సత్వర ఆచరణే కీలకం

Editorial On Jammu and Kashmir  - Sakshi

జమ్మూ–కశ్మీర్‌కి ఉన్న ప్రత్యేక హక్కులు, అధికారాలను రద్దు చేయాలని, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలని నిర్ణయించిన మూడురోజుల తర్వాత ఆ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దాదాపు 40 నిమిషాలు సాగిన ఆ ప్రసంగంలో సాధ్యమైనంత త్వరగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ రాష్ట్ర ప్రతిపత్తి, స్థానిక యువతకు విద్య, ఉద్యోగావకాశాలు వగైరాలు ప్రస్తావనకొచ్చాయి. ప్రభుత్వాలు ప్రకటించే ఏ విధాన నిర్ణయంపైన అయినా అనుకూల, ప్రతికూతలు వ్యక్తం కావడం సర్వసాధా రణం. ప్రస్తుత నిర్ణయం కశ్మీర్‌కి సంబంధించింది కనుక వాటి తీవ్రత అధికంగానే ఉంది. అయితే జమ్మూ–కశ్మీర్‌లో వర్తమాన స్థితిగతులెలా ఉన్నాయో, కేంద్రం తీసుకున్న చర్యలపై అక్కడి పౌరుల మనోభావాలెలా ఉన్నాయో, వారి స్పందనేమిటో తెలియడానికి మరికొంతకాలం పడుతుంది. పరి స్థితులన్నీ కుదుటపడి, ఇప్పుడు విధించిన ఆంక్షలన్నీ రద్దయ్యాక మాత్రమే అవి తెలిసే అవకాశం ఉంది. జనం కదలికలపై ఆంక్షలు విధించాక గత అయిదురోజులుగా సాధారణ ప్రజానీకం అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చానెళ్లలో వస్తున్న కథనాలు చెబుతున్నాయి.  ప్రస్తుతం ఉన్న ఆంక్షల్ని క్రమేపీ సడలిస్తామని ఈ ప్రసంగంలో మోదీ హామీ ఇచ్చారు గనుక పరిస్థితులు త్వరలోనే కుదుటపడతాయని ఆశించాలి. వచ్చే సోమవారం బక్రీద్‌ పర్వదినం. ఈలోగానే అంతా చక్కబడితే సాధారణ ప్రజానీకం ఉత్సాహంగా పండుగ చేసుకోగలుగుతారు.

దేశ విభజన నాటినుంచీ కశ్మీర్‌పై కన్నేసిన పాకిస్తాన్‌ అక్కడ ఏదో విధంగా చిచ్చు రేపాలని ప్రయత్నిస్తూనే ఉంది. 35 ఏళ్లక్రితం కాంగ్రెస్‌ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరించిన అపసవ్య విధానాలు ఉగ్రవాదం వేళ్లూనుకోవడానికి తోడ్పడ్డాయి. ఇదే అదునుగా పాకిస్తాన్‌ తన కోరలు చాచడం మొదలుపెట్టింది. తదనంతరకాలంలో వచ్చిన ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు కూడా ఫలించకపోగా పరిస్థితులు మరింత వికటించడానికి కారణమయ్యాయి. భద్రతాబలగాలపై దాడులు, నిరవధిక ఉద్యమాలు, ఆందోళనలు యధావిధిగా సాగుతూనే వచ్చాయి. అంతర్గతంగా కశ్మీర్‌లో అధికారం చలాయించడానికి సంబంధించి ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటీ ఉన్నా అంతర్జాతీయంగా కశ్మీర్‌ సమస్యలో మూడో పక్షం జోక్యాన్ని అవి గట్టిగా వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రద్దు చేసిన రాజ్యాంగ అధికరణలు 370, 35ఏ వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగకపోగా అవి ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని విస్తరింపజేసేందుకు పాకిస్తాన్‌కు తోడ్పడ్డాయ న్నది మోదీ అభియోగం.

