సమరోత్సాహం | YSRCCP Plenary Success | Sakshi
Sakshi News home page

సమరోత్సాహం

Jul 3 2017 2:02 AM | Updated on Sep 17 2018 7:53 PM

సమరోత్సాహం - Sakshi

సమరోత్సాహం

ఆరేళ్లుగా అలుపెరగని సైనికుల్లా పోరాడుతున్న వైఎస్సార్‌ సీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. భవిష్యత్‌పై భరోసా నింపేలా సాగిన ప్లీనరీ సమరోత్సాహం నింపింది.

► ప్లీనరీ విజయవంతంతో పార్టీలో ఫుల్‌ జోష్‌
►  ఐదు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ప్లీనరీ
►  జగన్, వైఎస్‌ పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా హర్షధ్వానాలు
► భవిష్యత్‌ మనదేనంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన నేతలు
► బూత్‌ స్థాయి వరకు మరింత బలోపేతం కావాలని దిశానిర్దేశం


సాక్షి, విశాఖపట్నం: ఆరేళ్లుగా అలుపెరగని సైనికుల్లా పోరాడుతున్న వైఎస్సార్‌ సీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. భవిష్యత్‌పై భరోసా నింపేలా సాగిన ప్లీనరీ సమరోత్సాహం నింపింది. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కదనరంగంలోకి సైనికుల్లా దూకాలంటూ నేతల దిశానిర్దేశం పార్టీలో ఉత్తేజాన్ని నింపింది. పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఆదివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నా«థ్‌ అధ్యక్షతన జరిగిన వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్లీనరీకి అనూహ్య స్పందన లభించింది.

జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా పార్టీ శ్రేణులు తరలిరావడంతో పార్టీలో ఫుల్‌ జోష్‌ కనిపించింది. ప్లీనరీ ఇన్‌చార్జిగా మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలుసు పార్ధసారథి, పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, బూడి ముత్యాలనాయుడు, పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు, కో ఆర్డినేటర్లు, వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో ఆడిటోరియంతోపాటు పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి.

ఆడిటోరియం బయట రెట్టింపు సంఖ్యలో పార్టీ శ్రేణులుబయట వేచి ఉండాల్సి వచ్చింది. తొలుత పార్టీ క్రియాశీలక కార్యకర్తల ఎన్‌రోల్‌మెంట్‌ చేయించుకొని సభా ప్రాంగణంలోకి రాగా సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షురాలు రాధ నేతృత్వంలోని సాంస్కృతిక బృందం పాడిన గీతాలు శ్రేణులను ఉత్తేజపరిచాయి. జ్యోతి ప్రజ్వలన తర్వాత మహానేత దివంగత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నేతలంతా నివాళులర్పించారు. ముందుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ ప్రారంభోపన్యాసం చేశారు.

ఆ తర్వాత కో ఆర్డినేటర్లంతా మాట్లాడారు. చివరగా ఎమ్మెల్యేలు, ప్లీనరీ ఇన్‌చార్జి పార్ధసారథి, బొత్స సత్యనారాయణ ప్రసంగించారు. నేతలు తమ ప్రసంగాల్లో మహానేత దివంగత వైఎస్సార్, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్లు ప్రస్తావించిన ప్రతి సారి ఆడిటోరియం పరిసరాలన్నీ హర్షధ్వానాలతో మార్మోగాయి. ‘‘భవిష్యత్‌ మనదే.. 2019లో రాజన్న రాజ్యం రాబోతుంది.. కొంచెం ఓపిక పట్టండి.. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మీరు తలెత్తుకునేలా జగనన్న పాలన ఉండబోతుందంటూ పార్టీ నేతలు చేసిన ప్రసంగాలు శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపాయి.

నేతల ప్రసంగాలు సాగుతున్నంత సేపు అడుగడుగునా ‘జై జగన్‌ జై జగన్‌.. వైఎస్సార్‌ సీపీ వర్ధాల్లాలి’’ అంటూ నినాదాలతో పార్టీ శ్రేణులు హోరెత్తించారు. విశాఖలో జరుగుతున్న భూ దోపిడీ వెనుక చంద్రబాబు, లోకేష్, గంటా హస్తం ఉందని అందుకే సీబీఐ విచారణకు వెనుకాడు తున్నారంటూ పార్ధసారథి ఆరోపించారు. కనీసం సిట్‌ పరిధిలో జిల్లా వ్యాప్తంగా జరిగిన భూదందాలన్నీ చేర్చకుండా కేవలం 270 ఎకరాల్లో జరిగిన ట్యాంపరింగ్‌కు మాత్రమే పరిమితం చేశారంటూ ధ్వజమెత్తడంతో పార్టీ శ్రేణులు సేవ్‌ విశాఖ అంటూ నినదించారు.

ఉద్వేగానికి లోనైన ఎమ్మెల్యే ఈశ్వరి
చంద్రబాబు మాయ మాటలకు నమ్మి మైదాన ప్రాంతాల్లోని ప్రజలు ఆయనకు ఓటేశారే తప్ప నిరక్ష్యరాస్యులైన గిరిజనులు మాత్రం నమ్మలేదని.. తమ గుండెల్లో ఉన్న వైఎస్సార్‌ సీపీకి పట్టంగట్టారని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నేటి వరకు కొండలు గుట్టలు తిరుగుతూ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో గిరిజనులు వైఎస్సార్‌ సీపీ వెంటే ఉంటారని జగన్‌ను సీఎంగా చూడాలన్నదే వారి ఆకాంక్షని చెప్పుకొచ్చారు. మరో ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు సైతం తనదైన శైలిలో ప్రసంగిస్తూ పార్టీకి ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని.

.పార్టీకి పట్టంగట్టేందుకు వారు సిద్దంగా ఉన్నారని, అయితే వారిని బూత్‌కు తీసుకెళ్లి ఓట్లు వేయించగలిగే స్థాయిలో మనం బలోపేతం కావాలన్నారు. 2019లో టీడీపీకి రాజకీయ శరణం లేదని.. మరణమేనని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ చెప్పడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. ఇలా నేతలంతా తమ ప్రసంగాల్లో అధికార టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే.. భవిష్యత్‌పై పార్టీ శ్రేణుల్లో భరోసా కల్పించారు. చివరగా 12 అంశాలపై గుడివాడ ప్రవేశపెట్టిన తీర్మానాలను పార్టీ శ్రేణులు హర్షధ్వానాలతో ఆమోదించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement