చోరీల కేసులతో కాసుల వేట | robery cases police | Sakshi
Sakshi News home page

చోరీల కేసులతో కాసుల వేట

Sep 24 2016 10:55 PM | Updated on Sep 4 2017 2:48 PM

ఆయనో పోలీసు ఉన్నతాధికారి. నేర విభాగంలో పని చేస్తున్న ఆయన కేసుల దర్యాప్తులో చురుకూ, సమర్థతా కలిగిన వాడే. ఆయన అజమాయిషీలో 50 మంది పైనే పోలీసులు పని చేస్తుంటారు. ఆయన పని చేస్తున్న కార్యాలయానికీ రాష్ట్రస్థాయిలో పేరుప్రఖ్యాతులున్నాయి. అక్కడ పనిచేసిన పోలీసులే ఒకప్పుడు స్టువర్టుపురం దొంగలను కట్టడి చేసి మన్ననలు అందుకున్నారు.

  • కాకినాడలో క్రైం విభాగం అధికారి దందా
  • ఓ భారీ దొంగతనం కేసులో దండిగా అక్రమార్జన
  • లక్షలు పుచ్చుకుని ముగ్గురు దొంగలకు విముక్తి
  • మిగిలిన వారి కాల్‌డేటాల్లో ఉన్నవారి నుంచీ కాసుల వేట
  • అరెస్టుల బెదిరింపుతో అందినకాడికి దండుడు
  •  
     
    (లక్కింశెట్టి శ్రీనివాసరావు–సాక్షి ప్రతినిధి)
    ఆయనో పోలీసు ఉన్నతాధికారి. నేర విభాగంలో పని చేస్తున్న ఆయన కేసుల దర్యాప్తులో చురుకూ, సమర్థతా కలిగిన వాడే. ఆయన అజమాయిషీలో 50 మంది పైనే పోలీసులు పని చేస్తుంటారు. ఆయన పని చేస్తున్న కార్యాలయానికీ రాష్ట్రస్థాయిలో పేరుప్రఖ్యాతులున్నాయి. అక్కడ పనిచేసిన పోలీసులే ఒకప్పుడు స్టువర్టుపురం దొంగలను కట్టడి చేసి మన్ననలు అందుకున్నారు. అలాంటి కార్యాలయ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న సదరు అధికారి ఎదురుపడితే అసాంఘిక శక్తులు, దొంగలు భయంతో గజగజ వణికిపోవాలి. కానీ దొంగల్లో కొందరికి ఆయన పక్కనే కూర్చుని కాఫీ తాగేంత చనువు ఉంది. కారణం.. ప్రభుత్వం నుంచి ప్రతినెలా లక్షకు పైగా వచ్చే జీతం కంటే దొంగల ద్వారా ముట్టేది ఎక్కువ కావడమే. కాకినాడలో కొలువు చేస్తున్న ఆ ఖాకీముసుగులోని చోరప్రియుని అవినీతి దందాకు తాజా ఉదాహరణ ఇది..
     
    ‘స్మార్ట్‌ సిటీ’ జాబితాలో చేరిన కాకినాడ నగరం మాటెలా ఉన్నా.. ఇక్కడి దొంగలు, వారికి దన్నుగా నిలిచే కొందరు పోలీసులు మాత్రం తమ దండుడు దందాలో యమ స్మార్ట్‌గా ఉన్నారు. నగరంలో గత జూలైలో ఒక అర్ధరాత్రి ఒక ఇంటిలో దొంగలు పడ్డారు. జియో సిమ్‌లతో దేశంలో కమ్యూనికేషన్‌ రంగాన్ని కుదిపేస్తున్న కార్పొరేట్‌ కంపెనీకి చెందిన వేరే సంస్థలో పనిచేస్తున్న ఉన్నతా«ధికారి ఇల్లు అది. దొంగలు పెద్ద ఎత్తున బంగారం కాయిన్‌లు, బంగారు వస్తువులు, వెండి, ఐదారు లక్షల నగదు దోచుకుపోయారు. తెల్లారి లేచాక విషయం తెలుసుకున్న ఇంటి యజమాని క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పైన పేర్కొన్న అధికారి గడచిన మూడు నెలలుగా తన అనుభవాన్నంతటినీ రంగరించి మొత్తం మీద చోరీకి పాల్పడ్డ 20 మంది నిందితులను పట్టుకున్నారు. దోచుకున్న సొత్తునూ రాబట్టారు. తక్కువ సమయంలో భారీ చోరీ కేసును ఛేదించిన ఆ అధికారిని ఎవరైనా అభినందించాల్సిందే. 
    మంచి ఆదాయవనరు..
    అయితే ఈ దొంగా పోలీసు కథలో అసలు మలుపు ఇక్కడే ఉంది. దొంగలను పట్టుకున్నా, సొత్తును రాబట్టినా ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. కారణం.. ఆ అధికారి ఈ కేసును తనకు మంచి ఆదాయవనరుగా మలచుకోవడమే.  ఈ కేసులో అదుపులోకి తీసుకున్న 20 మందిలో అంతా పేరుమోసిన దొంగలే. కాగా చోరీకి సూత్రధారులైన కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన ముగ్గురిని కేసు, బెయిల్‌ వంటివి లేకుండానే విడిచిపెట్టేశారు. ఆ ముగ్గురి దగ్గరా రూ.మూడు లక్షల నుంచి రూ.ఐదు లక్షల చొప్పున ముడుపులు మూటగట్టుకోవడమే అందుకు కారణం. కాకినాడలోని సాంబమూర్తినగర్, ఇంద్రపాలెం, అచ్యుతాపురం ప్రాంతాలకు చెందిన ఆ ముగ్గురిలో ఒకరైతే సదరు పోలీసు అధికారి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏకంగా మలేషియానే చెక్కేశాడు. అక్కడితోనే ఈ దొంగా పోలీసు కథ ముగిసిపోలేదు. కేవలం ఇది విరామం మాత్రమే. ఆ దొంగ మలేషియా చెక్కేసే వరకు ఆగి ఇప్పుడు అతడిS కుటుంబ సభ్యులను వేధించనారంభించాడు సదరు పోలీసు అధికారి. తనకు మరికొంత ముట్టచెప్పకపోతే మలేషియా నుంచి మీవాడిని అరెస్టు చేసి తీసుకువస్తామని బెదిరించ సాగారు. 
    కాల్‌డేటాలో నంబరుండడమే నేరం..
    అలాగే పోలీసుల అదుపులో ఉన్న 20 మంది మొబైల్‌ ఫోన్‌లకు కాల్స్‌ చేసిన వారిని కూడా ఆయన విడిచిపెట్టడం లేదు. ‘ఈ కేసు చాలా పెద్దది. చోరీ చేసిన వారి ఫోన్‌లలో మీ కాల్స్‌ ఉన్నాయి. మిమ్మల్నీ అరెస్టు చేస్తాం. ఇందులో బుక్‌ అయితే ఏడెనిమిదేళ్లు జైలు తప్ప’దని చెబుతూ అనేకులను భయపెట్టి సొమ్ములు మూటగట్టుకుంటున్నారు. కాగా ఈ కేసులో పట్టుకుని విడిచి పెట్టేసిన ముగ్గురులో ఒకరు త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌కు ఎదురుగా ఉన్న వీధిలో ఒక ఫైనాన్స్‌ సంస్థలో పనిచేస్తూ అదే సంస్థలో జరిగిన దొంగతనానికి సూత్రధారి కావడం గమనార్హం. ఆ దొంగే మలేషియా వెళ్లిపోయాడు. మరో నిందితుడుS సర్పవరం స్పెన్సర్‌కు సమీపాన ఒక ఫైనాన్సియర్‌ ఇంటిలో కూడా దొంగతనానికి పాల్పడ్డవాడే. 
     
    గోల్డ్‌ కాయిన్లలో సగం కొడుకు స్నేహితుడికి..!
    ఈ కథలో మరో ట్విస్టు కూడా ఉంది. పట్టుకున్న దొంగల నుంచి రికవరీ చేసిన ఆరు గోల్డ్‌కాయిన్‌లలో మూడింటిని మాత్రమే రికవరీ చేసినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. మిగిలిన మూడు కాయిన్‌లతో ‘సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడుపడవోయ్‌’ అన్న కవి గురజాడ మాటను పాటిస్తున్నట్టు.. తన కుమారుడి స్నేహితుడికి ప్రయోజనం చేకూర్చాలని చూస్తున్నారు. రెండో పట్టణ పోలీసు స్టేషన్‌కు సమీపాన ఉన్న ఆ స్నేహితుడి ఇంటిలో చోరీ జరిగింది. పై కేసులోని మూడు గోల్డ్‌ కాయిన్‌లు ఈ కేసులో రికవరీ చూపించి కొడుకు స్నేహితుడికి లాభం చేకూర్చాలనే ఎత్తులు వేస్తున్నారు. ఈ విషయం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయినా సదరు అధికారి ఖాతరు చేయడం లేదని, విషయం బట్టబయలైనా ఫర్వాలేదు. lపై అధికారులకు తాను ఎంత చెబితే అంత అనే ధీమాతో వ్యవహరిస్తున్నారు. ఈ దొంగా పోలీసు కథలో చివరకు అసలు సొత్తు పోగొట్టుకున్న వారికి న్యాయం జరుగుతుందా లేదా అనేది తెలియాలంటే కేసు దర్యాప్తు ‘అధికారికం’గా పూర్తి కావాలి. ఈ ‘దొంగ పోలీసు’.. శాఖకే మచ్చ అని ఉన్నతాధికారులు ముకుతాడు వేస్తారో, ‘పోనీలే..రక్షకభట వ్యవస్థ మాటున భక్షణకు అలవడ్డ వారిలో ఒకడు’ అని మిన్నకుంటారో చూడాలి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement