డెంగ్యూ జ్వరం బారిన పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా పెదకాకానిలో చోటుచేసుకుంది.
పెదకాకాని : డెంగ్యూ జ్వరం బారిన పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా పెదకాకానిలో చోటుచేసుకుంది. పెదకాకాని లూథర్‌గిరి కాలనీకి చెందిన నూకాబత్తిన అనిత(30) పది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. అప్పటి నుంచి స్థానిక వైద్యుల వద్ద చికిత్స చేయించుకుంటూనే ఉంది. ఆదివారం ఉదయం తలనొప్పితో బాధపడుతూ స్పృహ తప్పడంతో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యపరీక్షలు చేసిన సిబ్బంది అనితకు డెంగ్యూ జ్వరం ఉన్నట్టు గుర్తించారు.
చికిత్స చేస్తున్నప్పటికీ పరిస్థితి విషమించి సోమవారం రాత్రి ఆమె ప్రాణాలు కోల్పోయింది. మంగళవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతురాలు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంకామ్ పీహెచ్‌డీ చేస్తోంది. ఆమె భర్త యూనివర్సల్ ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. అనిత స్వగ్రామం పెదకాకాని మండలం నంబూరు గ్రామం. మంగళవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.