కాలేజీలపై తనిఖీ కొరడా | Sakshi
Sakshi News home page

కాలేజీలపై తనిఖీ కొరడా

Published Thu, Jul 24 2014 2:33 AM

కాలేజీలపై తనిఖీ కొరడా

సాక్షి,  హైదరాబాద్: నాణ్యతా ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్ కాలేజీలపై కొరడా ఝుళిపించేందుకు రంగం సిద్ధం అవుతోంది. అరకొర వేతనాలు, అనర్హులైన ఫ్యాకల్టీతో నెట్టుకొచ్చే కాలేజీలకు చెక్ పెట్టేందుకు కసరత్తు మొదలైంది. 654 ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యతపై తనిఖీలు చేసి రూపొందించిన టాస్క్‌ఫోర్స్ నివేదిక ఆధారంగా ఈ చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రవేశాలు ఆలస్యం అవుతున్నాయని, వెంటనే కౌన్సెలింగ్ చేపట్టాలని వస్తున్న డిమాండ్ల వెనుక ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు ఉన్నాయనే అనుమానాలు అధికారుల్లో వ్యక్తమవుతున్నాయి. మరో పక్క విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించని కాలేజీలు అవసరం లేదనే వాదనలు వస్తున్నాయి. యాజమాన్యాలు అడ్డగోలు విధానాలతో  తప్పిదాలకు పాల్పడ్డాయన్న టాస్క్‌ఫోర్స్ నివేదికనే ఆయుధంగా చేసుకొని అందులో పేర్కొన్న లోపాలపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది.  అధికారికంగా తెలంగాణ జిల్లాల్లోని కాలేజీల్లో ఓపెన్ కోటాలో చేరే ఏపీ విద్యార్థులు 40వేల మంది, అలాగే 1956 కటాఫ్ సంవత్సరం ఆధారంగా మరో 60వేల మంది వరకు ఏపీ విద్యార్థులు ఉంటారని లెక్కలు వేస్తున్నారు. ఏపీ విద్యార్థులకు ఫీజులు ఇస్తే పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు వారికి కూడా ఫీజులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో కేవలం తెలంగాణ విద్యార్థులకే ఫీజులు ఇవ్వాలని అధికార యంత్రాంగం భావిస్తోంది.

ఏడాది తరువాత బయటకు...

గత ప్రభుత్వ హయాంలో తనిఖీలు పూర్తిచేసి, నివేదిక ఇచ్చాక కూడా ఏడాదిపాటు తొక్కిపెట్టిన టాస్క్‌ఫోర్స్ నివేదికను బయటకు తెచ్చేందుకు ప్రభుత్వవర్గాలు నడుం బిగించాయి. నివేదికలో పేర్కొన్న ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నాయి. కొన్ని గ్రాడ్యుయేషన్, మరికొన్ని పోస్టు గ్రాడ్యుయేషన్ కాలేజీలు విద్యార్థుల్లేకపోయినా రికార్డుల్లో చూపి  ప్రభుత్వం ఇచ్చే ఫీజులను దండుకుంటున్నాయనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. అందుకే ప్రధాన అంశాలతో అందజేసిన నివేదికతోపాటు ఎక్కువగా లోపాలున్న కాలేజీల వారీ నివేదికలపైనా పరిశీలనకు యంత్రాంగం సిద్ధమైంది. కాలేజీల వారీగా పనితీరును, విద్యార్థులకందిస్తున్న బోధన స్థితిగతులను, ఫ్యాకల్టీ అర్హతలు, వారికి చెల్లిస్తున్న వేతనాలు, ఇతర అన్ని వివరాలపైనా లోతుగా పరిశీలించేందుకు యంత్రాంగం సిద్ధం అవుతోంది. అనంతరం తగిన చర్యలు చేపట్టనుంది.

ఇక్కడే అత్యధిక కాలేజీలు..

