నకిలీ మార్కుల మెమోల సూత్రధారులెవరు? | who is the king pin of duplicate memo's? | Sakshi
Sakshi News home page

నకిలీ మార్కుల మెమోల సూత్రధారులెవరు?

Jul 28 2015 10:59 PM | Updated on Mar 28 2018 11:08 AM

నకిలీ మార్కులతో ఉద్యోగాలు పొందిన విషయాన్ని నిగ్గు తేల్చి.. వారికిని శాశ్వతంగా విధులనుంచి తొలగించిన యంత్రాంగం తాజాగా మార్కుల మెమోలు ఎలా వచ్చాయనే కోణంపై దృష్టి సారించింది.

రంగారెడ్డి : నకిలీ మార్కులతో ఉద్యోగాలు పొందిన విషయాన్ని నిగ్గు తేల్చి.. వారికిని శాశ్వతంగా విధులనుంచి తొలగించిన యంత్రాంగం తాజాగా మార్కుల మెమోలు ఎలా వచ్చాయనే కోణంపై దృష్టి సారించింది. ఏడాదిన్నర క్రితం వివిధ ప్రభుత్వ శాఖల్లో నియామకాలు చేపట్టిన బ్యాక్‌లాగ్ పోస్టులను కొందరు అక్రమార్కులు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన జిల్లా యంత్రాంగం.. ఏకంగా 13 మందిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించింది. అనంతరం వారిపై క్రిమినల్ కేసులు సైతం నమోదు చేసింది. తాజాగా వారికి నకిలీ మార్కుల సర్టిఫికెట్లు ఎవరు జారీ చేశారు... అవి ఎక్కడ్నుంచి వచ్చాయి.. ఈ భాగోతంలో ప్రధాన సూత్రదారులు ఎవరనే కోణంలో జిల్లా యంత్రాంగం విచారణ చేపట్టింది.


నలుగురు టీచర్లపై అనుమానాలు..


నకిలీ సర్టిఫికెట్లు వచ్చిన తీరుపై జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా నలుగురు అధికారులతో విచారణ ప్రక్రియకు ఆదేశించింది. ఈ క్రమంలో సర్టిఫికెట్లు జారీ అయిన పాఠశాలలపై నిఘా పెట్టారు. మరోవైపు అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం విచారణను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా అధికారులకు కీలక ఆధారాలు దొరికినట్లు తెలిసింది. నకిలీ మార్కుల సర్టిఫికెట్ల విషయంలో నలుగురు టీచర్ల పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వీరిలో ముగ్గురు హయత్‌నగర్ మండలంలోని ఓ పాఠశాలలో పనిచేస్తుండగా.. మరో టీచరు ఇబ్రహీంపట్నంలోని ఓ జెడ్పీ పాఠశాలలో పనిచేస్తున్నారు.

 

ఇప్పటికే వీరిపై నిఘా పెట్టిన అధికారులు.. వారి వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా ఈ సర్టిఫికెట్ల తయారీలో ఇతర శాఖలకు చెందిన ఇద్దరు ఉద్యోగులు సైతం ఉన్నట్లు తెలిసింది. మొత్తంగా విచారణ ప్రక్రియను లోతుగా చేపట్టిన అధికారులు త్వరలో సూత్రదారులను తేల్చనున్నారు.


ఇదిలావుండగా.. అక్రమంగా ఉద్యోగాలు పొందిన 13 మందిని ఇప్పటికే టర్మినేట్ చేసిన యంత్రాంగం.. తాజాగా వారిపై క్రిమినల్ కేసులు సైతం నమోదు చేసింది. ఈ కేసుల విచారణ ఉన్నతస్థాయిలో సాగుతోంది. రెండ్రోజుల క్రితం వీరిని పోలిస్ కంట్రోల్ రూమ్‌కు పిలిపించి విచారణ చేపట్టిన అధికారులు.. కీలక సమాచారాన్ని రాబట్టినట్లు సమాచారం. మొత్తంగా ఉద్యోగాలనుంచి టర్మినేట్ చేసినప్పటికీ వారిపై ఉచ్చుమాత్రం మరింత బిగుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement