breaking news
robery cases police
-
ఈ దొంగ... ‘బంగారు’ కొండ!
కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలరీస్ షోరూంలో ఈ నెల మొదటి వారంలో భారీ దోపిడీకి ఒడిగట్టిన ముఠా నాయకుడు సుబోధ్ సింగ్ అలియాస్ బబువా సామాన్యుడు కాదు. గోల్డెన్ థీఫ్గా పేరున్న ఇతగాడు ఇప్పటి వరకు ఏడు రాష్ట్రాల్లో జరిగిన 400 కేజీల బంగారం చోరీ, దోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. బీహార్‌లోని జైలు నుంచే పీఎంజే జ్యువెలర్స్‌లో దోపిడీకి స్కెచ్ చేసి, కథ నడిపంచాడు. ఈ గ్యాంగ్‌ను పట్టుకున్న కరీంనగర్ పోలీసులు ప్రస్తుతం సుబోధ్‌ను పీటీ వారెంట్‌పై తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. పదేళ్లల్లో ఏడు రాష్ట్రాల్లో పంజా విసిరిన ఈ సుబోధ్ సింగ్ పూర్వాపరాలు ఇవి...బీహార్‌లోని నాలంద జిల్లాలో ఉన్న చండి పోలీసుస్టేషన్ పరిధిలోని చిస్టిపూర్కు చెందిన ఈశ్వర్ ప్రసాద్ కుర్మి కుమారుడే సుబోధ్ సింగ్ (42). ఇతడిపై దేశంలోని ఏడు రాష్ట్రాల్లో దోపిడీ, హత్య, బందిపోటు దొంగతనం, దాడుల వంటి కేసులు నమోదయ్యాయి. పీఎంజే కేసుతో కలిపితే ఇతడిపై ఉన్న వాటి సంఖ్య 43కు చేరింది. ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా సంప్రదింపులు జరుపుతూ... గూగుల్ మ్యాప్స్, ప్రత్యేక యాప్స్ వంటి అత్యాధునిక విధానాలను వినియోగిస్తూ పంజా విసిరే, విసిరించే సుబోధ్ చదివి కేవలం 12వ తరగతి.1996 వరకు ఇతగాడు బీహార్‌లోని వైశాలి జిల్లాకు చెందిన చిన్నచిన్న దొంగలతో కలిసి నేరాలు చేశాడు. 1999 నాటికి బీహార్ పోలీసులకు ఇన్ఫార్మర్గా మారాడు. ఆ సమయంలో ఇతడు బీహార్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులతో పాటు ఉన్నతాధికారులతో కూడా సంబంధాలు పెంచుకున్నాడు. 2007 వరకు తన ఇన్ఫార్మర్ పనిని కొనసాగించాడు. ఇలా సుబోధ్‌కు పోలీసుల పని తీరు, వ్యూహం, కదలికలు పూర్తిగా అవగతం అయ్యాయి. ఓపక్క ఇన్ఫార్మర్గా పనిచేస్తూనే... మరోపక్క తన నేర నెట్‌వర్క్‌ను పెంచుకుంటూ పోయాడు.తనకు ప్రత్యర్థులు, పోటీదారులుగా ఉన్న దొంగలు, ముఠాల సమాచారాన్ని బీహార్ పోలీసులకు అందించిన అతడు.. వాళ్లు జైలుకు వెళ్లేలా చేసి తన ‘లైన్’ క్లియర్ చేసుకున్నాడు. 2008లో ఇతగాడు కోల్‌కతాలోని ఎస్బీఐ బ్యాంకులో దోపిడీ చేశాడు. ఇదే ఇతడి తొలి భారీ నేరం. ఆ తర్వాత రాయపూర్‌లోని ఒక బ్యాంకులో కూడా పంజా విసిరాడు. ఈ కేసుల్లో మొదట కోల్‌కతా పోలీసులు, తరువాత రాయపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2015 వరకు రాయపూర్ జైలులోనే ఉన్నాడు. బెయిల్‌పై విడుదలైన తర్వాత ముత్తూట్, మణప్పురం మరియు పెద్ద జువెలర్లను లక్ష్యంగా చేసుకుని సొంత గ్యాంగ్‌తో పంజా విసిరాడుసుభోద్ నేరచరిత్ర తొలిసారిగా 2018లో బీహార్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల దృష్టిలోకి వచ్చింది. ప్రతి నేరాన్నీ పక్కా పథకం ప్రకారం, రెక్కీ తర్వాత చేయిస్తున్నట్లు గుర్తించారు. ప్రతి నేరంలోనూ కొత్త అనుచరుల్ని ఏర్పాటు చేసుకుని వారికి ప్రత్యేక పేర్లు, పాత్రలు కేటాయించేవాడు. ప్రతి దోపిడీలో ఈ గ్యాంగ్ 5 నుంచి 20 కిలోలకు వరకు పసిడిని కొల్లగొట్టేది. 2018 నాటికి రాజస్థాన్‌లోని జైపూర్, మహారాష్ట్రలోని పుణే, నాగ్‌పూర్, పశ్చిమ బెంగాల్‌లోని బరాక్పూర్లలో భారీ బంగారం దోపిడీలు చేశాడు. బీహార్‌లోని అనేక నగరాల్లో కూడా నేరాలు చేశాడు.2018 జనవరిలో బీహార్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సుబోధ్‌ను అక్కడి వైశాలి జిల్లా దానాపూర్‌లో అరెస్ట్ చేసింది. తన ప్రేయసిని కలవడానికి వచ్చిన సమయంలో పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి ఏకంగా 16.5 కిలోల బంగారం, ఒక పిస్టల్, దేశీయ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అతడిని పాట్నాలోని బేయూర్ జైలుకు తరలించారు. చాలా కాలం ఆ జైలులోనే ఉన్నాడు. అక్కడి నుంచే తన గ్యాంగ్ సహాయంతో వరుసగా బంగారం దోపిడీలకు పథకాలు వేస్తూ, అమలు చేస్తూపోయాడు.తాను జైలులో ఉన్నప్పటికీ గ్యాంగ్‌ను విస్తరించాడు. సుబోధ్ సింగ్ జైలులో నుంచే కొత్త వ్యక్తులను తన గ్యాంగ్‌లోకి చేర్చడం ప్రారంభించాడు. స్నాచింగ్స్, దొంగతనం కేసుల్లో ఎవరైనా జైలుకు వచ్చిన వాళ్లను సుబోధ్ సింగ్ టార్గెట్ చేసుకుంటాడు. ఇలాంటి వాళ్లను అతడితో పాటు అతడి అనుచరులు బెయిల్, డబ్బు ఆశ చూపి తమవైపు తిప్పుకుంటారు ఆ వ్యక్తి అంగీకరిస్తే జైలులో నుంచే వారి బెయిల్ ఏర్పాట్లు చేయిస్తాడు. వారు బయటకు వచ్చిన తరువాత అప్పటి బయట ఉన్న తన గ్యాంగ్ సభ్యులతో వారికి శిక్షణ ఇప్పించి, బంగారం ఎక్కడ ఎలా దోచుకోవాలో నేర్పిస్తాడు.సుబోధ్ గ్యాంగ్ దోచుకున్న బంగారాన్ని నేపాల్ మరియు పశ్చిమ బెంగాల్‌కు తీసుకెళ్తుంది. అక్కడ దానిని కరిగించి విక్రయిస్తారు. దేశంలో జరిగిన మొత్తం బంగారం దోపిడీల్లో 70 శాతం తమ గ్యాంగ్ దేనని సుబోధ్ పోలీసులకు చెప్తూ ఉంటాడు. జైలులో ఉన్నప్పటికీ వివిధ రాష్ట్రాల్లో నేరాలకు సుబోధ్ సింగ్ పథకాలు రచిస్తాడు. అతడు పాట్నాలోని బేయూర్ జైలులో సెక్టార్–3లోని 21, 22 బ్యారక్‌ల్లో ఉంటాడు. అక్కడ అతడికి వీఐపీ ట్రీట్మెంట్తో పాటు అన్ని సౌకర్యాలు ఉంటాయని సమాచారం. ఈ రెండు బ్యారక్‌ల్లో సుబోధ్ సింగ్ గ్యాంగ్ సభ్యులు, అతడి పరిచయస్తులే ఉంటారట.2025 మార్చిలో ఒడిశాలో జరిగిన బంగారం దోపిడీ కేసులో విచారణ కోసం ఒడిశా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై ఈ ఏడాది ప్రథమార్థలో రాజస్థాన్‌కు చెందిన కంకరోలి పోలీసులు ఇతడిని ఒడిశా నుంచి పీటీ వారెంట్‌పై తీసకువెళ్లారు. బేయూర్ జైలులో ఉన్న సుబోధ్ రాజస్థాన్‌కు చెందిన సైబర్ నేరగాడు కునాల్‌ను బెదిరించి రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. ఆ మొత్తం చెల్లించడానికి అతడు అంగీకరించకపోవడంతో కునాల్‌పై హత్యాయత్నం చేయించాలని భావించాడు. కునాల్‌ను పోలీసులు సియాల్దా కోర్టులో హాజరు పరిచిన సమయంలో అతడిపై కాల్పులు జరిపించాలని భావించాడు. తన అనుచరులకు ఆదేశాలు ఇవ్వడం ద్బారా కునాల్‌పై ఉపాసన ఎక్స్‌ప్రెస్ రైలులో ఎస్కార్ట్ పోలీసు సమక్షంలోనే కాల్పులు జరిపించాడు. అతడు ప్రాణాలతో బయటపడగా... గార్డు గాయపడ్డాడు.2023 ఆగస్టు 23న కంకరోలిలోని భగవందాస్ మార్కెట్ ఎదురుగా ఉన్న రూపం గోల్డ్ జువెలర్స్‌లో దోపిడీ జరిగింది. ఉదయం 10:30 గంటలకు నాలుగు బైక్‌లపై వచ్చిన నేరస్తులు వ్యాపారి మరియు ఉద్యోగులను తుపాకీతో బెదిరించి బందీలుగా మార్చి సుమారు మూడు కిలోల బంగారం, రూ.18 లక్షల రూపాయల నగదు దోచుకెళ్లారు. దోపిడీదారులు ఉపయోగించిన బైక్‌లలో ఒకదాన్ని భిల్వారా రైల్వే స్టేషన్ సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. ఆ బైక్ బీహార్ నుంచి దొంగిలించబడినదిగా తేలింది. నిందితులు రైలులో బీహార్‌కు పారిపోయినట్లు విచారణలో నిర్ధారణ అయింది. ఈ కేసులో సుబోధ్‌ను పీటీ వారెంట్‌పై అరెస్టు చేశారు.ఇంతకుముందు ఇదే గ్యాంగ్ 2022 ఆగస్టు 29న ఉదయపూర్‌లోని సుందర్వాస్లో ఉన్న మణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచ్‌లో జరిగిన భారీ దోపిడీలో కూడా పాల్గొన్నట్లు తేలింది. ఈ కేసులో సుబోధ్‌తో పాటు ముగ్గురు నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సుబోధ్ బీహార్‌లోని పూర్నియా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.– శ్రీరంగం కామేష్, క్రైమ్ రిపోర్టర్, హైదరాబాద్. -
చోరీల కేసులతో కాసుల వేట
కాకినాడలో క్రైం విభాగం అధికారి దందా ఓ భారీ దొంగతనం కేసులో దండిగా అక్రమార్జన లక్షలు పుచ్చుకుని ముగ్గురు దొంగలకు విముక్తి మిగిలిన వారి కాల్డేటాల్లో ఉన్నవారి నుంచీ కాసుల వేట అరెస్టుల బెదిరింపుతో అందినకాడికి దండుడు (లక్కింశెట్టి శ్రీనివాసరావు–సాక్షి ప్రతినిధి) ఆయనో పోలీసు ఉన్నతాధికారి. నేర విభాగంలో పని చేస్తున్న ఆయన కేసుల దర్యాప్తులో