ఆక్వాఫుడ్‌ పార్క్‌పై తుదిపోరుకు సిద్ధంకండి | Sakshi
Sakshi News home page

ఆక్వాఫుడ్‌ పార్క్‌పై తుదిపోరుకు సిద్ధంకండి

Published Sun, Aug 21 2016 11:01 PM

ready to fight on aqua food park

భీమవరం అర్బన్‌ : భీమవరం మండలంలోని తుందుర్రు, కంసాల బేతపూడి, జొన్నలగరువు గ్రామాల మధ్య నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్కు నిర్మాణానికి వ్యతిరేకంగా తుది పోరాటానికి సిద్ధం కావాలని పోరాట కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. భీమవరం మండలంలోని గోదావరి మెగా ఫుడ్‌ పార్కు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాట కమిటీ నాయకులు ఆదివారం జొన్నలగరువు, పెదగరువు, వెంప, కోమటితిప్ప, మత్స్యపురి, మొగల్తూరు మండలంలోని కొత్తోట, వారతిప్ప, శేరేపాలెం గ్రామాల్లో బైక్‌ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు సముద్రాల వెంకటేశ్వరరావు, ముచ్చర్ల త్రిమూర్తులు, ఆరేటి వాసు, జవ్వాతి సత్యనారాయణ, తాడి దానియేలు, నన్నేటి నాగరాజు మాట్లాడుతూ ఆక్వా ఫుడ్‌ పార్కు నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజల్ని తుది పోరాటానికి సిద్ధం చేసేందుకు ఈ బైక్‌ ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు. పార్కు యాజమాన్యం ప్రభుత్వ అండ చూసుకుని గ్రామాల ప్రజల్ని కులాల తత్వం తీసుకువచ్చి గ్రూపులు విడదీసి వారి చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తుందని విమర్శించారు. ఈ ప్రాంత ప్రజలపై తప్పుడు కేసులు పెట్టించి ఫుడ్‌పార్కు నిర్మాణాన్ని చేపట్టడం శోచనీయమన్నారు. ఈ తుది పోరాటానికి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమానికి పోరాట కమిటీ నాయకులు బెల్లం సత్తిబాబు, కొత్తపల్లి కాశీవిశ్వనాథం, విమల, చంటిరాజు, రమేష్, మద్దా రాజారత్నం, చీడే భాస్కరరావు, చింతారావు పాల్గొన్నారు.
 
 
 

Advertisement
 
Advertisement
 
Advertisement