అనంతలో ఒంటరైన ఎమ్మెల్యే చాంద్బాషా ! | tdp leaders insults mla chand basha in anantapur | Sakshi
Sakshi News home page

అనంతలో ఒంటరైన ఎమ్మెల్యే చాంద్బాషా !

May 25 2016 9:01 AM | Updated on Aug 10 2018 9:42 PM

అనంతలో ఒంటరైన ఎమ్మెల్యే చాంద్బాషా ! - Sakshi

అనంతలో ఒంటరైన ఎమ్మెల్యే చాంద్బాషా !

‘అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి’ అన్నట్లుంది కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా పరిస్థితి.

టీడీపీలో  చాంద్‌బాషాకు వరుసగా ఎదురుదెబ్బలు
టార్గెట్ చేసిన పయ్యావుల, కందికుంట
మినీమహానాడు నుంచి మధ్యలోనే వెనుదిరిగిన చాంద్
కందికుంట పంచన చేరిన కీలక అనుచరుడు కేఎం బాషా

 ‘అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి’ అన్నట్లుంది కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా పరిస్థితి.  టిక్కెట్టు ఇచ్చి ఎమ్మెల్యేను చేసిన వైఎస్సార్‌సీపీని కాదని టీడీపీలో చేరారు. ఈయన రాకను మొదటి నుంచి టీడీపీలో ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయినా  సైకిలెక్కారు. చేరిక తర్వాత చాంద్‌కు టీడీపీ నేతలు చుక్కలు చూపిస్తున్నారు. ప్రతి వేదికపై టార్గెట్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆయన వెనుక ఉన్న నేతలను కూడా దూరం చేస్తూ ఒంటరిని చేస్తున్నారు. ఈ పరిణామాలతో చాంద్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వైఎస్సార్‌సీపీలో ప్రత్యేక గౌరవం ఉండేదని, పార్టీ మారడంతో జనంలో కూడా చులకన య్యానని మదనపడుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
 
అనంతపురం: కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా 2014 వరకూ టీడీపీలో ఓ సామాన్య కార్యకర్త. నియోజకవర్గంలో పెద్దగా పరిచయం లేనిపేరు. టీడీపీలోనే కొనసాగివుంటే జీవితకాలంలో ఎమ్మెల్యే కాదు కదా, కనీసం మునిసిపల్ చైర్మన్ కూడా అయ్యేవారు కాదని కదిరివాసులు అంటున్నారు. మైనార్టీలకు గుర్తింపు ఇవ్వాలనే ఆలోచనతో వైఎస్సార్‌సీపీ చాంద్‌ను నిలబెట్టింది. మైనార్టీలు కూడా పార్టీపై ఉన్న ప్రేమాభిమానాలతో ఆయన్ను గెలిపించారు. అదే టీడీపీ జిల్లాలోని 14 స్థానాల్లో ఒక్కచోట కూడా మైనార్టీకి టిక్కెట్టు ఇవ్వలేదు. చాంద్ మాత్రం నైతికత మరచి టీడీపీలో చేరారు. ఈయన రాకను మాజీ ఎమ్మెల్యే కందికుంటతో పాటు పరిటాల వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. టీడీపీ అధిష్టానం మాత్రం పక్కా ప్రణాళికతో చాంద్ మెడలో పచ్చకండువా కప్పేసింది. ఆ కండువాతోనే  విశ్వసనీయత కోల్పోయారని, రాజకీయజీవితం ప్రశ్నార్థకమైందని సర్వత్రా చర్చించుకుంటున్నారు.
 
టార్గెట్ చేసిన టీడీపీ నేతలు
ఈ నెల 3న జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో చాంద్‌పై ఎమ్మెల్సీ పయ్యావులతో పాటు మాజీ ఎమ్మెల్యే కందికుంట పరోక్షంగా ఆరోపణలు గుప్పించారు. ‘మేము పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ మారలేదు. కొందరు రెండేళ్లు కూడా ఉండలేకపోతున్నారని’ కేశవ్ విమర్శించారు. అంతటితో ఆగకుండా ఈనెల 23న కళ్యాణదుర్గంలో జరిగిన మినీమహానాడులోనూ టార్గెట్ చేశారు. ‘కొందరు పొద్దుతిరుగుడు పువ్వుల్లాగా ఎటు అధికారం ఉంటే అటు వస్తుంటారు. వారిని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. పార్టీ కోసం పనిచేసిన వారిని మరచిపోం’ అని పరోక్షంగా చాంద్‌ను ఉద్దేశించి అన్నారు. నిజానికి కందికుంట.. పరిటాల వర్గీయుడు. పరిటాల వర్గానికి, కేశవ్ వర్గానికి విభేదాలు ఏస్థాయిలో ఉన్నాయో అందరికీ తెలుసు. అయినా కేశవ్ ప్రతిసారీ ఇలా స్పందించడాన్ని చూస్తే చాంద్ రాకను టీడీపీలో ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారని స్పష్టమవుతోంది. ఇదే వేదికపై కందికుంట మాట్లాడుతూ ‘ఒకే ఒరలో రెండుకత్తులు ఇమడలేవు. తుప్పుపట్టిన కత్తి అయితే ఇమిడేందుకు అవకాశం ఉంటుందేమో. కానీ నేను యుద్ధం చేసే కత్తిగా ఉండాలనుకుంటున్నా’నంటూ నేరుగా చాంద్‌తో కలవలేనని తేల్చేశారు. ఈ మాటలతో చిన్నబోయిన చాంద్ అర్ధంతరంగా మహానాడు నుంచి వెనుదిరిగారు. చాంద్  వెళ్లిపోతుంటే వేదికపై అంతా నవ్వుకున్నారు.

ఇదీ కొనుగోలు కథ
మహానాడు నుంచి చాంద్ వెళ్లిన తర్వాత టీడీపీ నేతలు ఆయన పార్టీలోకి వచ్చేందుకు దారితీసిన పరిస్థితులపైనే చర్చించుకున్నారు. రూ.5.70 కోట్లతో బేరం కుదిరిందని, ఇందులో మొదటివిడతలో రూ.3.70 కోట్లు, వారం కిందట మరో రూ.50 లక్షలు ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చాంద్‌మాత్రం తనకు మంత్రి పదవి ఇస్తామని మాటిచ్చారని అందరితో చెప్పుకుంటున్నారు.  టీడీపీ నేతలు మాత్రం చాంద్ వైఎస్సార్‌సీపీ ఇమేజ్‌తోనే గెలిచారని, సొంతంగా వెయ్యిఓట్లు కూడా ప్రభావితం చేయలేరని తేల్చినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి ఇస్తామనడంలో వాస్తవం లేదని మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా కందికుంటతో చెప్పినట్లు సమాచారం. మరోవైపు చాంద్ ముఖ్య అనుచరుడు కేఎం బాషాను కందికుంట తనవైపు లాగేసుకున్నారు. పార్టీ మారే సమయంలో కూడా ఐదుగురు కౌన్సిలర్లు మినహా ఒక్క ప్రజాప్రతినిధి కూడా చాంద్ వెంట వెళ్లలేదు. వీరిలో నలుగురు ఆయన బంధువులు. శివశంకర్‌నాయక్ తక్కిన కౌన్సిలర్.  ఈయనూ కందికుంట వర్గంలో చేరారు. దీంతో  బంధువులు మినహా ఒక్క కార్యకర్త కూడా వెంట లేక చాంద్‌బాషా పూర్తి ఏకాకి అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement