ఆర్టీసీ కండక్టర్ నిజాయతీని చాటుకున్నాడు.
ఆరు తులాల ఆభరణాలు
అడ్రస్ కనుక్కొని అందజేసిన కండక్టర్
కామారెడ్డి:
ఆర్టీసీ కండక్టర్ నిజాయతీని చాటుకున్నాడు. ప్రయాణికులు బస్సులో మర్చిపోయిన ఆరు తులాల బంగారం ఉన్న బ్యాగును వారికి అందజేసి అందరి మన్ననలు పొందాడు. అసలేం జరిగిందంటే.. కేఎల్ గౌడ్ కామారెడ్డి డిపోలో కండక్టర్. ఆయన కామారెడ్డి–హైదరాబాద్ (ఏపీ 29 జడ్ 1742)లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే, రామాయంపేటలో బస్సు ఎక్కిన మెదక్‌కు చెందిన ఉదయ్‌కుమార్ కుటుంబం కామారెడ్డిలో దిగిపోయింది. అయితే, వారు బ్యాగును బస్సులోనే మర్చిపోయారు.
ఇది గుర్తించిన కండక్టర్ బ్యాగ్‌ను తెరిచి చూడగా, ఆరు తులాల బంగారం, దుస్తులు కనిపించాయి. అందులో లభించిన మందుల చిట్టీ ఆధారంగా ఉదయ్‌కుమార్ ఫోన్‌నెంబర్‌ను తెలుసుకొని, ఆయనకు సమాచారమిచ్చాడు. దీంతో వారు కామారెడ్డికి చేరుకున్నారు. డిపో మేనేజర్ జనార్దన్ సమక్షంలో కండక్టర్ ఆరు తులాల బంగారంతో ఉన్న బ్యాగును వారికి అందజేశాడు. కండక్టర్‌ను డీఎం, ఆర్టీసీ అధికారులు, యూనియన్ నేతలు శివరాజవ్వ, దత్తు, ఎస్‌ఎస్‌గౌడ్, ఎస్‌కే మూర్తి అభినందించారు.