‘అగ్ని’ పరీక్షలో రెండో విజయం! | Agni-5 success, a key step in defence sector | Sakshi
Sakshi News home page

‘అగ్ని’ పరీక్షలో రెండో విజయం!

Sep 17 2013 12:29 AM | Updated on Sep 1 2017 10:46 PM

మన దగ్గర ఆయుధం ఉందని తెలిస్తే, మనం జాగురూకతతో మెలుగుతున్నామని అర్ధమైతే దాడికి దిగేందుకు శత్రువు సందేహిస్తాడు. ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాడు.

మన దగ్గర ఆయుధం ఉందని తెలిస్తే, మనం జాగురూకతతో మెలుగుతున్నామని అర్ధమైతే దాడికి దిగేందుకు శత్రువు సందేహిస్తాడు. ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాడు. ప్రపంచంలో ఉద్రిక్తతలు తొలగనంతకాలమూ, ధూర్త దేశాలు దారికి రానంత కాలమూ స్వీయ రక్షణ ఏర్పాట్లలో నిత్యమూ నిమగ్నం కావాల్సిందే. లేనట్టయితే, శత్రువు దొంగదెబ్బ తీసే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఆదివారం నాడు ఒడిశాలోని వీలర్ ఐలాండ్‌నుంచి మన శాస్త్రవేత్తలు నిర్వహించిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5 ప్రయోగం ఆ రీత్యా ఎంతో ముఖ్యమైనది. 5,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఎంతో అవలీలగా, ఖచ్చితత్వంతో ఛేదించగల పాటవం ఈ ప్రయోగం ద్వారా మన సొంతమైంది. అగ్ని-5పై ఏడాదిన్నర వ్యవధిలో జరిగిన రెండో పరీక్ష ఇది. ఆఖరి క్షణంలో స్వల్ప అవరోధాలు ఎదురు కావడం వల్ల కౌంట్ డౌన్‌ను కొద్దిసేపు నిలిపేయాల్సివచ్చినా చివరకు అంతా సజావుగా గడిచిపోయింది. 17.5 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో 50 టన్నుల బరువుండే ఈ క్షిపణి 1,360.78 కిలోల బరువుగల అణ్వస్త్రాన్ని అవలీలగా మోసుకుపోగలదు.
 
  ఘన ఇంధనంతో  మూడు అంచెలుగా ఉన్న రాకెట్ల సాయంతో ఇది భూ ఉపరితలం నుంచి 400 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి క్రమేపీ కిందకు దిగి నిర్దేశిత లక్ష్యాన్ని నేరుగా ఢీకొంటుంది. భూవాతావరణం లోకి వచ్చినప్పుడు అది మూడువేల డిగ్రీల సెంటి గ్రేడ్ ఉష్ణోగ్రతను తట్టుకోగలిగేలా నిర్మించారు. ఈ క్షిపణి దూసుకుపోతున్నప్పుడు కోస్తా పొడవునా ఉన్న మన రాడార్లన్నీ రికార్డు చేశాయి. దాని గమనాన్ని, ఉరవడిని శ్రీహరికోటలోని రాడార్లతోపాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న ఇతర కేంద్రాలూ, వేర్వేరుచోట్ల మోహరించిన మూడు నౌకలూ తమ నిఘా నేత్రాలతో వీక్షించాయి. వీటినుంచి సేకరించిన డేటాను రాగలకాలంలో మన శాస్త్రవేత్తలు మరింత లోతుగా విశ్లేషించి ఇంకేమేమి జాగ్రత్తలు అవసరమో నిర్ధారిస్తారు. ఈ క్షిపణిని జలాంతర్గాముల నుంచి ప్రయోగించగల స్థాయికి తీసుకెళ్లే దిశగా తదుపరి ప్రయోగాలుంటాయి. ఇవన్నీ పూర్తయ్యాక మరో రెండేళ్లలో మన రక్షణ దళాలకు ఈ క్షిపణులు అందుబాటులోకొస్తాయి.
 
  ఈ ప్రయోగం అనేకవిధాల మన దేశాన్ని సమున్నత స్థాయికి తీసుకెళ్లింది. ఇందులో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం అత్యంతాధునికమైనదేకాక దేశీయమైనది కూడా. ఇందులోని భిన్న వ్యవస్థలు హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఎల్) శాస్త్రవేత్తలు రూపొందించినవే. అత్యంత ఖచ్చితత్వంతోకూడిన నావిగేషన్ వ్యవస్థలు, అధునాతన మైక్రో నావిగేషన్ వ్యవస్థ, మల్టిపుల్ టెలిమెట్రీ వ్యవస్థ, రాకెట్లను వేరుపర్చే ప్రక్రియకు సంబంధించిన వ్యవస్థ... అన్నీ ఇక్కడ మొగ్గతొడిగినవే. క్షిపణికి అగ్రభాగాన సూదిమొన తేలినట్టుండే కవచం బహుళ లోహాలతో తయారుచేసింది. అత్యంత తేలికగా... అదే సమయంలో దృఢంగా, దూసుకెళ్లేటప్పుడు ఏర్పడే ఒత్తిళ్లను తట్టుకునే విధంగా శాస్త్రవేత్తలు దానికి రూపకల్పన చేశారు. ప్రయోగించిన 20 నిమిషాల తర్వాత హిందూమహాసముద్రంలో నిర్దేశించిన ప్రాంతంలో ఈ క్షిపణి డమ్మీ వార్‌హెడ్‌లను జారవిడిచింది. ఇప్పటికిది 5,000 కిలోమీటర్ల దూరం దూసుకెళ్లగల దూరశ్రేణి క్షిపణే. ఇది మరో 3,000 కిలోమీటర్ల దూరం వెళ్లగలిగేలా చేయడానికి అవసరమైన పరిజ్ఞానం మన శాస్త్రవేత్తలకు ఉంది.  
 
 మన ఆగ్నేయాస్త్రంపై చైనా వ్యాఖ్యాతలు కొందరు వ్యక్తంచేసిన అభిప్రాయాలు గమనించదగ్గవి. భారత్ తన శక్తిని అతిగా అంచనా వేసుకోకూడదట. దురహంకారం కూడదట. ఇలాంటి వ్యాఖ్యలు మన క్షిపణి ప్రయోగం సాఫల్యతకు నిదర్శనం.  చైనావద్ద 13,000 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించే డీఎఫ్-5ఏ ఖండాంతర క్షిపణి ఉంది. అది 3,200 కిలోల బరువుండే అణ్వస్త్రాలను తీసుకెళ్లగలదు. అలాగే, జలాంతర్గామినుంచి ప్రయోగించగల 8,000 కిలోమీటర్ల శ్రేణి జేఎల్-2 క్షిపణులు కూడా ఉన్నాయి. అయితే, మనం ఆ దశకు చేరుకోవడానికి ఎంతో సమయం పట్టదు. మన క్షిపణి కార్యక్రమం ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య మొదలైంది.
 
 ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానమూ మనకు అందుబాటులోకి రానీయకుండా అమెరికా కఠిన ఆంక్షలు విధించిన దశలో 1983లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ డీఆర్‌డీఓపై గెడైడ్ మిసైళ్ల తయారీ బాధ్యతను మోపారు. పృథ్వీవంటి స్వల్ప శ్రేణి క్షిపణిని రూపొందించడంతో మొదలుపెట్టిన మన శాస్త్రవేత్తలు ఎన్నెన్నో అవరోధాలనూ, ఆటంకాలనూ అధిగమించారు. తొలుత 700 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించే అగ్ని-1ని, అటుతర్వాత 2,500 కిలోమీటర్ల లక్ష్యంతో అగ్ని-2ను, ఆపై 3,000 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల అగ్ని-3ని వారు రూపొందించారు. ఇలా మూడు దశాబ్దాల్లోనే స్వదేశీ పరిజ్ఞానంతో అగ్ని-5వంటి దూరశ్రేణి ఖండాంతర క్షిపణిని తయారు చేయగలిగే స్థాయికి చేరుకున్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకుపోగల సత్తా తమకున్నదని భరోసా ఇస్తున్నారు. నిజానికి ఈ సామర్ధ్యాన్ని గుర్తించబట్టే చైనా వ్యాఖ్యాతలు అలా మాట్లాడుతున్నారు. యుద్ధరంగంలో కేవలం ఆయుధాలే నిర్ణయాత్మక శక్తులు కాలేవుగానీ ఆ విషయంలో ఏమరుపాటు ఏమాత్రం కూడదు. ఒకపక్క అటు పాకిస్థాన్, ఇటు చైనా చెట్టాపట్టాలు వేసుకుని మోహరించిన దశలో రక్షణకు సంబంధించి విధానపరమైన నిర్ణయాలను తీసుకోవడంలో ఇంకా నత్తనడకే కనిపిస్తోంది.
 
 రక్షణ కేటాయింపులు పెరుగుతున్న మాట నిజమే అయినా మన త్రివిధ దళాలు ఎన్నో కొరతలను ఎదుర్కొంటున్నాయి. శాస్త్రవేత్తల కృషికి తోడు ఈ విషయంలో కూడా లోటుపాట్లను తీరిస్తే మన భద్రతకు ఢోకా ఉండదు. అలాంటి ప్రయత్నాలన్నీ చేస్తూనే చైనా, పాకిస్థాన్‌లు సరిహద్దుల్లో సాగిస్తున్న అతిక్రమణలపై దృష్టిపెట్టాలి. వాటి పోకడలను ప్రపంచ దేశాల దృష్టికి తె చ్చి నైతికపరమైన ఒత్తిళ్లు పెంచాలి. ఇవన్నీ నిరంతరాయంగా, సమాంతరంగా కొనసాగినప్పుడే శత్రుదేశాలు ఇటువైపు చూడటానికి సాహసించవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement