యువ శాస్త్రవేత్తకు కేంద్ర ప్రోత్సాహం

యువ శాస్త్రవేత్తకు కేంద్ర ప్రోత్సాహం - Sakshi

* పథకానికి ఎంపికైన డాక్టర్‌ శివకిరణ్‌ విజ్ఞాన్‌ వర్సిటీ శాస్త్రవేత్త


రూ.34 లక్షల నగదు మంజూరు


 


చేబ్రోలు: కేంద్ర ప్రభుత్వం నుంచి విజ్ఞాన్‌ యూనివర్సిటీకి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు దక్కిందని రెక్టార్‌ డాక్టర్‌ బి.రామ్మూర్తి తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి వర్సిటీలో ఆదివారం రెక్టార్‌ రామ్మూర్తి విలేకర్లతో మాట్లాడుతూ తమ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎంఎస్‌ శివకిరణ్‌ కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రాజెక్టును దక్కించుకున్నారని తెలిపారు. ఎర్లీ కెరీర్‌ రీసెర్చి అవార్డు కింద కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం రూ. 34లక్షల విలువైన ప్రాజెక్టును తమ వర్సిటీకి మంజూరుచేసిందని చెప్పారు. ఈ ప్రోత్సాహం వల్ల శివకిరణ్‌ తన పరిశోధనలను ముమ్మరం చేయనున్నారని తెలిపారు.


 


రీకాంబినెట్‌ డీఎన్‌ఏ టెక్నాలజీ ద్వారా..


ప్రాజెక్టు దక్కించుకున్న శివకిరణ్‌ మాట్లాడుతూ టైఫాయిడ్, రక్తవిరోచినాలు, మూత్ర, జీర్ణకోశ సంబంధ వ్యాధులకు కారణమైన బాక్టీరియాను మానవ శరీరం నుంచి తరిమేసేందుకు కావాల్సిన వ్యాక్సిన్, ఔషధాల అభివృద్ధికి తాను కృషి చేస్తున్నట్లు చెప్పారు. తన పరిశోధనా నివేదికను చూసిన కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చినట్లు చెప్పారు. సమర్థవంతమైన వ్యాక్సిన్, ఔషధాలను కనుగొనేందుకు విజ్ఞాన్‌ యూనివర్సిటీలో ప్రయోగాలు చేస్తున్నట్లు చెప్పారు. అందుకోసం రీకాంబినెట్‌ డీఎన్‌ఏ టెక్నాలజీని వాడుకుంటున్నట్లు తెలిపారు. వ్యాధి కారక బాక్టీరియా జన్యువులను రెండు మూడు కలిపి.. ఒకేరకపు ప్రతిజనకాలను తయారుచేస్తున్నట్లు చెప్పారు. అందుకోసం వర్సిటీలోని బయోటెక్నాలజీ విభాగ ప్రయోగశాలలను వాడుకుంటున్నట్లు తెలిపారు. శివకిరణ్‌ను విజ్ఞాన్‌ యూనివర్సిటీ వైస్‌చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు తన చాంబర్‌లో ఘనంగా సత్కరించారు.


 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top