– ప్రత్యేక రైళ్లను గతేడాది కంటే తక్కువ నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే
– భక్తులకు తప్పని ప్రయాణ కష్టాలు
కర్నూలు(రాజ్‌విహార్): అయ్యప్ప భక్తులకు ఈసారి ప్రయాణ కష్టాలు తప్పేలా లేవు. అయ్యప్పస్వామి దర్శనం కోసం కేరళలోని శబరిమలై యాత్రకు వెళ్లే భక్తుల కోసం ఏటా దక్షిణ మధ్య రైల్వే అధికారులు నడుపుతున్న ప్రత్యేక రైళ్ల సంఖ్యను ఈసారి తగ్గించింది. కర్నూలు మీదుగా గత ఏడాది 8 రైళ్లను నడిపిన అధికారులు ఈ సారి మూడు రైళ్లతోనే సరిపెట్టారు. దీంతో భక్తులకు ఇబ్బందులు అనివార్యం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న రైళ్లలో స్లీపర్ బెర్త్‌లు లేకపోగా చాంతాడంతా వెయిటింగ్ లిస్టు దర్శనం ఇస్తోంది. సెకండ్ జనరల్ క్లాస్ బోగీల్లో కనీసం కూర్చునేందుకు కూడా స్థలం లేదు.
కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి యేటా 60వేల మంది వరకు భక్తులు ఈ యాత్రకు వెళ్తుంటారని అంచనా. ఈక్రమంలో భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రతి ఏడాది డిసెంబరు, జనవరి మాసాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. గత ఏడాది నిజామాబాద్, అదిలాబాద్, అకోలా తదితర ప్రాంతాల నుంచి కర్నూలు మీదుగా ఎనిమిది రైళ్లు నడిపారు. ఈ సారి కేవలం మూడింటితో సరిపెట్టడం భక్తులకు ఆందోళన కలిగిస్తోంది.
– ఈ సంవత్సరం నడుపుతున్న రైళ్లు:
– రైలు నంబర్ – 07613: నిజామాబాద్ నుంచి కొల్లాం వెళ్లే ఈ రైలు కర్నూలు, డోన్ మీదుగా వెళ్లనుంది. నిజామాబాద్ నుంచి 13:00 గంటలకు బయలుదేరి కాచిగూడ, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల, కర్నూలు, ద్రోణాచలం (డోన్), గుత్తి, కడప, కాట్పాడి, జోలార్‌పేట, కోయంబత్తూర్, సేలం, పాల్‌కాడ్, కొట్టాయం, చెంగనూరు మీదుగా కొల్లాం వెళ్తుంది. డిసెంబరు 19, 21వ తేదీల్లో నిజమాబాద్ నుంచి బయలుదేరి కర్నూలుకు 19:05 గంటలకు (సాయంత్రం 7:05గంటలు) చేరుకుని 19:07గంటలకు కదులుతాయి. డోన్‌కు 20–13గంటలకు చేరుకుని 20–15 గంటలకు బయలుదేరి 20, 22వ తేది రాత్రి 21:30గంటలకు కొల్లాం చేరుకుంటాయి.
– రైలు నంబర్ – 07509: అదిలాబాద్ నుంచి కొల్లాం వెళ్లే ఈ రైలు వయా కాచిగూడ, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల కర్నూలు, ద్రోణాచలం (డోన్), గుత్తి, కడప, కాట్పాడి, జోలార్‌పేట, కోయంబత్తూర్, సేలం, పాల్‌కాడ్, కొట్టాయం, చెంగనూరు మీదుగా కొల్లాం చేరుకుంటుంది. డిసెంబరు 27వ తేదీన అదిలాబాద్‌లో మధ్యాహ్నం 12–30గంటలకు బయలుదేరి కర్నూలుకు 28వ తేది అర్ధరాత్రి 02–23కు చేరుకుని 02–25కి బయలుదేరుతుంది. 04గంటలకు డోన్ చేరుకుని 04–02గంటలకు తిరిగి బయలుదేరి 29వ తేది తెల్లవారు జామున 04–15 గంటలకు కొల్లాం చేరుతుంది.
– రైలు నంబర్ – 07507: అకోలా నుంచి కొల్లాం వెళ్లే ఈ రైలు ఈనెల 14వ తేదీనే వెళ్లింది.
– గత ఏడాది నడిపిన రైళ్లు:
గత ఏడాది ఎనిమిది రైళ్లు 14 సర్వీసులుగా నడిపారు. ఇందులో నిజామాబాద్ నుంచి కొల్లాంకు రైలు నంబర్ – 07613తోపాటు ఔరంగబాద్ నుంచి కొల్లాంకు నంబర్ 07505, అకోలా నుంచి కొల్లాంకు నంబర్ – 07507, అదిలాబాద్ నుంచి కొల్లాంకు నంబర్ 07509, కొల్లాం నుంచి నిజామాబాద్‌కు నంబర్ – 07614, తిరుపతి నుంచి అకోలాకు నంబర్ – 07408, తిరుపతి నుంచి ఔరంగబాద్‌కు నంబర్ – 07410, తిరుపతి నుంచి అదిలాబాద్‌కు నంబర్ – 07407 రైళ్లను 14 సర్వీసులుగా నడిపారు.