పేద కుటుంబానికి పెద్ద కష్టం | The biggest difficulty is the poor family | Sakshi
Sakshi News home page

పేద కుటుంబానికి పెద్ద కష్టం

Apr 4 2016 4:54 AM | Updated on Aug 14 2018 10:54 AM

పేద కుటుంబానికి పెద్ద కష్టం - Sakshi

పేద కుటుంబానికి పెద్ద కష్టం

నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణం మీనానగర్‌కు చెందిన తంగెళ్లపల్లి శ్రీనివాస్, శ్రీదేవి దంపతులది నిరుపేద కుటుంబం.

అయ్యో.. శివ!
♦ ప్రాణాంతకమైన జీబీఎస్‌తో బాధపడుతున్న బీటెక్ విద్యార్థి
♦ ఇది లక్షల్లో ఒకరికి వచ్చే అవకాశం అంటున్న వైద్యులు
♦ వైద్యానికి ఇప్పటి వరకు రూ. 5 లక్షల వరకు ఖర్చు
♦ రోజుకు రూ. 40 వేల ఖర్చుతో సెలైన్లు ఎక్కించాలి
♦ చేతిలో చిల్లిగవ్వలేక దిక్కుతోచని స్థితిలో కుటుంబం
♦ సీఎం కేసీఆర్ ఆపన్నహస్తం అందించాలని వేడుకోలు
 
 పేద కుటుంబానికి పెద్ద కష్టం వచ్చిపడింది. ఇంజనీరై ఇంటికి ఆధారం అవుతాడనుకున్న కొడుకు కళ్లెదుటే జీవచ్ఛవంలా మారి మంచానికే పరిమితమయ్యాడు. దీంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. లక్షల మందిలో ఒకరికి మాత్రమే వచ్చే జీబీఎస్ జబ్బుతో బాధపడుతున్నాడా యువకుడు. రోజూ రూ.40 వేలు విలువ చేసే సెలైన్లు ఎక్కిస్తే తప్ప జబ్బు అదుపులోకి రాదని వైద్యులు చెబుతున్నారు. తమ కొడుకును బతికించుకోవడానికి అవసరమైన వైద్యం చేయించుకునేందుకు చేతిలో చిల్లిగవ్వలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు కుటుంబ సభ్యులు. సీఎం స్పందించి ఆపన్నహస్తం అందించాలని వేడుకుంటున్నారు.
 
 సాక్షి భువనగిరి: నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణం మీనానగర్‌కు చెందిన తంగెళ్లపల్లి శ్రీనివాస్, శ్రీదేవి దంపతులది నిరుపేద కుటుంబం. శ్రీనివాస్ వాచ్‌మెకానిక్‌గా శ్రీదేవి ఇంటి వద్ద టైలర్‌గా పనిచేస్తోంది. వీరి కుమారుడు శివప్రసాద్(20) రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ సమీపంలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈఈఈ) చదువుతున్నాడు. శివప్రసాద్‌కు గతనెల 28వ తేదీన జీబీఎస్ (గ్విలియన్ బ్యారీ సిండ్రోమ్) అనే ప్రాణాంతక వ్యాధి సోకింది. ముందుగా జ్వరం లక్షణాలు కన్పించాయి.

అటునుంచి  కాలివేళ్లకు తిమ్మిరి వచ్చింది, అక్కడి నుంచి పాదాలు, మోకాళ్లు ఇలా శరీరం మొత్తం పాకింది. శరీరమంతా పక్షవాతం వచ్చింది. దీంతోపాటు నరాల వ్యవస్థ మొత్తం దెబ్బతింది. వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఐసీయూలో బెడ్‌లు లేకపోవడంతో గాంధీ ఆస్పత్రికి తీసుకుపొమ్మని సలహా ఇచ్చారు. ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకుపోతే రూ.15 లక్షల నుంచి రూ. 20 లక్షల పైనే ఖర్చు అవుతుందని తెలి యడంతో విధిలేక గాంధీ ఆస్పత్రిలో  చేర్పిం చారు. ఇప్పటి వరకు రూ. 5 లక్షల వరకు ఖర్చు అయింది. ఆస్పత్రిలో తెలుపు రేషన్‌కార్డుపై వైద్యం చేశారు. ఆస్పత్రిలో వారి పరిధి దాటిపోయింది. వైద్యం కొనసాగాలంటే డబ్బు లు కావాలని వైద్యులు చెబుతున్నారు.  

 రోగ లక్షణాలు : జీబీఎస్ లక్షల మందిలో ఎవరో ఒకరికి వచ్చే జబ్బు. కాలి గోటి నుంచి తిమ్మిరి ప్రారంభమై మెడ వరకు ఇది పాకుతుంది. దీంతో శరీరం చచ్చుబడిపోయి, లేచి నిలబడి, కూర్చోలేని పరిస్థితి ఉంటుంది. సకాలంలో వైద్యం అందించకపోతే తలకు ఎక్కి మెదడును పనిచేయకుండా చేస్తుంది. అలాగే శ్వాస ఆడకుండా చేస్తుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకే ప్రమాదం. దీన్ని నయం చేయడానికి సంవత్సర కాలం వైద్యం చేయాలి. ఇందుకోసం రోజూ కనీసం 40 వేల రూపాయలు విలువచేసే సెలైన్లు ఎక్కించాలి. ఈ జబ్బుకు ఇమ్యూనోగ్లోబులిన్ సెలైన్ రోజూ 5 రోగి శరీరంలోకి ఎక్కించాలి. గత నెల 28 నుంచి మందులు వాడుతున్నారు. ఆదివారంతో మందులు అయిపోతున్నాయి.

 సోమవారం నుంచి మందు ఇవ్వాలంటే రోజూ రూ.40 వేలు కావాలి. అంత డబ్బులేని పేద కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. సీఎం, మంత్రి, లేదా ఇతర దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, స్నేహితులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement