌరవనీయ వ్యక్తుల్లో మండేలాకు మొదటి స్థానం  ప్రపంచవ్యాప్తంగా రూపొందించిన అత్యంత గౌరవనీయ వ్యక్తుల జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మొదటిస్థానంలో నిలిచారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ఈ జాబితాను అక్టోబరు 28న విడుదల చేసింది. 2015 సంవత్సరానికి నిర్వహించిన సర్వేలో పోప్ ఫ్రాన్సిన్ రెండో స్థానంలో, టెస్లా మోటార్స్ సీఈఓ ఎలాన్ ముస్క్ మూడోస్థానంలో ఉన్నారు. మహాత్మాగాంధీకి నాలుగోస్థానం దక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ పదోస్థానంలో నిలిచారు.
 
 సంక్షిప్తంగా
 దేశంలో 93 శాతం పెద్దలు ఆధార్ కార్డును పొందారని ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) వెల్లడించింది. ఆధార్ నమోదులో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. క్యూబాపై అమెరికా ఆంక్షలు విధించడాన్ని ఐక్యరాజ్యసమితిలోని 190 దేశాలు ఖండించాయి. ఈ మేరకు ఐరాసలో క్యూబాకు మద్దతుగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా, ఇజ్రాయెల్ మినహా అన్ని సభ్యదేశాలు సమర్థించాయి.
 
 ప్రపంచంలో అత్యధికంగా పసిడి వినియోగిస్తున్న దేశాల్లో భారత్ మొదటిస్థానంలో నిలిచింది. ఈ ఏడాది భారత్ తొమ్మిది నెలల్లో 642 టన్నుల బంగారాన్ని వినియోగించిందని జీఎఫ్‌ఎంఎస్ గోల్డ్ సర్వే 2015 మూడో త్రైమాసిక రిపోర్టులో థామ్సన్ రాయిటర్స్ పేర్కొంది. రెండో స్థానంలో చైనా నిలిచింది.  అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతిని పురస్కరించుకుని ‘ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement