చలి కొరికిన ఆత్మ

Kolyma Tales Famous Story In Russia - Sakshi

కథాసారం

రాత్రి భోజనం అయింది. గిలియబొవ్‌ మనసారా తన గిన్నెనంతా నాకి, టేబుల్‌ మీద పడిన రొట్టె తుంపులను ఒడుపుగా తన ఎడమ చేతిలోకి ఊడ్చుకున్నాడు. అమాంతం మింగేయకుండా, తన నోటిలో ఊరిన లాలాజలం ఆ రొట్టెలో ప్రతి చిన్న తునకనూ తడపి ముద్దజేయడాన్ని అనుభవించాడు.  దాని రుచి బాగుందో, లేదో మాత్రం గిలియబొవ్‌ చెప్పలేడు. అన్నింటినీ మరిపింపజేసే ఈ తీక్షణమైన అనుభవంతో పోలిస్తే రుచి అనేది చాలా స్వల్ప విషయం. దాన్ని మింగడానికి గిలియబొవ్‌ ఏమీ తొందర పడలేదు; దానికదే నోట్లో వేగంగా కరిగి కనబడకుండా మాయమైంది. గిలియబొవ్‌ నోటి నుంచి తన మిణుకుమంటున్న గుంటలుపడిన కళ్లను తిప్పుకోలేకపోయాడు బాగ్రెత్సోవ్‌. మరొకరి నోటిలోకి మాయమవుతున్న తిండిని చూస్తూ కళ్లు తిప్పుకోగలిగే శక్తి అక్కడ ఎవరికీ లేదు. గిలియబొవ్‌ తన లాలాజలమంతా మింగేయగానే, దూరంగా ఆకాశం మీదికి పాకుతూ వస్తున్న పెద్ద నారింజరంగు చంద్రుడి మీదకు బాగ్రెత్సోవ్‌ తన చూపును మార్చుకున్నాడు.

‘‘ఇదే అదును,’’ అన్నాడు బాగ్రెత్సోవ్‌. మౌనంగా వాళ్లిద్దరూ ఒక పెద్ద రాయి దగ్గరికి కొనిపోయే తోవ వెంట నడిచి, ఒక కొండను చుట్టుకొనివున్న చిన్న దిన్నెను ఎక్కారు. కాసేపటి కిందే పొద్దు మునిగినప్పటికీ, పగటి పూట తమ రబ్బరు బూట్లలోని బిత్తల కాళ్లను మండించిన ఈ రాళ్లు అప్పటికే చల్లబడి ఉన్నాయి. గిలియబొవ్‌ తన పై జాకెట్‌ గుండీలు పెట్టుకున్నాడు. నడక కూడా అతడిని వెచ్చబరచలేదు.‘‘అదింకా చాలా దూరమా?’’ గుసగుసగా అడిగాడు. ‘‘బాగా,’’ నెమ్మదిగా బదులిచ్చాడు బాగ్రెత్సోవ్‌. కాసేపు అలుపు తీర్చుకోవడానికి కూలబడ్డారు. మాట్లాడుకోవాల్సింది గానీ, ఆలోచించవలసింది గానీ ఏమీ లేదు– అంతా స్పష్టంగా, సులువుగా ఉంది. ఆ దిన్నె చివరున్న సమస్థలంలో ఒక రాళ్లకుప్పా, తవ్విపోయగా ఎండిన మట్టికుప్పా ఉన్నాయి. ‘‘ఇదంతా నాకు నేనే చేసుకుందును,’’ వంకరగా నవ్వుతూ అన్నాడు బాగ్రెత్సోవ్‌. ‘‘కానీ ఇద్దరమూ కలిసి చేస్తే మజాగా ఉంటుంది, పైగా నువ్వు నా పాత స్నేహితుడివాయె...’’ గతేడాది వాళ్లిద్దరూ ఒకే నౌక మీద ఇక్కడికి తేబడ్డారు. బాగ్రెత్సోవ్‌ మాటలు ఆపేశాడు. ‘‘వంగు, లేదంటే కనబడతాం.’’

ఇద్దరూ వంగునే రాళ్లను పక్కకు విసరసాగారు. ఇక్కడున్న ఏ రాయి కూడా వీళ్లిద్దరూ కలిసి ఎత్తలేనంత, కదల్చలేనంత బరువున్నది కాదు; పొద్దున వాటిని ఇక్కడ కుప్ప బోసిన ఎవరూ కూడా గిలియబొవ్‌ కన్నా బలమైనవాళ్లేం కాదు. బాగ్రెత్సోవ్‌ తనను తాను తిట్టుకున్నాడు: అతడి వేలు తెగి నెత్తురు కారసాగింది. గాయం మీద  కొంచెం ఇసుక చల్లుకున్నాడు, తన జాకెట్‌కున్న అతుకులోంచి చిన్నబట్టపేగును చింపి గాయాన్ని ఒత్తుకున్నాడు, అయినా రక్తం ఆగలేదు. ‘‘రక్తం గడ్డకట్టడం లేదు,’’ ఉదాసీనంగా అన్నాడు గిలియబొవ్‌. ‘‘దీనికి మునుపు నువ్వు డాక్టరా?’’ అడిగాడు బాగ్రెత్సోవ్, రక్తాన్ని నోటితో పీల్చుకుంటూ. గిలియబొవ్‌ మాట్లాడలేదు. అతడు వైద్యుడిగా ఉండిన కాలం ఎప్పుడో చాలా ఏళ్ల క్రితపు సంగతిలా తోచింది. అసలు వైద్యుడిగా పనిచేశాడా? చాలాసార్లు అతడికి ఈ పర్వతాల, సముద్రాల ఆవలి ప్రపంచం అవాస్తవికంగా, ఒక స్వప్నంలా, కల్పనలా కనబడుతుంది. వాస్తవం ఏమిటంటే, ఈ నిమిషం, ఈ గంట, ఈ రోజు– నిద్ర లేపుతూ వినబడే నగారా ధ్వని మొదలు, ఇక పని ఆపవచ్చని వచ్చే ఆదేశం వరకే. అంతకుమించి అతడు ఏనాడూ యోచించలేదు, ఆలోచించే శక్తి కూడా లేదు, ఇక్కడున్న అందరికి మళ్లేనే.

తన చుట్టుపక్కలవాళ్ల ఎవరి గతమూ అతడికి తెలీదు, తెలుసుకోవాలన్న ఆసక్తీ లేదు. కానీ రేపెప్పుడైనా బాగ్రెత్సోవ్‌ తాను డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ అనో, విమానయాన సేనాధిపతి అనో వెల్లడిస్తే గనక గిలియబొవ్‌ మారు మాట్లాడకుండా అంగీకరిస్తాడు. కానీ నిజంగా తాను డాక్టర్‌గా పనిచేశాడా? తన యథాలాప అంచనా శక్తితో పాటు, యథాలాప పరిశీలనా శక్తిని కూడా అతడు కోల్పోయాడు. బాగ్రెత్సోవ్‌ తన వేలిని చప్పరించడాన్ని గిలియబొవ్‌ చూశాడుగానీ ఏమీ స్పందించలేదు. పరిస్థితి అతడి చేతనను తాకిందిగానీ తనలోంచి దానికి జవాబును గానీ, ఆ జవాబు ఇవ్వగలిగే సంకల్పబలాన్ని గానీ వెతికే పని పెట్టుకోలేదు. అతడిలో మిగిలిపోయిన చైతన్యం– బహుశా ఇంకేమాత్రం మనిషిది కాని చైతన్యం– కొద్ది పార్శా్వలనే మిగుల్చుకున్నది–  దాని మొత్తం దృష్టీ ఒకే లక్ష్యం మీద ఉంది, అక్కడున్న రాళ్లన్నింటినీ సాధ్యమైనంత త్వరగా తొలగించాలి! ‘‘లోతుగా ఉందంటావా?’’ దమ్ము తీసుకోవడానికి ఆగినప్పుడు అడిగాడు గిలియబొవ్‌. ‘‘లోతుగా ఎలావుంటుంది?’’ బదులిచ్చాడు బాగ్రెత్సోవ్‌. తన ప్రశ్నలోని అసంబద్ధతను గ్రహించాడు గిలియబొవ్, గొయ్యి లోతుగా ఉండే వీలే లేదు.

‘‘ఇదిగో దొరికాడు,’’ అన్నాడు బాగ్రెత్సోవ్‌. ఒక మనిషి కాలి బొటనవేలిని అతడు దొరికించుకున్నాడు. రాళ్ల సందుల్లోంచి పెద్ద వేలు వెన్నెల వెలుగులో స్పష్టంగా కనబడింది. ఆ వేలు గిలియబొవ్‌ వేలిలాగానో, బాగ్రెత్సోవ్‌దిగానో లేదు– నిర్జీవంగా, బిరుసుగా ఉండటం దానికి కారణం కాదు, ఆ మాటకొస్తే వాళ్లవి కూడా అలాగే ఉన్నాయి. చచ్చిపోయినవాడి కాలిగోరు కత్తిరించి ఉంది, వేలు మృదువుగా, కండపట్టి ఉంది. వాళ్లు వేగంగా మృతదేహం మీద కుప్పగా ఉన్న రాళ్లను తీసేశారు. ‘‘మరీ కుర్రాడు,’’ బాగ్రెత్సోవ్‌ అన్నాడు. ఇద్దరూ కలిసి కాళ్లను పట్టి శరీరాన్ని బలంగా గోరీ నుంచి బయటికి లాగారు. ‘‘మంచి ఆరోగ్యంగా ఉన్న కుర్రాడు,’’ దమ్ము తీసుకుంటూ అన్నాడు గిలియబొవ్‌. ‘‘అతడు ఇంత బలంగా ఉండకపోయుంటే,’’ కొనసాగించాడు బాగ్రెత్సోవ్‌. ‘‘మనందరిలాగే అతణ్నీ పూడ్చేసివుండేవాళ్లూ, మనం ఇంతదూరం ఈరోజు వచ్చివుండేవాళ్లమూ కాదు.’’ వాళ్లు ఆ శవపు చేతుల్ని చక్కగా చాపి, చొక్కా లాగారు. ‘‘చూడు, ఇతడి చెడ్డీ కొత్తదిలా ఉంది,’’ అన్నాడు బాగ్రెత్సోవ్‌ తృప్తిగా. దాన్ని కూడా పట్టి గుంజారు. గిలియబొవ్‌ ఆ చెడ్డీని తన జాకెట్‌ కింద దాచాడు.

‘‘అది తొడుక్కుంటే మంచిది,’’ చెప్పాడు బాగ్రెత్సోవ్‌. ‘‘వద్దు, వేసుకోను,’’ గొణిగాడు గిలియబొవ్‌. తిరిగి మృతదేహాన్ని గొయ్యిలోకి లాగి, దాని మీద రాళ్లను పేర్చారు. ఇప్పుడు ఇంకాస్త పైకి ఉదయించిన చంద్రుడి నీలపు కాంతి ఆ రాళ్ల మీద, ఆ కురచ మంచు వనాల మీద పడి, ప్రతి రాతి కొననూ, ప్రతి చెట్టునూ ఒక ప్రత్యేకమైన, పగటికి భిన్నమైన కాంతిలో చూపిస్తోంది. చుట్టూ వున్నవన్నీ వాస్తవంగానే కనిపిస్తున్నాయి, కానీ తమ పగటి స్వభావాన్ని పోగొట్టుకున్నాయి. ప్రపంచానికి ఏదో రెండో ముఖం, చీకటి ముఖం ఉన్నట్టు. చచ్చిపోయినవాడి చెడ్డీ గిలియబొవ్‌ జాకెట్‌ కింద వెచ్చగా ఉంది, అది ఇంక ఎంతమాత్రమూ పరాయిదిగా అనిపించలేదు. ‘‘నాకు పొగ తాగాలని ఉంది,’’ కలలో విహరిస్తున్నట్టుగా అన్నాడు గిలియబొవ్‌. ‘‘రేపు నీకు తప్పకుండా దొరుకుతుంది,’’ నవ్వుతూ బదులిచ్చాడు బాగ్రెత్సోవ్‌. రేపు వాళ్లు ఆ బట్టలు అమ్ముతారు, బదులుగా రొట్టెను పొందుతారు, ఏమో, కొంత పొగాకు కూడా దొరకొచ్చు...

స్టాలిన్‌ హయాంలో ‘గులాగ్‌’లుగా పిలిచే సైబీరియా నిర్బంధ క్యాంపుల్లో మైనస్‌ 60 డిగ్రీల చలిలో, మనుషు లుగా ఇంకేమాత్రం మిగల కుండా బతకాల్సిన దుస్థితిని ఈ 1954 నాటి రష్యన్‌ కథ చిత్రించింది. రచయిత వర్లామ్‌ షలమోవ్‌ (1907–1982) స్వయంగా అందులో ఒక క్యాంపైన కొలీమా బాధితుడు. ఏళ్ల తరబడి రాజకీయ ఖైదీగా శిక్షను అనుభవించి, విడుదలైన తర్వాత తన అనుభవాల సారంతో రాసిన కథలే ‘కొలీమా టేల్స్‌’గా ప్రసిద్ధి కెక్కాయి. ఈ కథను ‘ఇన్‌ ద నైట్‌’ పేరుతో జాన్‌ రీడ్, ‘ఎట్‌ నైట్‌’ పేరుతో డొనాల్డ్‌ రేఫీల్డ్‌ ఇంగ్లీషులోకి అనువదించారు. ఆ రెండింటి ఆధారంగా తెలుగు అనువాదం: సాహిత్యం డెస్క్‌.
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top