దేశవ్యాప్తంగా 2,500 వరకు మాత్రమే ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే అందులో 715 కాలేజీలు తెలంగాణ, ఏపీల్లోనే ఉన్నాయి. ప్రభుత్వం ఫీజులు ఇస్తుందనే ఆశతో పుట్టగొడుగుల్లా కాలేజీలను ఏర్పాటు చేశారనే భావన ఉంది. ప్రస్తుతం తెలంగాణలోనే 330 వరకు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 3.40 లక్షల సీట్లు ఉంటే ఒక్క తెలంగాణలోనే 2 లక్షల వరకు సీట్లు ఉండటం గమనార్హం. తగిన ప్రమాణాలు పాటించని కళాశాలలకు అడ్డుకట్ట వేయడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించవచ్చని అధికారులు యోచిస్తున్నారు.

టాస్క్‌ఫోర్స్ నివేదిక స్పష్టం చేసిన ప్రధాన లోపాలు ఇవే..

ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం మెజారిటీ కాలేజీల్లో తగిన ఫ్యాకల్టీ లేరు. ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీ ఉండాలి. కాని 622 కాలేజీల్లో అలా లేరు. నిబంధనల ప్రకారం కేవలం 32 కాలేజీల్లోనే ఉన్నారు. 1:45 నిష్పత్తిలో ఫ్యాకల్టీ 44 కాలేజీల్లో ఉండగా 1:51, అంతకంటే ఎక్కువ నిష్పత్తిలో 171 కాలేజీల్లో ఫ్యాకల్టీ ఉన్నారు.

బోధించే వారికి కనీసంగా ఎంటెక్ అర్హత ఉండాలనే నిబంధనను పాటించలేదు. చాలా కాలేజీల్లో బీటెక్ విద్యార్థులే బోధన చేస్తున్నారు. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీకి 6వ పీఆర్‌సీ వేతనాలను చెల్లించాల్సి ఉన్నా దానిని అమలు చేయడం లేదు. 12 కాలేజీల్లోనే 6వ పీఆర్‌సీ వేతనాలు అమలవుతున్నాయి.  68 కాలేజీలు కొంత అటూ ఇటుగా చెల్లిస్తున్నాయి. 561 కాలేజీల్లో నెలకు రూ. 8 వేల నుంచి రూ. 65 వేల వరకు కన్సాలిడేటెడ్ వేతనాలుగా చెల్లిస్తున్నాయి. 593 కాలేజీల్లో బోధనేతర సిబ్బందికి కన్సాలిడేటెడ్ వేతనాలే.

654 కాలేజీల్లో 8,398 మంది పీహెచ్‌డీ చేసిన ప్రొఫెసర్లు ఉండాలి. కాని అర్హులు 2,182 మాత్రమే ఉన్నారు. 16,796 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు అవసరం కాగా పీహెచ్‌డీ, ఎంటెక్ చేసిన వారు 4,789 మాత్రమే ఉన్నారు. 50,391 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు గాను 32,833 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఎంటెక్, బీటెక్ వారే పని చేస్తున్నారు. 122 కాలేజీల్లో బీఈ/బీటెక్ అర్హతలతోనే ఫ్యాకల్టీగా పనిచేస్తున్న వారు 15,233 మంది. మరో 532 మందికి పీహెచ్‌డీ లేకపోయినా ప్రొఫెసర్లుగా కొనసాగుతున్నారు.

319 కాలేజీల్లో నిబంధనల ప్రకారం తరగతి గదులు, నిర్మాణాలు లేవు. - 393 కాలేజీల్లో కంప్యూటర్లు నిర్ణీత సంఖ్యలో లేవు. - 449 కాలేజీల్లో ల్యాబ్ గదులు నిబంధనల ప్రకారం లేనేలేవు. - 565 కాలేజీల్లో ల్యాబ్‌లలో ఉండాల్సిన ఎక్విప్‌మెంట్ లేనేలేదు. - 146 కాలేజీల లైబ్రరీల్లో పుస్తకాల్లేవు.

2011-12 విద్యా సంవత్సరంలో 421 కాలేజీల్లో 265 కంపెనీలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ చేపడితే కేవలం 17,652 మందికే ఉద్యోగాలు వచ్చాయి.


 

 
Advertisement
 
Advertisement