ఈ బతుకు మాకొద్దు! | this life dont want | Sakshi
Sakshi News home page

ఈ బతుకు మాకొద్దు!

May 28 2017 11:50 PM | Updated on Jun 1 2018 8:39 PM

ఈ బతుకు మాకొద్దు! - Sakshi

ఈ బతుకు మాకొద్దు!

జరగరాని ఘోరాలన్నీ అనంతపురంలోనే జరిగిపోతున్నాయి. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలియగానే వదిలించుకునేందుకు కొందరు వెనుకాడటం లేదు.

మనిషన్నవాడు మాయమైతున్నాడు
మానవత్వం ఉన్న వాడు మచ్చుకైనా కానరావడం లేదు
చస్తే అంతిమ సంస్కారం కూడా నిర్వహించని కుసంస్కారులు ఉన్న చోట..
ఈ బతుకు మాకొద్దని మూతపడిన పాప కళ్లు దేవున్ని ప్రార్థించాయి.
ఈ పుట్టకు ఇవ్వొద్దని ఆగిన అరుపులు భగవంతుని అర్థించాయి


అనంతపురం సెంట్రల్‌ : జరగరాని ఘోరాలన్నీ అనంతపురంలోనే జరిగిపోతున్నాయి. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలియగానే వదిలించుకునేందుకు కొందరు వెనుకాడటం లేదు. ఒకవేళ పుట్టిన వెంటనే ఇక్కడి అకృత్యాలు చూడలేక శిశువలు చస్తే.. కనీసం అంతిక సంస్కారం కూడా నిర్వహించకుండానే నిర్ధాక్షిణ్యంగా మురుగునీటి కాలువలు, చెత్తకుప్పలపాలు చేస్తున్నారు. ఈ తరహా ఘటనలు అనంతపురం సహా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో తరచూ వెలుగులోకి వస్తున్నాయి.

ఏమిటీ దుర్మార్గం
అనంతపురంలో నెల రోజుల వ్యవధిలో పది వరకు శిశువుల మృతదేహాలు వెలుగు చూశాయి. తాజాగా స్థానిక రామ్‌నగర్‌లోని రైల్వే బ్రిడ్జి సమీపంలోని ద్వారకామయి అపార్ట్‌మెంట్‌ ఎదుట గల మురుగునీటి కాలువలో రెండ్రోజుల కిందట ఓ ఆడశిశువు మృతదేహాన్ని అట్టపెట్టెలో చుట్టేసి ఉండగా గుర్తించారు. మిగిలిన ప్రాంతాల్లోనూ ఇటువంటి సంఘటనలు జరిగాయి. కొన్ని మాత్రమే వెలుగులోకి రాగా, మరిన్ని బాహ్యప్రపంచానికి తెలియకుండానే పోతున్నాయి. మచ్చుకు కొన్ని పరిశీలిస్తే...

- గత నెలలో అనంతపురం నాల్గో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నడిమివంక సమీపంలో నెలలు పూర్తికాకుండానే పుట్టిన ఆడశిశువు లభ్యమైంది.
- ఆర్టీసీ బస్టాండు వెనుక గల ఓ ప్రైవేటు హాస్పిటల్‌ సమీపంలో తెల్లవారుజామున శిశువు మృతదేహాన్ని
రోడ్డుపక్కన వదిలేసి వెళ్లారు. ప్రజలు గమనించేసరికి అప్పటికే కుక్కలు సగభాగం తినేశాయి.
- గత నెల 22న ఐరన్‌ బ్రిడ్జి సమీపంలోని మురుగు కాలువలో చిన్నారి మృతదేహం కొట్టుకురాగా, గమనించిన స్థానికులు వెలికితీసి పోలీసులకు సమాచారం అందించారు. ఖననం చేయడానికి ఇష్టం లేక మురుగుకాలువలో వదలిపెట్టామని బత్తలపల్లి మండలానికి చెందిన ఓ దంపతులు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు.

- అనంతపురం రామ్‌నగర్‌ రైల్వేగేట్‌ సమీపంలోని ద్వారకామయి అపార్ట్‌మెంట్‌ ముందు గల మురుగు కాలువలో రెండురోజుల క్రితం ఉరవకొండకు చెందిన మహిళ ఇక్కడి పెద్దాస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన నాలుగు రోజులకే ఆ శిశువు మృతి చెందగా, తమ వద్ద డబ్బులు లేక, సిబ్బందికి అప్పగించారు. వారు అట్టపెట్టెలో మృతదేహాన్ని ఉంచి డ్రైనేజీ కాలువ పక్కన వదిలేశారు. మానవ జన్మ ఎత్తిన వారు ఎవరు చనిపోయినా అంతిమ సంస్కారం నిర్వహించడం ఆనవాయితీ. శిశువుల విషయంలో హంగూ ఆర్భాటం లేకపోయినా కనీసం ఖననమైనా చేయవచ్చు. అదీ లేకపోతే స్వచ్ఛంద సంస్థలకు అప్పగించినా ఆ పనిని వారు పూర్తి చేస్తారు.

అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం
అనంతపురంలో ప్రభుత్వ పెద్దాస్పత్రి సహా ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులు, నర్సింగ్‌ హోంలు ఉన్నాయి. జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి ఆస్పత్రులకు వందలాది మంది ప్రతి రోజూ వస్తుంటారు. లింగనిర్ధరణ పరీక్షలు నేరమని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఎవరూ ఖాతరు చేయడం లేదు. దీంతో గర్బస్థ శిశు మరణాలు జరిగిపోతున్నాయి. ఈ పరిణామంపై అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది.   

కొరవడిన నిఘా
ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులపై పోలీసు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హాస్పిటళ్ల యాజమాన్యాల నిర్వాకంతోనే తరచూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయని తెలుస్తోంది. ఆస్పత్రిలో శిశువు మరణిస్తే సంబంధిత హాస్పిటల్‌ యాజమాన్యమే తదుపరి‡ కార్యక్రమాలు నిర్వహించేలా చొరవ తీసుకోవాలి. లేదంటే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి. ఇప్పటికీ కొన్ని స్కానింగ్‌ సెంటర్లలో లింగ నిర్ధరణ పరీక్షలు యథేచ్చగా జరుగుతున్నాయి. అయినా అధికారులు ఎవరికీ పట్టడం లేదు.

కేసులు నమోదు చేస్తాం : మల్లికార్జునవర్మ, డీఎస్పీ, అనంతపురం
    చిన్నపిల్లల మృతదేహాలను కాలువల్లో, ముళ్ళపొదల్లో పడేసిపోవడం హేయమైన చర్య. దీనిని ఉపేక్షించేది లేదు. తల్లిదండ్రులు కాని హాస్పటల్స్‌ యాజమాన్యాలు కాని బాధ్యతారహిత్యాంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. ఖనన సంస్కారాలు కూడా చేయలేని నిరుపేద తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే స్థానిక పోలీసు స్టేషన్‌లలో సంప్రదించినా ప్రత్యామ్నాయ చర్యలు చూపిస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement