
ఏటా ఇదో ప్రహసనంలా మారిందంటూ హైకోర్టు వ్యాఖ్య
ఫీజు పెంపు కోరుతూ ఇంజనీరింగ్ కాలేజీల పిటిషన్లపై విచారణ
టీఏఎఫ్‌ఆర్‌సీ తీరుపై అసంతృప్తి.. నేడు మధ్యంతర ఉత్తర్వులిస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై జూన్‌లోగా నిర్ణయం తీసుకోలేరా? అని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ)పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏటా ఫీజుల అంశం ఓ ప్రహసనంలా మారిందని.. కౌన్సెలింగ్ ముగిసి తరగతులు మొదలయ్యే వరకు తేల్చకుండా కమిటీ వ్యవహరిస్తోందని విమర్శించింది. సీట్లు, ఫీజులు.. ఇలా ఏదో ఒక కారణంతో ఏటా కాలేజీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం సర్వసాధారణంగా మారిందని వ్యాఖ్యానించింది. నెలలుగా జరుగుతున్న అంశంలో లంచ్ మోషన్ రూపంలో పిటిషన్లు వేయడంపై కాలేజీల తీరును తప్పుబట్టింది. ఫీజుల పెంపుపై శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది.
ఫీజుల పెంపునకు ప్రభుత్వం నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ పలు ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టులో లంచ్ మోషన్ రూపంలో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం విచారణ చేపట్టారు. కాలేజీల తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ 2024 డిసెంబర్‌లోనే ఇంజనీరింగ్ కళాశాలలు ప్రతిపాదనలు సమర్పించాయన్నారు. మార్చిలో భేటీ అయిన కమిటీ ఆ ప్రతిపాదనలకు అంగీకరించిందని చెప్పారు. దీనికి రిజిస్టర్‌లో నమోదు చేసిన వివరాలే సాక్ష్యమన్నారు. దీంతో రిజిస్టర్‌ను వెంటనే కోర్టు ముందు ఉంచాలని అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు.
అనంతరం టీఏఎఫ్‌ఆర్‌సీ తరఫు సీనియర్ న్యాయవాది శ్రీరఘురాం వాదనలు వినిపిస్తూ కాలేజీలు లాభాపేక్షతో పనిచేయరాదంటూ సుప్రీంకోర్టు గతంలో చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. కాలేజీల ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోవడానికి సమయంపట్టే అవకాశం ఉన్నందున బ్లాక్ పీరియడ్ (2022–23 నుంచి 2024–25)లోని ఫీజులనే 2025–26కు కమిటీ సిఫార్సు చేసిందన్నారు. మధ్యంతర ఉత్తర్వుల్లో పెంపునకు అనుమతిస్తే తీర్పు విరుద్ధంగా వచి్చనా తిరిగి విద్యార్థులకు చెల్లించబోరని పేర్కొన్నారు.
70 శాతం పెంపు కోరుతున్నారు..
ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ కమిటీ ప్రతిపాదనలను ఆమోదించడం మాత్రమే సర్కార్ బాధ్యతన్నారు. కొన్ని కాలేజీలు 70 శాతం వరకు పెంపును కోరుతున్నాయని.. ఆ మేరకు పెంపునకు అనుమతిస్తే విద్యార్థులపై భారీగా భారం పడుతుందని నివేదించారు. దీనివల్ల లక్షన్నర మంది విద్యార్థులు ప్రభావితం అవుతారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి మూడేళ్లకోసారి ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఆ మేరకు చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
డిసెంబర్‌లో ప్రతిపాదనలు పంపిస్తే జూన్ వరకు ఏం చేశారని టీఏఎఫ్‌ఆర్‌సీని ప్రశ్నించారు. మార్చిలో నోటిఫై చేసినప్పుడు కాలేజీలైనా తెలుసుకోవాలని కదా అని వ్యాఖ్యానించారు. కౌన్సెలింగ్, అడ్మిషన్ల సమయం దాకా కాలయాపన చేయడాన్ని తప్పుబట్టింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ ఉన్నా ప్రతిపాదనలపై ఆలస్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించింది. శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. కాగా, కేశవ్ మెమోరియల్ పిటిషన్‌ను మరో న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు.
సీబీఐటీకి గ్రీన్‌సిగ్నల్..
ఫీజుల పెంపునకు టీఏఎఫ్‌ఆర్‌సీ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సీబీఐటీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఫీజు పెంపునకు అనుమతించారు. బీఈ, బీటెక్‌కు రూ. 2,23,000, ఎంటెక్‌కు రూ. 1,51,600, ఎంబీఏ, ఎంసీఏకు రూ. 1,40,000 పెంచాలని.. ఈ మేరకు టీజీఈఏపీసీఈటీ అడ్మిషన్లలో మార్పు చేయాలని కన్వినర్‌ను ఆదేశించారు. 2025–26, 2027–28 బ్లాక్ పీరియడ్‌కు ఈ ఫీజులు వర్తిస్తాయని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు.