ఆనందంగా పెళ్లికి హాజరై తిరిగి వెళ్తున్న వారిపై మృత్యువు పంజా విసిరింది.
♦ డీసీఎం డోర్ ఊడిపడి ఇద్దరు దుర్మరణం
♦ మరో ఐదుగురికి గాయాలు
♦ మృతులు మహబూబ్‌నగర్ జిల్లావాసులు
♦ యాలాల మండలం బండమీదిపల్లి శివారులో ఘటన
యాలాల: ఆనందంగా పెళ్లికి హాజరై తిరిగి వెళ్తున్న వారిపై మృత్యువు పంజా విసిరింది. డీసీఎం డోర్ ఊడిపడడంతో దానిపై కూర్చున్న ఇద్దరు దుర్మరణం చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లా సరిహద్దు, మండల పరిధిలోని బండమీదిపల్లి శివారులో బుధవారం సాయంత్రం 5.30 గంటలకు చోటుచేసుకుంది. క్షతగాత్రులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మండలం అన్నారం గ్రామానికి చెందిన వెంకటయ్య వివాహం కర్ణాటక రాష్ట్రం రాళ్లగణాపురం ప్రాంతానికి చెందిన ఓ యువతితో బుధవారం జరిగింది. ఈ శుభకార్యంలో పాల్గొనేందుకు గ్రామస్తులకు ఓ డీసీఎంను ఏర్పాటు చేశారు. సుమారు 50 మందికి పైగా డీసీఎంలో పెళ్లికి హాజరై సాయంత్రం తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. కొందరు డీసీఎం వ్యాన్‌లో కూర్చుని ఉండగా, ఏడుగురు వాహనం వెనుక డోర్‌పై కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈక్రమంలో మండల పరిధిలోని బండమీదిపల్లి శివారులో ప్రమాదవశాత్తు డోర్ చైన్ ఊడిపోయింది. దీంతో డోర్‌పై కూర్చున్న ఏడుగురు రోడ్డుపై జారిపడ్డారు. ఈ ఘటనలో నీటూరు నర్సింలు(20), మ్యాథరి పెంటప్ప(14) తీవ్రంగా గా యపడి సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. ఏనుగుల నర్సింలు, నీటూరు నరేష్, నీటూరు ఆనంద్, మాండి రాములు, కోస్గి వెంకటరాములుకు గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన డీసీఎంలోని మిగతా వారు కేకలు వేయడంతో డ్రైవర్ వాహనాన్ని నిలిపాడు. క్షతగాత్రులను తాండూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను మార్చురీలో భద్రపరిచారు.