
అధికారం కోసం అ‘సమ్మతి’
నగరపాలక సంస్థ పాలకవర్గంలో మరోసారి గ్రూపు రాజకీయాలు బహిర్గతమయ్యాయి. పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి అధికార పార్టీ నేతలు వేరు కుంపటిలా మెలుగుతున్నారు.
• నేడు స్టాండింగ్ కమిటీ ఎన్నిక
• టీడీపీలో బహిర్గతమైన గ్రూపు రాజకీయాలు
• బరిలో 11 మంది కార్పొరేటర్లు
• అభ్యర్థులంతా టీడీపీ రెబెల్సే
అనంతపురం న్యూసిటీ : నగరపాలక సంస్థ పాలకవర్గంలో మరోసారి గ్రూపు రాజకీయాలు బహిర్గతమయ్యాయి. పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి అధికార పార్టీ నేతలు వేరు కుంపటిలా మెలుగుతున్నారు. బుధవారం మూడో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార పార్టీలోనే ఏకంగా 11 మంది కార్పొరేటర్లు రెండు గ్రూపులుగా ఏర్పడి, ఎన్నికల బరిలో నిలబడ్డారు. నాయకత్వ లోపంతోనే అధికార పక్షంలో ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేటర్లను సముదాయించడంలో ఎమ్మెల్యే, మేయర్ విఫలమయ్యారని తెలుస్తోంది. అధికార పార్టీ నేతలే వేర్వేరుగా పోటీకి దిగడం చూస్తుంటే పాలకులపై వస్తున్న అవినీతి ఆరోపణలకు అద్దం పడుతోంది.
ఎన్నికల ప్రక్రియ ఇలా..
స్టాండింగ్ కమిటీలో ఆరుగురు సభ్యులుంటారు. ఇందులో మేయర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. తక్కిన ఐదు స్థానాలకు ఓటింగ్ జరగనుంది. కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉన్నాయి. అందులో 32 టీడీపీ, 11 వైఎస్సార్‌సీపీ, 4 స్వతంత్ర, రెండు సీపీఐ, ఒక స్థానంలో సీపీఎం అభ్యర్థులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక్కో కార్పొరేటర్ ఐదుగురికి ఓటు వేయాల్సి ఉంటుంది. బరిలో దిగిన 11 మందిలో ఎవరికి అత్యధికంగా ఓట్లు వస్తాయో.. వారిని స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నిర్ణయిస్తారు.
11 గంటలకు ఓటింగ్..
నగరపాలక సంస్థ మూడో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు స్థానిక పింఛన్ పంపిణీ గదిలో బుధవారం ఉదయం 11 గంటలకు జరుగుతాయి. సాయంత్రం 4 గంటలకు ఫలితాలను వెల్లడిస్తారు.
సజావుగా జరిగేనా?
గత స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి. అప్పట్లో పాలకవర్గం గ్రూపు విజయంపై అధికారుల వైఖరిని సొంతపార్టీ నేతలే తప్పుబట్టారు. బ్యాలెట్ పేపర్లను తీసుకెళ్లి మేయర్ చాంబర్‌లో వేశారని టీడీపీ నేత జయరాం నాయుడు ఆరోపించారు. అప్పట్లో 49 మంది కార్పొరేటర్లు ఓటింగ్‌లో పాల్గొంటే బాక్సులో 51 బ్యాలెట్లు ఉన్నాయి. ఆరు బ్యాలెట్ పేపర్లలో స్వస్తిక్ గుర్తులు కన్పించాయి. వాస్తవంగా ఇంటూ గుర్తుతో పోలింగ్ నిర్వహించారు. చివరకు కమిషనర్ స్వస్తిక్ గుర్తును వేసిన ఓట్లను చెల్లనివిగా ప్రకటించారు.
రెండు వర్గాలు
అధికార పార్టీ నేతలు పైకి గ్రూపులు లేవని చెబుతున్నా పాలకవర్గంలో రెండు గ్రూపులు బరిలో దిగనున్నాయి. మేయర్ స్వరూపకు చెక్ పెట్టాలనే అసమ్మతి వర్గం యోచిస్తోంది. అందులో భాగంగానే వారి నుంచి ఐదుగురు బరిలో దిగుతున్నారు. స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో వేరు మాట చెప్పకుండా ఉండే వారినే గెలిపించుకోవాలని పాలకవర్గంలోని ఓ కీలక నేత పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా అసమ్మతి వర్గంలో కొందరు కార్పొరేటర్ల వ్యవహార శైలి బాగోలేదని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. అధికారులు, కార్పొరేటర్లను లెక్క చేయకుండా దాడులకు సైతం తెగబడేవారున్నారు. అలాంటి వారిని ఎలాంటి పరిస్థితుల్లో గెలిపించకూడదనే వాదన బలంగా ఉంది. ఇక రెబెల్ కార్పొరేటర్ ఉమామహేశ్వర్‌కు జేసీ వర్గీయుల అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది.
క్రిమినల్ కేసులు పెడతాం
ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తే కార్పొరేటర్లపై క్రిమినల్ కేసులు పెట్టడమేకాక పోలీసు సిబ్బందికి అప్పజెబుతాం. ఎవరైనా ఓటు వినియోగించుకున్నాక నగరపాలక సంస్థ వీడాలి. కార్యాలయంలోని అన్ని గదులకు తాళాలు వేస్తాం.
చల్లా ఓబులేసు, కమిషనర్