
తూప్రాన్‌లో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
కాంగ్రెస్ హయాంలో జిల్లా నుంచి సునీతారెడ్డి, దామోదర్ రాజనరసింహ ఇద్దరూ మంత్రులుగా ఉండి జిల్లాకు ఒరగబెట్టిందేమిటని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.
- ప్రాజెక్టులను అడ్డుకోవడం దారుణం
- దామోదర, సునీతపై మంత్రి హరీశ్‌రావు మండిపాటు
తూప్రాన్: కాంగ్రెస్ హయాంలో జిల్లా నుంచి సునీతారెడ్డి, దామోదర్ రాజనరసింహ ఇద్దరూ మంత్రులుగా ఉండి జిల్లాకు ఒరగబెట్టిందేమిటని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. సోమవారం తూప్రాన్ మండలం మనోహరాబాద్‌లో రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితో కలిసి ఓ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రులుగా ఉండి జిల్లాకు న్యాయం చేయలేకపోయారని, ఇప్పుడు ప్రాజెక్టులపై మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
‘ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేకపోయారు. ఒక్క ప్రాజెక్ట్ నిర్మించలేదు. మంత్రులుగా ఏమి చేశారో వారిద్దరు ఆత్మవిమర్శ చేసుకోవాలి’ అని ఆయన సూచించారు. మంత్రులుగా మీరు జిల్లా ప్రజలకు చేసిన అన్యాయాన్ని తాము సరిదిద్ది జిల్లాను సస్యశ్యామం చేసేందుకు మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మిస్తుంటే అడ్డుపడుతున్నారని విమర్శించారు.
‘మంత్రిగా మిమ్మల్ని ఈ స్థాయిని తెచ్చిన నర్సాపూర్‌కు లక్ష ఎకరాలకు నీరందిస్తుంటే మీరు తలుపులు అడ్డుపెడుతున్నారు. మీరు ప్రజలకు ఇచ్చే బహుమానం ఇదేనా..?’ అని సునీతారెడ్డిని ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ హయాంలో సింగూరు ప్రాజెక్ట్‌లో చుక్కనీరు లేదు. ప్రాజెక్ట్ కోసం 27 గ్రామాలను ముంచెత్తిన కాంగ్రెస్ హయాంలో ఒక్క గ్రామానికి నీరిచ్చావయ్యా? అని ప్రశ్నించారు.
ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌ను నిర్మించి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఎలక్షన్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ వైస్ చైర్మన్ శ్రీశైలంగౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్‌గౌడ్, రాఘవేంద్రగౌడ్, సుధాకర్‌రెడ్డి, మన్నే నాగరాజు తదితరులు పాల్గొన్నారు.