చురుకూ, సమర్థతా కలిగిన వాడే. ఆయన అజమాయిషీలో 50 మంది పైనే పోలీసులు పని చేస్తుంటారు. ఆయన పని చేస్తున్న కార్యాలయానికీ రాష్ట్రస్థాయిలో పేరుప్రఖ్యాతులున్నాయి. అక్కడ పనిచేసిన పోలీసులే ఒకప్పుడు స్టువర్టుపురం దొంగలను కట్టడి చేసి మన్ననలు అందుకున్నారు. అలాంటి కార్యాలయ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న సదరు అధికారి ఎదురుపడితే అసాంఘిక శక్తులు, దొంగలు భయంతో గజగజ వణికిపోవాలి. కానీ దొంగల్లో కొందరికి ఆయన పక్కనే కూర్చుని కాఫీ తాగేంత చనువు ఉంది. కారణం.. ప్రభుత్వం నుంచి ప్రతినెలా లక్షకు పైగా వచ్చే జీతం కంటే దొంగల ద్వారా ముట్టేది ఎక్కువ కావడమే. కాకినాడలో కొలువు చేస్తున్న ఆ ఖాకీముసుగులోని చోరప్రియుని అవినీతి దందాకు తాజా ఉదాహరణ ఇది.. ‘స్మార్ట్ సిటీ’ జాబితాలో చేరిన కాకినాడ నగరం మాటెలా ఉన్నా.. ఇక్కడి దొంగలు, వారికి దన్నుగా నిలిచే కొందరు పోలీసులు మాత్రం తమ దండుడు దందాలో యమ స్మార్ట్‌గా ఉన్నారు. నగరంలో గత జూలైలో ఒక అర్ధరాత్రి ఒక ఇంటిలో దొంగలు పడ్డారు. జియో సిమ్‌లతో దేశంలో కమ్యూనికేషన్ రంగాన్ని కుదిపేస్తున్న కార్పొరేట్ కంపెనీకి చెందిన వేరే సంస్థలో పనిచేస్తున్న ఉన్నతా«ధికారి ఇల్లు అది. దొంగలు పెద్ద ఎత్తున బంగారం కాయిన్లు, బంగారు వస్తువులు, వెండి, ఐదారు లక్షల నగదు దోచుకుపోయారు. తెల్లారి లేచాక విషయం తెలుసుకున్న ఇంటి యజమాని క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పైన పేర్కొన్న అధికారి గడచిన మూడు నెలలుగా తన అనుభవాన్నంతటినీ రంగరించి మొత్తం మీద చోరీకి పాల్పడ్డ 20 మంది నిందితులను పట్టుకున్నారు. దోచుకున్న సొత్తునూ రాబట్టారు. తక్కువ సమయంలో భారీ చోరీ కేసును ఛేదించిన ఆ అధికారిని ఎవరైనా అభినందించాల్సిందే. మంచి ఆదాయవనరు.. అయితే ఈ దొంగా పోలీసు కథలో అసలు మలుపు ఇక్కడే ఉంది. దొంగలను పట్టుకున్నా, సొత్తును రాబట్టినా ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. కారణం.. ఆ అధికారి ఈ కేసును తనకు మంచి ఆదాయవనరుగా మలచుకోవడమే. ఈ కేసులో అదుపులోకి తీసుకున్న 20 మందిలో అంతా పేరుమోసిన దొంగలే. కాగా చోరీకి సూత్రధారులైన కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన ముగ్గురిని కేసు, బెయిల్ వంటివి లేకుండానే విడిచిపెట్టేశారు. ఆ ముగ్గురి దగ్గరా రూ.మూడు లక్షల నుంచి రూ.ఐదు లక్షల చొప్పున ముడుపులు మూటగట్టుకోవడమే అందుకు కారణం. కాకినాడలోని సాంబమూర్తినగర్, ఇంద్రపాలెం, అచ్యుతాపురం ప్రాంతాలకు చెందిన ఆ ముగ్గురిలో ఒకరైతే సదరు పోలీసు అధికారి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏకంగా మలేషియానే చెక్కేశాడు. అక్కడితోనే ఈ దొంగా పోలీసు కథ ముగిసిపోలేదు. కేవలం ఇది విరామం మాత్రమే. ఆ దొంగ మలేషియా చెక్కేసే వరకు ఆగి ఇప్పుడు అతడిS కుటుంబ సభ్యులను వేధించనారంభించాడు సదరు పోలీసు అధికారి. తనకు మరికొంత ముట్టచెప్పకపోతే మలేషియా నుంచి మీవాడిని అరెస్టు చేసి తీసుకువస్తామని బెదిరించ సాగారు. కాల్‌డేటాలో నంబరుండడమే నేరం.. అలాగే పోలీసుల అదుపులో ఉన్న 20 మంది మొబైల్ ఫోన్లకు కాల్స్ చేసిన వారిని కూడా ఆయన విడిచిపెట్టడం లేదు. ‘ఈ కేసు చాలా పెద్దది. చోరీ చేసిన వారి ఫోన్లలో మీ కాల్స్ ఉన్నాయి. మిమ్మల్నీ అరెస్టు చేస్తాం. ఇందులో బుక్ అయితే ఏడెనిమిదేళ్లు జైలు తప్ప’దని చెబుతూ అనేకులను భయపెట్టి సొమ్ములు మూటగట్టుకుంటున్నారు. కాగా ఈ కేసులో పట్టుకుని విడిచి పెట్టేసిన ముగ్గురులో ఒకరు త్రీటౌన్ పోలీసు స్టేషన్‌కు ఎదురుగా ఉన్న వీధిలో ఒక ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తూ అదే సంస్థలో జరిగిన దొంగతనానికి సూత్రధారి కావడం గమనార్హం. ఆ దొంగే మలేషియా వెళ్లిపోయాడు. మరో నిందితుడుS సర్పవరం స్పెన్సర్‌కు సమీపాన ఒక ఫైనాన్సియర్ ఇంటిలో కూడా దొంగతనానికి పాల్పడ్డవాడే. గోల్డ్ కాయిన్లలో సగం కొడుకు స్నేహితుడికి..! ఈ కథలో మరో ట్విస్టు కూడా ఉంది. పట్టుకున్న దొంగల నుంచి రికవరీ చేసిన ఆరు గోల్డ్కాయిన్లలో మూడింటిని మాత్రమే రికవరీ చేసినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. మిగిలిన మూడు కాయిన్లతో ‘సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడుపడవోయ్’ అన్న కవి గురజాడ మాటను పాటిస్తున్నట్టు.. తన కుమారుడి స్నేహితుడికి ప్రయోజనం చేకూర్చాలని చూస్తున్నారు. రెండో పట్టణ పోలీసు స్టేషన్‌కు సమీపాన ఉన్న ఆ స్నేహితుడి ఇంటిలో చోరీ జరిగింది. పై కేసులోని మూడు గోల్డ్ కాయిన్లు ఈ కేసులో రికవరీ చూపించి కొడుకు స్నేహితుడికి లాభం చేకూర్చాలనే ఎత్తులు వేస్తున్నారు. ఈ విషయం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయినా సదరు అధికారి ఖాతరు చేయడం లేదని, విషయం బట్టబయలైనా ఫర్వాలేదు. lపై అధికారులకు తాను ఎంత చెబితే అంత అనే ధీమాతో వ్యవహరిస్తున్నారు. ఈ దొంగా పోలీసు కథలో చివరకు అసలు సొత్తు పోగొట్టుకున్న వారికి న్యాయం జరుగుతుందా లేదా అనేది తెలియాలంటే కేసు దర్యాప్తు ‘అధికారికం’గా పూర్తి కావాలి. ఈ ‘దొంగ పోలీసు’.. శాఖకే మచ్చ అని ఉన్నతాధికారులు ముకుతాడు వేస్తారో, ‘పోనీలే..రక్షకభట వ్యవస్థ మాటున భక్షణకు అలవడ్డ వారిలో ఒకడు’ అని మిన్నకుంటారో చూడాలి.


