హఠాత్తుగా ఒక రోజు... ఏక్ దిన్ అచానక్....

హఠాత్తుగా ఒక రోజు...  ఏక్ దిన్ అచానక్.... - Sakshi

బడబడమని కురుస్తున్న వర్షం. దడదడమని మెరుపులు. అర్ధరాత్రి అవుతోంది. ఆ ఇంట్లోని తల్లి, పెద్ద కూతురు, కొడుకు, చిన్న కూతురు అందరూ కారిడార్‌లో నిలబడి వీధి వైపు చూస్తూ ఉన్నారు. కాని వాళ్లు ఎదురు చూస్తున్న ఆ ఇంటి పెద్ద రాలేదు. సాయంత్రం వెళ్లాడు- ఇప్పుడే వస్తానని. కాని రాలేదు. ఎక్కడ వెతికినా లేడు. ఎవరిని అడిగినా తెలియదు. పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. పత్తా లేడు. అతనేం పిచ్చివాడా? రిటైర్డ్ ప్రొఫెసర్. ఇల్లు ఉంది. వాకిలి ఉంది. భార్య... పిల్లలు... కాని వెళ్లిపోయాడు. ముసలి వయసులో. ఎందుకు వెళ్లిపోయి ఉంటాడు? 

 

 అతనికి బాధ్యత లేదు అని కొడుకు అన్నాడు. అతడికి ఇల్లు పట్టలేదు అని భార్య అంది. అతడు ఒక మామూలు మనిషి... కాని మనం ఒక మేధావి అనుకున్నాం అని పెద్ద కూతురు అంది. అతడొక అహంకారి అని చిన్న కూతురు భావించింది. రోజులు గడిచాయి. మళ్లీ వానాకాలం వచ్చింది. తండ్రి ఆచూకీ లేదు. అతడు ఉండగా బాధ్యతగానే ఉండేవాడు అని కొడుక్కి అనిపించింది. అతడు ఉండగా ఇంటిని పట్టించుకునేవాడు అని భార్యకు అనిపించింది. అతడు మేధావి అని పెద్ద కూతురికి అనిపించింది. అతడు నిగర్వి అని చిన్న కూతురికి అనిపించింది. కాని అతడు ఏమిటి? ఏమో ఇవన్నీ కావచ్చు. అసలేమీ కాకపోవచ్చు. మరి అతడు ఎందుకు వెళ్లిపోయాడు? మనందరి జీవితంలో ఏదో ఒక వెలితి ఉంటుంది. ఒక మీడియోక్రసీ ఉంటుంది. అసలైనదేదో చేయకుండా ఒక నాటకంలో పాత్రధారిలాగా మారిపోతూ ఉంటాం. కాని ఏం చేయగలం? మనకుండేది ఒకే జీవితం. ఒకలాంటి జీవితం. ఇంకోలా జీవించాలంటే వీలుండదు. ఆ సంగతి తెలిసి ఇంకోలాంటి జీవితాన్ని వెతుక్కుంటూ అతడు వెళ్లిపోయాడా? మళ్లీ రానున్నాడా? ‘ఏక్ దిన్ అచానక్’ మృణాల్‌సేన్ తీసిన గొప్ప సినిమాల్లో ఒకటి. ఊపిరి బిగపట్టి చూసేలా కేవలం ఒక ఇంటిలో నలుగురు పాత్రల మధ్య  అతడు ఈ సినిమా (1989లో) తీశాడంటే అద్భుతం. శ్రీరామ్ లాగూ, షబానా ఆజ్మీ... వీళ్లను చూస్తుంటే మనుషులు పాత్రలుగా మారడం... స్టన్నింగ్. ఇది బెంగాలీలో రామపాద చౌదురి రాసిన ‘బీజ్’ అనే నవల. హిందీలో ఒక మరపురాని సినిమా. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయ్.  Ek Din Achanak అని కొట్టి చూడండి.

 
Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top