
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట మోసం
సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగాలు... పెద్దమెుత్తంలో వేతనం.. దీనికోసం చేయాల్సిందల్లా రూ.లక్ష చెల్లించడమే! అంటూ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగి చెప్పిన మాటలతో పలువురు నిరుద్యోగులు అప్పులు తెచ్చి మరీ డబ్బు చెల్లించారు. ఇప్పుడు ఉద్యోగాలు లేకపోగా.. డబ్బులు సైతం ఇవ్వకుండా బెదిరిస్తుండడంతో ఏం చేయాలో పాలుపోక వారు ఆందోళన చెందుతున్నారు.
► 20 మంది దగ్గర రూ.లక్షలు వసూలు చేసిన ఉద్యోగి
► ఎవరికి చెప్పుకున్నా నాకేం కాదంటూ బెదిరింపులు
పదో తరగతి నుంచి ఎంటెక్ వరకు చదివితే చాలు.. తమ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మబలికాడు. దీంతో జిల్లాలోని పస్రా, రేగొండ, శాయంపేట, నర్సంపేటకు చెందిన సుమారు 20 మంది గత ఏడాది డబ్బు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో అకౌంట్‌నంబర్ చెప్పిన వేణుమాధవ్ అందులో జమ చేయాలని సూచించగా నిరుద్యోగులు డబ్బు వేశారు. అప్పటి నుంచి రేపు, మాపు అంటూ సంవత్సర కాలంగా వేణుమాధవ్ గడుపుతుండడంతో సదరు నిరుద్యోగులు ఇటీవల నిలదీశారు. అయితే, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి.. నాకేం కాదంటూ బెదిరించడంతో పాటు ఫోన్ స్విచాఫ్ చేశాడు. దీంతో వారు వేణుమాధవ్ తండ్రి, ఎంఈఓ ఐలయ్య దృష్టికి తీసుకువెళ్లగా ఆయన పట్టించుకోలేదు. దీంతో రూ.20లక్షలకుపైగా ఇచ్చిన నిరుద్యోగులు తమకు జరిగిన మోసం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
– గుర్రల రమేష్, పస్రా