భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీవ్రతాలు
: శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా నగరంలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. పలు ఆలయాల్లో మహిళలు సామూహిక వ్రతాలు నిర్వహించగా, ఇళ్లల్లో కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
నిజామాబాద్‌కల్చరల్ : శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా నగరంలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. పలు ఆలయాల్లో మహిళలు సామూహిక వ్రతాలు నిర్వహించగా, ఇళ్లల్లో కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని అందంగా అలంకరించి శ్రద్ధాసక్తులతో పూజలు చేశారు. కిషన్‌గంజ్‌లోని వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకుడు వేలేటి గౌరిశంకరశర్మ ఆధ్వర్యంలో వందలాది మంది సుహాసినులు(ముల్తైదువులు) సామూహిక వరలక్ష్మీవ్రతాలు నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా తల్లి సువర్ణ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు కొండ వీరశేఖర్‌గుప్తా, పార్శి మహేశ్వర్‌గుప్తా, కోశాధికారి రాజేశ్వర్‌గుప్తాతోపాటు పెద్దసంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. అలాగే న్యాల్‌కల్‌రోడ్‌లోని శృంగేరి శంకర మఠం– శ్రీలలితాదేవి ఆశ్రమాలయంలో వరలక్ష్మి వ్రతం, సామూహిక కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు.