పుష్కరాల పేరుతో అధికారపార్టీ నేతలు వసూళ్ల దందాకు తెరతీశారు.
- పుష్కర యాత్రికుల పేరిట వసూళ్లు
- ఒక్కో రేషన్‌షాపు నుంచి రూ.5 వేలు..
- మద్యం దుకాణమైతే రూ.20 వేలు ..
- వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తల నుంచి పెద్దమొత్తంలో..
- కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ నేతల దందా
పుష్కరాల పేరుతో అధికారపార్టీ నేతలు వసూళ్ల దందాకు తెరతీశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వ్యాపారులు, రేషన్, మద్యం దుకాణాల యజమానులను లక్ష్యంగా చేసుకుని బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పరిస్థితి బాగోలేదన్నా వదలడం లేదు. ఇవ్వా ల్సిందేనంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి : కృష్ణాజిల్లాలో 2,160, గుంటూరు జిల్లాల్లో 2,732 రేషన్ దుకాణాలుండగా, ఒక్కొక్కరి నుంచి అధికారపార్టీ నేతలు రూ.5వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. అదే విధంగా కృష్ణాలో 320, గుంటూరులో 350 మద్యం షాపులు, బార్ల నిర్వాహకులు ఒక్కొక్కరి నుంచి రూ.20 వేల నుంచి రూ.30వేల వరకు వసూలుకు తెగబడ్డారు. వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు పుష్కరాలకు వస్తున్నారని, వారికి భోజన వసతి ఏర్పాట్లు చేయాలని చెప్పి ఈ దందాకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఇలా 65 శాతం దుకాణాల నుంచి వసూలు చేసినట్లు సమాచారం. మిగిలిన వారికి ఒకటి రెండు రోజులు గడువు విధించినట్లు బాధితులు తెలిపారు.
ఇవ్వకపోతే షాపు ఉండదు...
డబ్బు ఇవ్వకపోతే షాపు లెసైన్స్ రద్దుచేయిస్తామని అధికారపార్టీ నేతలు బెదిరించినట్లు విజయవాడ నగరంలోని ఓ మహిళా రేషన్ డీలర్ కన్నీరుపెట్టారు. విజయవాడ- గుంటూరు మధ్య ఉన్న ఓ బార్ యజమాని నుంచి రూ.30వేలు తీసుకున్నట్లు తెలిసింది. ఆ పక్కనే రోడ్డుకు అటువైపు ఉన్న మరో మద్యం దుకాణం యజమాని వద్దకెళ్లి రూ.20వేలు ఇవ్వాలంటూ దబాయించినట్లు తెలిసింది. ‘రేపటిలోగా ఏర్పాటు చేయకపోతే ఇక్కడ నీ వైన్ షాపు ఉండదు’ అంటూ హెచ్చరించినట్లు సమాచారం. రేషన్, మద్యం దుకాణాలు, బార్ల నుంచి మొత్తం రూ.5 కోట్ల వరకు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకు న్నారు. రేషన్ షాపుల నుంచి రూ.2.45 కోట్లు, మద్యం దుకాణాల నుంచి రూ.1.34 కోట్లు వసూలు చేస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని బార్ల యజమానుల నుంచి వ్యాపారాన్ని బట్టి దండుకోవాలని సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఒక్కో బారుకు ఒక్కో ధర నిర్ణయించినట్లు సమాచారం.
వ్యాపారుల నుంచి రూ.కోటికి పైగా...
రెండు జిల్లాలోని వివిధ రకాల వ్యాపారుల నుంచి రూ.కోటికిపైగా వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. చిన్న, పెద్ద, మధ్య తరగతి వ్యాపారులు ఒక్కొక్కరికి ఒక్కో రేటు నిర్ణయించినట్లు సమాచారం. అందులో హోటళ్లు, వస్త్ర, బంగారు, షోరూంలతో పాటు వివిధ రకాల వ్యాపారుల నుంచి భారీ మొత్తంలోనే దండుకోవాలని ప్లాన్ వేశారు. అన్ని రకాల వ్యాపారులు, కొందరు పారిశ్రామికవేత్తల నుంచి మరో రూ.5 కోట్ల వరకు వసూలు చేసే విధంగా ప్లాన్ వేశారు. అందులో భాగంగా ఇప్పటికే 50శాతం వ్యాపారుల నుంచి వసూలు చేసినట్లు తెలిసింది. మిగిలిన వారి నుంచి ఒకటి, రెండు రోజుల్లో పూర్తి చేయనున్నట్లు సమాచారం.
ఇలా వసూలు చేసుకున్న మొత్తాన్ని పుష్కర భక్తుల కోసం వెచ్చిస్తారా? లేదా? అని కృష్ణా జిల్లా టీడీపీ నేతల మధ్య రెండు రోజుల క్రితం చర్చ సాగింది. ఆ చర్చలో ఓ ముఖ్య నాయకుడు ‘ముందు వసూలు చేయండి. తరువాత భక్తులకు పెట్టాలా? వద్దా ? అనేది చెబుతాం’ అని అన్నట్టు టీడీపీ నాయకుడు ఒకరు వెల్లడించడం గమనార్హం.