బెజవాడ కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారులు విచారణను వేగవంతం చేశారు.
విజయవాడ: బెజవాడ కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారులు విచారణను వేగవంతం చేశారు. స్వర్ణ బార్ యాజమన్యానికి చెందిన మరో రెండు బార్లను అధికారులు సీజ్ చేశారు. గురువారం గవర్నర్పేటలోని స్వర్ణ బార్, గాంధీనగర్లోని ఖుషీ బార్ నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు.
కల్తీ మద్యంతో ఐదుగురి మృతికి కారణమైన స్వర్ణ బార్ లైసెన్స్ను రద్దు చేస్తున్నట్లు ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్ నోటీసులు జారీ చేశారు. ఇక ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు నివేదికను ఎక్సైజ్ కమిషనర్కు పంపినట్లు సమాచారం. మరో వైపు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్(సిట్) కూడా దూకుడును పెంచింది. సిట్ అధికారుల బృందం బాధితులు, స్థానిక పోలీసుల నుంచి వివరాలను సేకరించింది. గురువారం విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్తో భేటీ అయి కేసు పురోగతిపై చర్చించారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది.