
లోకేష్ భజన.. ఈ మహానాడు స్పెషల్
ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో వివాదాల నడుమ మహానాడు నిర్వహణకు రంగం సిద్ధమైంది.
►చినబాబు భజనకు కౌంట్‌డౌన్ మొదలు
►నగరమంతా అతని ఫ్లెక్సీలు
►ఎన్టీఆర్‌కు మించి ప్రముఖంగా లోకేష్ ఫొటోలు
►పొగడ్తలు, ప్రశంసల బాజాభజంత్రీలు సిద్ధం
►బాలయ్యకు కనిపించని ప్రాధాన్యత
సంస్థాగత నిర్మాణం.. పార్టీ, ప్రభుత్వపరంగా ప్రజా సంక్షేమానికి చేపట్టిన చర్యలు.. భవిష్యత్తు కార్యాచరణ.. వంటి నిర్మాణాత్మక చర్చలు లక్ష్యంగా మహానాడును రూపుదిద్దారు.. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్.. ఇప్పుడా పరిస్థితి లేదు.. మహానాడు అంటేనే ఆత్మస్తుతి.. పరనింద.. ఈసారి కూడా అంతే.. కాకపోతే స్తుతి మారుతోంది. చంద్రబాబుతో పాటు లోకేష్ భజన స్తుతి తారస్థాయికి చేరనుంది.
ఫ్లెక్సీలు, బ్యానర్లతోనే మొదలైన చినబాబు భజన.. మూడురోజుల పాటు మహానాడు ప్రాంగణాన్ని మోతెక్కించనుంది.. ఇప్పటికే పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు మించి లోకేష్ ఫొటోలతో మహానాడు ప్రాంగణం, ఏయూ పరిసరాలు, విశాఖ నగర వీధులను పార్టీ శ్రేణులు నింపేశాయి. ఎన్‌టిఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని మే 28కి ముందు రోజు, తర్వాతి రోజు వెరసి మూడురోజులు పార్టీ పండగలా 35 ఏళ్ల కిందట మొదలైన మహానాడు.. ఇప్పుడు మంత్రి లోకేష్ బాబు భజనకు వేదికగా మారుతోందనేది పార్టీ శ్రేణులే అంగీకరిస్తున్న వాస్తవం.
విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో వివాదాల నడుమ మహానాడు నిర్వహణకు రంగం సిద్ధమైంది. శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజుల పాటు జరిగే అధికార పార్టీ పండుగకు ఏయూతో పాటు నగరం ముస్తాబమవుతోంది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు జరిగిన 35 మహానాడుల్లో రెండుసార్లు విశాఖ వేదికైంది. 1983లో ఎన్‌టి రామారావు పార్టీ స్థాపించిన తర్వాత మలి ఏడాది 1984లో మహానాడును విశాఖలోనే నిర్వహించారు. ఆ తర్వాత 2002లో చంద్రబాబు సీఎంగా, పార్టీ అధ్యక్షుడిగానూ ఉన్న కాలంలో విశాఖ పోర్టు స్డేడియంలో మహానాడు జరిగింది. పదిహేనేళ్ల తరా>్వత ఇప్పుడు మూడోసారి మహానాడుకు విశాఖ వేదికైంది.
ఈ 36వ మహానాడు ప్రత్యేకత చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ బాబుకు భజన చేయడమేనన్న వాదనలు స్వయంగా ఆ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఇప్పటికే పెత్తనం సాగిస్తున్న లోకేష్‌ను ఈ మహానాడు వేదికగా మరింత మోసేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే మహానాడు వేదికైన ఏయూ ప్రాంగణం మొత్తం లోకేష్ ఫ్లెక్సీలతో నిండిపోయింది. నగరంలోనూ, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తున్న బ్యానర్లలో ఆయన ఫొటోలే
ప్రముఖంగా కనిపిస్తున్నాయి.
బాలయ్య ఫొటోల్లేవ్
పదిహేనేళ్లుగా టీడీపీ బ్యానర్లలో చంద్రబాబుతో పాటు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఫొటోలే ఎక్కువగా కనిపించేవి. ఆ తర్వాత
ఎన్టీఆర్ అంత కాకపోయినా, ఆయన తనయుడు సినీనటుడు బాలకృష్ణ ఫొటోలను టీడీపీ బ్యానర్లలో అభిమానులు ముద్రించే వారు. అయితే ఈ మహానాడుకు పరిస్థితి మొత్తం మారిపోయింది. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పెట్టిన ఫ్లెక్సీల్లో తప్పించి ఎక్కడా బాలకృష్ణ ఫొటో మచ్చుకి కూడా కనిపించడం లేదు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఫొటోలు కూడా తగ్గిపోయాయి.. ఆయన స్థానాన్ని లోకేష్ ఫొటోలు ఆక్రమించాయి. ప్రతి బ్యానర్‌లోనూ లోకేష్ ఫొటో కచ్చితంగా పెట్టాలని, అది కూడా ప్రముఖంగా కనబడాలని పార్టీ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చాయని జిల్లా టీడీపీ నాయకుడొకరు చెప్పుకొచ్చారు.
ఆ మూడు రోజూలూ అదే జపం
పార్టీ సంస్థాగత నిర్మాణం, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ప్రజల్లో పార్టీ పట్ల ఏ మేరకు అభిమానముంది.. భవిష్యత్ ప్రణాళికలపై తీర్మానాలు చేయడమే ప్రధాన ఎజెండాగా ఎన్టీఆర్ హయాంలో మహానాడు పురుడుపోసుకుంది. ఆయన
హయాంలో జరిగిన మహానాడులకు కేవలం టీడీపీ నేతలనే పరిమితం చేయకుండా జాతీయ స్థాయిలో భావసారూప్య
పార్టీల పెద్దలను ఆహ్వానించే వారు. కానీ చంద్రబాబు హయాం వచ్చిన తర్వాత మహానాడు కేవలం బాబు భాజా భజంత్రీలకే పరిమితమైందన్న వాదనలు ఉన్నాయి. ఆత్మస్తుతి.. పరనిందలతో బాబు గంటలకొద్దీ మాట్లాడటం.. ఆ తర్వాత ఆయన్ను
పొగడ్తలతో ముంచెత్తుతూ నేతలు ప్రసంగించడం.. ఇదే మహానాడు ఆనవాయితీగా మారింది. ఇప్పుడూ అదే ఆనవాయితీ కొనసాగనుంది. కాకుంటే చంద్రబాబు కంటే కూడా ఈసారి లోకేష్ బాబును ప్రమోట్ చేయడమే లక్ష్యంగా మహానాడు సమావేశాలు ఉంటాయని తెలుస్తోంది.
లోకేష్ ప్రసంగాలపై గుబులు
ఇప్పటికే ఎన్నోసార్లు.. లోకేష్ బాబు పరిపక్వత లేని ప్రసంగాలు, అనర్ధపు మాటలతో తలపట్టుకుంటున్న టీడీపీ నేతలకు మహానాడులో లోకేష్ ఏం ప్రసంగించేస్తారోననే గుబులు పట్టుకుంది. మహానాడు అంటేనే గంటల తరబడి ప్రసంగాలు.. పైగా లోకేష్ మంత్రి అయిన తర్వాత జరిగే తొలి మహానాడులో ఆయన ఏం మాట్లాడతారు.. ఎటువంటి అచ్చుతప్పులు మాట్లాడి నవ్వులపాలవుతారోనంటూ టీడీపీ పెద్దలు అప్పుడే అంతర్మధనంలో ఉన్నారు.