ఈ సభకు సెలవు

ఈ సభకు సెలవు - Sakshi


అసెంబ్లీని బాయ్‌కాట్ చేసిన వైఎస్సార్‌సీపీ

 

 సాక్షి, హైదరాబాద్: అధికారపార్టీ మొండితనం అసెంబ్లీ సాక్షిగా మరోమారు బైటపడింది. సభలో ప్రజాసమస్యల ప్రస్తావన రానీయకుండా ప్రతిపక్షం గొంతునొక్కిన అధికారపక్షం.. సోమవారం కూడా అహంకార ధోరణిని కొనసాగించింది. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న కాల్‌మనీ -సెక్స్‌రాకెట్‌పై చర్చ కొనసాగించడానికి అవకాశం ఇవ్వాలని, నిబంధనలకు విరుద్ధంగా మహిళా ఎమ్మెల్యే రోజాపై విధించిన సస్పెన్షన్‌ను తొలగించాలంటూ.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన విజ్ఞప్తిని అధికారపక్షం నిర్ద్వందంగా తోసిపుచ్చింది. దాంతో శాసనసభ శీతాకాల సమావేశాలను వైఎస్సార్‌సీపీ బాయ్‌కాట్ చేసింది. సెక్స్ రాకెట్‌పై విపక్షనేతకు కొద్ది సమయమే మాట్లాడే అవకాశం ఇచ్చి, ఆ పక్షానికి చెందిన నాని, రోజా, కల్పన తదితర సభ్యులకు అసలు మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా చర్చను ముగించేశారు. 



పూర్తిస్థాయిలో చర్చకు అవకాశం ఇవ్వాలంటూ విపక్ష నేత చేసిన విజ్ఞప్తిని పట్టించుకోలేదు.  సెక్స్ రాకెట్ మీద ముందు చర్చ జరగాలని, తర్వాతే సీఎం సమాధానం ఇవ్వాలని తాము స్పష్టంగా బీఏసీలో చెప్పిన విషయాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించిన శ్రీకాంత్‌రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడాన్ని విపక్ష నేత గట్టిగా నిలదీశారు. బీఏసీలో జరిగిన వాస్తవాలను చెప్పనీయకుండా, తమ మీదే అంభాండాలు వేసే కార్యక్రమం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారపక్షం మాత్రం తన మొండి వైఖరిని ఏదశలోనూ వీడలేదు. సస్పెన్షన్‌ను తొలగించే ప్రశ్నే లేదని, సస్పెన్షన్ కాలాన్నీ తగ్గించమని కరాఖండిగా చెప్పేసింది.



కాల్‌మనీ-సెక్స్ రాకెట్ మీద చర్చను కొనసాగించడానికి అవకాశం ఇవ్వకపోవడాన్ని, నిబంధనలకు విరుద్ధంగా రోజాపై విధించిన సస్పెన్షన్ తొలగించకపోవడాన్ని.. నిరసిస్తూ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సోమవారం శాసనసభ శీతాకాల సమావేశాలను బాయ్‌కాట్ చేసింది.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై ప్రభుత్వం అనుసరించిన తీరుకు నిరసనగా సమావేశాలు ముగిసే వరకు సభను బాయ్ కాట్ చేస్తున్నట్లు శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ పక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమవారం సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆర్.కె.రోజాపై సస్పెన్షన్‌ను ఎత్తివేయనందుకు నిరసనగా సభను బాయ్‌కాట్ చేస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత పార్టీ సభ్యులంతా సభనుంచి వెలుపలికి వెళ్లిపోయారు.



 సోమవారంనాడు చర్చ సాగిందిలా..

 విపక్ష నేత జగన్: అధ్యక్షా.. సెక్స్ రాకెట్ మీద చర్చ జరగకుండా అడ్డుకునేందుకు అధికారపక్షం శాసనసభలో పాల్పడుతున్న కుయుక్తులను గత మూడు రోజులుగా ప్రజలు చూస్తూనే ఉన్నారు. అధికారపక్షం అసలు ఉద్దేశం ప్రజలకు బాగా అర్థమయిన పరిస్థితి ఉంది. సెక్స్ రాకెట్ మీద చర్చ జరగకుండా చూసుకునేందుకు చివరి ప్రయత్నంగా రోజమ్మ మీద సస్పెన్షన్ విధించారు. అధికారం లేకపోయినా ఏడాది పాటు సస్పెండ్ చేశారు. మీ నిర్ణయాన్ని పునఃసమీక్షించండి. సస్పెన్షన్‌ను తొలగించేటట్లయితేనే మేం సభలో ఉంటాం. లేదంటే సెక్స్ రాకెట్ మీద చర్చ కొనసాగించనందుకు నిరసనగా ఈ సమావేశాలను బాయ్‌కాట్ చేస్తాం.



ఇక్కడ ఉన్నది రెండే రెండు పార్టీలు. అధికారపక్షం, ప్రతిపక్షం. బీజేపీ వాళ్లు సగం టీడీపీ కండువా కప్పుకొని అటు వైపే(అధికారపక్షంలో) ఉన్నారు. ఉన్న ప్రతిపక్షం ఒక్కటే. అధికారం ఉంది కదా.. మా ఇష్టం అనే ధోరణిలో పోవడం రాజ్యాంగ విరుద్ధం. స్పీకర్ అధికారాలకూ పరిమితులున్నాయని, నిర్ణయాన్ని సమీక్షించవచ్చని రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ చెబుతోంది. అందులోని 7వ నిబంధన ఈ విషయాన్ని గట్టిగా చెబుతోంది. ఈ నిబంధన ఆధారంగా మేం న్యాయస్థానాలకూ వెళతాం. ఈ ఒక్క అంశంలో స్పష్టత ఇవ్వండి. మేం ఇదే స్టాండ్ తీసుకుంటాం. సెక్స్ రాకెట్ మీద చర్చ జరగదనే ధోరణిలో ఉంటే మాత్రం.. మేం సమావేశాలను బాయ్‌కాట్ చేస్తాం.



 బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు: జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. విశాఖలోనూ కాల్‌మనీ-సెక్స్ రాకెట్ విస్తృతంగా ఉంది. రోజాను ఏడాది పాటు సస్పెం డ్ చేయడం బాధ కలిగించింది. సభ సాగనివ్వకపోవడం కరెక్ట్ కాదు. కాల్‌మనీ వ్యవహారం కేవలం సెక్స్ రాకెట్ మాత్రమే కాదు.



 మంత్రి యనమల: చర్చ జరగలేదనడం కరెక్ట్ కాదు. ప్రతిపక్ష నేత చర్చలో పాల్గొన్నారు. చర్చ ముగిసింది. విజయవాడను క్రైమ్ సిటీగా చిత్రీకరించడానికే ఇలా చేస్తున్నారు. రోజా సస్పెన్షన్ నిర్ణయం మీద సమీక్ష అవసరం లేదు. సస్పెన్షన్ తొలగించే సమస్యే లేదు. ఇంతకుముందూ చెప్పాం. ఇప్పుడు మళ్లీ చెబుతున్నాం. సస్పెన్షన్ కాలాన్ని ఏడాది నుంచి తగ్గించం. సభ సుప్రీం. సభకు అధికారం లేదంటే ఇంకెవరికి ఉంటుంది? కోర్టుకు వెళతామంటే వెళ్లండి. సభా వ్యవహారాల మీద కోర్టులకు అధికారం లేదు.



 విపక్ష నేత జగన్: సమావేశాలు జరిగే సమయం కంటే ఎక్కువ రోజులు సస్పెండ్ చేసే అధికారం లేదని రూల్ 340(2)ని చదివి వినిపించాం. అధికారం లేదని స్పష్టంగా ఉన్నప్పటికీ.. అహంకార ధోరణిలో ఈ విధంగా మాట్లాడుతున్నారు. బీజేపీ విష్ణుకుమార్ రాజు టీడీపీ వైపు బలంగా వాదిస్తున్నా.. సెక్స్ రాకెట్‌ను సాదాసీదా వడ్డీవ్యాపారం కింద జమకట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన(రాజు) మాటల్లో స్పష్టమయింది. విజయవాడలో వెలుగుచూసిన కాల్‌మనీ-సెక్స్ రాకెట్ నిందితుల మీద నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని, మరిన్ని కఠినమైన సెక్షన్లూ పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినా.. టీడీపీ ఎమ్మెల్సీ సోదరుడు బుద్ధా నాగేశ్వరరావును స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలిపెట్టారు.



ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదు. సెక్స్ రాకెట్ మీద చర్చ ఎక్కడ జరిగింది? నా ఒక్కడితోనే కాస్తోకూస్తో మాట్లాడించి, మా పార్టీ నుంచి నాని, కల్పనమ్మ, రోజమ్మ మాట్లాడతారని చెప్పినా.. చర్చను అర్ధాంతరంగా ముగించేశారు. చర్చను పూర్తిస్థాయిలో జరపాలని అడుగుతున్నాం. చర్చ జరపబోమంటే.. రోజమ్మ సస్పెన్షన్ తొలగించబోమని చెబితే.. మేము సభ నుంచి వెళ్లిపోతాం.



