ఉద్దేశపూర్వకంగానే తొలగించారు

ఉద్దేశపూర్వకంగానే తొలగించారు - Sakshi


2 రోజుల్లోగా వైఎస్ చిత్రపటాన్ని యథాతథంగా అమర్చాలి

అసెంబ్లీ వద్ద వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బైఠాయింపు

 

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ లాబీల్లో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో ఆందోళన చేశారు. పార్టీకి చెందిన సుమారు యాభై మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి కె.సత్యనారాయణ చాంబ ర్‌లో రెండు గంటలకు పైగా బైఠాయించి నిరసన తెలిపారు. వైఎస్ చిత్రపటాన్ని ఉద్దేశపూర్వకంగానే తొలగించారని, ఇది మంచి సంప్రదాయం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులంతా పార్టీ శాసనసభాపక్ష ఉప నేతలు జ్యోతుల నెహ్రూ, ఉప్పులేటి కల్పన, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ఆర్.కె.రోజా నేతృత్వంలో అసెంబ్లీ కార్యదర్శికి వినతిపత్రం సమర్పించి అక్కడే బైఠాయిం చారు. వైఎస్ చిత్రపటాన్ని యథాతథంగా ఉంచాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ లాంజ్ లో సమావేశమయ్యే టీడీపీ ఎమ్మెల్యేలు.. అక్కడ వైఎస్ చిత్రపటం ఉండటాన్ని జీర్ణిం చుకోలేక తొలగించారని దుయ్యబట్టారు.

 

 కార్యదర్శి సమాధానాల్లో అస్పష్టత

 

 వైఎస్ చిత్రపటాన్ని ఎందుకు తొలగించారన్న ప్రశ్నకు కార్యదర్శి సత్యనారాయణ పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. చిత్రపటానికి మరమ్మతులు రావడం వల్ల తొలగించామని ఒకసారి, ఫ్రేమ్ లూజు అయినందు వల్ల తీసేశామని మరోసారి సమాధానాలిచ్చారు. ఎమ్మెల్యేల ఒత్తిడి మేరకు బయటకు వెళ్లి రెండుసార్లు స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుతో ఫోన్లో మాట్లాడి.. నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ మీతో చెప్పమన్నారన్నారు. ఈ సందర్భంగా వైఎస్ చిత్రపటాన్ని చూపించేందుకు కార్యదర్శి ఎమ్మెల్యేలను తీసుకెళ్తూ మీడియా ప్రతినిధుల్ని బయటే ఆపేశారు. అసెంబ్లీ లాంజ్‌కుపైన మొదటి అంతస్తులో మూలనున్న ఓ గదిలో చిత్రపటాన్ని తిరగేసి ఉంచడంపై ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఫొటోనూ బాత్‌రూం పక్కన ఉంచటాన్నీ ఆక్షేపించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ రెండు రోజుల్లోపు వైఎస్ చిత్రపటాన్ని తిరిగి అమర్చకుంటే తీవ్రస్థాయిలో కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు ఆందోళన విరమించారు.

 

 అప్రజాస్వామికం, దుస్సంప్రదాయం

 

 రోశయ్య సీఎంగా, కిరణ్‌కుమార్‌రెడ్డి స్పీకర్‌గా ఉన్నపుడు 2010 జూలై 8న వైఎస్ జన్మదినాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ లాంజ్‌లో ఏర్పాటు చేసిన ఆయన ఫొటోను తొలగించడం అప్రజాస్వామికం, దుష్ట సంప్రదాయం, అసెంబ్లీకే అవమానకరమని పార్టీ సీనియర్‌నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఆందోళన విరమించాక ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. అసెంబ్లీ ఆమోదంతోనే వైఎస్ ఫొటోను లాంజ్‌లో ఏర్పాటు చేశారని, ఇప్పుడు అసెంబ్లీకి తెలియకుండా తీసేయడం చట్టసభను అవమానించడమేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్.అమరనాథరెడ్డి, జి.రవికుమార్, వై.బాలనాగిరెడ్డి, కె.వెంకటరమణ, కె.జోగులు, జె.వెంకటరెడ్డి, పి.రామకృష్ణారెడ్డి, కె.గోవర్ధన్‌రెడ్డి, వి.కళావతి, పి.పుష్పశ్రీవాణి, సుజయ్‌కృష్ణ రంగారావు, జి.ఈశ్వరి, దాడిశెట్టిరాజా, పి.డేవిడ్‌రాజు, వి.సుబ్బారావు, జగ్గిరెడ్డి, ఎం.ప్రతాప అప్పారావు, కె.రక్షణ, కె.రఘుపతి, ఎ.రామకృష్ణారెడ్డి, జి.శ్రీనివాసరెడ్డి, ఎ.సురేష్, ఎం.అశోక్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్, పి.సునీల్‌కుమార్, కె.సంజీవయ్య, టి.జయరాములు, షేక్ బేపారి అంజాద్‌బాషా, జి.శ్రీకాంత్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, బి.రాజశేఖర్‌రెడ్డి, వై.ఐజయ్య, జి.చరితారెడ్డి, బి.రాజేంద్రనాథ్‌రెడ్డి, మణిగాంధీ, వై.సాయిప్రసాద్‌రెడ్డి, షేక్ చాంద్‌బాషా, డి.తిప్పారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కె.నారాయణస్వామి, ఎం.సునీల్, ఎమ్మెల్సీలు పి.సుభాష్ చంద్రబోస్, కె.వీరభద్రస్వామి, సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు.


 


 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top