కనుక కేంద్రం ఈ సమస్య మూలాల్ని కొత్త కోణం నుంచి చూస్తున్నదని అర్ధమవుతుంది. ఈ రెండు అధికరణల తొలగింపుతో పరిస్థితులు చక్కబడి, అభివృద్ధికి బాటలు పడతాయని ఆయన ఆశిస్తున్నారు. అక్కడ నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్‌ ప్రాజెక్టులు, రోడ్డు రవాణా తదితర మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యమిస్తామని ఆయన ఇచ్చిన హామీ అయినా... ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పాటు చేస్తామని, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చేసిన వాగ్దానమైనా ఆచరణలోకొస్తే యువతకు ఎంతో మేలు కలుగుతుంది. ఇటీవలికాలంలో సివిల్‌ సర్వీసులకు జమ్మూ–కశ్మీర్‌ నుంచి ఎంపికవుతున్న యువత సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే అక్కడివారికి దేశంలోని ఇతర ప్రాంతాల్లో చదువుకునేందుకు ఇప్పుడు కల్పిస్తున్న అవకా శాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. ఉపాధి కల్పించడంలోనూ ఆ దృక్పథమే ఉండాలి. అలాంటి చర్యలు ఈ దేశంలో తామూ భాగమేనన్న విశ్వాసాన్ని వారికి కలిగిస్తాయి.

కశ్మీర్‌ లోయలో ఇటీవలికాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు అందరికీ ఆందోళన కలిగి స్తూనే ఉన్నాయి. ప్రధాన స్రవంతి పార్టీల నేతలంతా ఈపాటికే ఈ సంగతి గ్రహించారు. మధ్యేవాద హుర్రియత్‌ కాన్ఫరెన్స్‌ వంటి సంస్థలకే దిక్కుతోచని స్థితి ఏర్పడితే నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ), పీడీపీ వంటి పార్టీల గురించి చెప్పనవసరం లేదు. ఎన్‌సీ, పీడీపీలది స్వయంకృతం. అవి రెండూ గతంలో కేంద్రంతో తాము పోరాడుతున్నామని, రాష్ట్రానికి అవసరమైనవి సాధిస్తున్నామని చెప్పేం దుకు ప్రయత్నించేవి. కానీ ఇటీవలి కాలంలో ఆ పార్టీలు కేంద్రంలో ఎవరుంటే వారితో పొత్తు కుదుర్చుకోవడానికి, రాజీ పడేందుకు సిద్ధపడ్డాయి. ఎన్నికల్లో ప్రత్యర్థులుగా హోరాహోరీ సంఘర్షించిన పీడీపీ, బీజేపీలు ఎన్నికలయ్యాక కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పర్చటం వీటన్నిటికీ పరాకాష్ట. ఇదే సమయంలో ఐఎస్‌ వంటి ఉగ్ర సంస్థల జాడలు నేరుగా కనబడకపోయినా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభావితులైనవారు అనేకులు ఈమధ్యకాలంలో సాయుధ బాట పట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రం కఠిన చర్యలు తీసుకోవడం అవసరమని భావించింది.

ఒక రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడదీయడమన్నది స్వాతంత్య్రం వచ్చాక మొట్టమొదటిసారి జమ్మూ–కశ్మీర్‌ విషయంలోనే జరిగింది. సాధారణంగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటపుడు ప్రభుత్వాలు ఆ దిశగా ప్రజాభిప్రాయాన్ని మలిచేందుకు అవసరమైన రాజకీయ ప్రచారాన్ని ముమ్మరం చేస్తాయి. కానీ జమ్మూ–కశ్మీర్‌ రక్షణపరంగా సున్నితమైన ప్రాంతం. దాని సరిహద్దుల్లో పాకిస్తాన్, చైనా ఉన్నాయి. కనుకనే ఆ తరహా చర్య సమస్యాత్మకంగా మారే అవకాశం ఉందన్న సందేహం కేంద్రా నికి కలిగి ఉండొచ్చు. అయితే తీసుకునే చర్య ఎలాంటిదైనా స్థానికులను విశ్వాసంలోకి తీసుకోవాలి. అప్పుడే దానికి సార్థకత చేకూరుతుంది. మెరుగైన ఫలితాలు వస్తాయి. ఏదేమైనా జనానికి మేలు కలిగించే భిన్న చట్టాల అమలు, భారీ యెత్తున ఉద్యోగాల భర్తీ, మౌలికసదుపాయాల కల్పన, ఉన్నత శ్రేణి విద్యాసంస్థలు, క్రీడల కోసం శిక్షణ కేంద్రాలు వంటివి ఏర్పాటు చేస్తామన్న మోదీ వాగ్దానాలు సాధ్యమైనంత త్వరగా ఆచరణరూపం దాలిస్తే నిజంగానే నయా కశ్మీర్‌కు ఆ చర్యలు దోహదపడతాయి. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top