 స్పీకర్: జగన్ గారూ.. మీరు మిస్ అండర్‌స్టాండ్ చేసుకోవద్దు. మిస్‌లీడ్ చేయద్దు. సభ నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ తొలగించాలని మీరు అడిగారు. అడగడంలో రెండు రకాలుంటాయి. మీరు రెండో పద్దతి ఎంచుకున్నారు. ప్రభుత్వం తప్పు చేయలేదని చెప్పింది. బాయ్‌కాట్ చేస్తారో.. కోర్టుకు వెళతారో.. మీ ఇష్టం. సభలో ఉండాలని, చర్చల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నా. తర్వాత మీ ఇష్టం.



 వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి: కాల్‌మనీ - సెక్స్‌రాకెట్ అంశంపై సీఎం స్టేట్‌మెంట్ కంటే ముందే చర్చ జరగాలని బీఏసీలో చెప్పాం. కానీ మీరు బీఏసీలో స్టేట్‌మెంట్‌కు అంగీకరించినట్లు చెబుతున్నారు.



 స్పీకర్: బీఏసీలో మీరు అన్నారు. నేను విన్నాను. నన్ను వివాదంలోకి లాగొద్దు.



 విపక్షనేత జగన్: బీఏసీలో జరిగిన విషయాన్ని మా ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తే.. బీఏసీ జరిగిన విషయాలపైనా అబద్దాలు ఆడుతూ మా మీదే అభాండాలు వేసే పరిస్థితికి వచ్చారు. ఇంతకన్నా దారుణం ఏమీ ఉండదు. సెక్స్ రాకెట్ మీద చర్చ కొనసాగించబోమని మీరు చాలా క్లియర్‌కట్‌గా చెబుతున్నారు. రోజమ్మపై విధించిన సస్పెన్షన్‌ను కూడా తొలగించేది లేదని  మరింత స్పష్టంగా చెబుతున్నారు. ఇక సెలవు. ప్రజలు చూస్తున్నారనే విషయాన్ని మాత్రం మరిచిపోవద్దు...(అంటూ సభ నుంచి విపక్షం మొత్తం నిష్ర్కమిస్తుండగా..)

 స్పీకర్: సభలో ప్రతిపక్షం ఉండటం  సభకూ మంచిది. ప్రజలకూ మంచిది.

 

 సస్పెన్షన్ ఎత్తేయాలని విపక్ష నేత విజ్ఞప్తి

 శాసనసభ ప్రారంభమైన వెంటనే.. రోజాపై విధించిన సస్పెన్షన్ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని, సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. సస్పెన్షన్‌ను తొలగించాలని, సెక్స్ రాకెట్ అంశం మీద చర్చ కొనసాగించడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. లేదంటే తాము సమావేశాలను బహిష్కరిస్తామని (బాయ్‌కాట్ చేస్తామని) స్పష్టంచేశారు. స్పీకర్ అధికారాలకూ పరిమితులు ఉన్నాయంటూ నిబంధనలను ప్రస్తావించారు. న్యాయస్థానాన్నీ ఆశ్రయిస్తామని చెప్పారు. ఏడాదిపాటు సస్పెండ్ చేసే అధికారం సభకు లేదని నిబంధనలతో సహా చెబుతున్నా.. అహంకార ధోరణిలో అధికారపక్షం మాట్లాడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత హేయమైన కాల్‌మనీ-సెక్స్ రాకెట్ వ్యవహారాన్ని సాధారణ వడ్డీవ్యాపారం కింద ప్రభుత్వం జమకట్టినట్లు బీజేపీ శాసనసభపక్ష నేత విష్ణుకుమార్‌రాజు మాటల ద్వారా స్పష్టమయిందన్నారు.



తన ఒక్కడితోనే కాస్తోకూస్తో మాట్లాడించి సెక్స్ రాకెట్ మీద చర్చను మమ అనిపించారని జగన్ విమర్శించారు.  చర్చ కొనసాగించబోమంటే.. రోజా సస్పెన్షన్‌ను తొలగించబోమంటే.. సభ నుంచి ప్రతిపక్షం మొత్తం వెళ్లిపోతుందని ప్రకటించారు. తప్పు చేసిన వారు శిక్ష భరించక తప్పదని, రోజాపై సస్పెన్షన్‌ను తొలగించే సమస్యే లేదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల స్పష్టం చేశారు. కావాలనుకుంటే ప్రతిపక్షం కోర్టులకు వెళ్లవచ్చన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top