ఐఏఎస్ అధికారిణి, వ్యవసాయశాఖ డెరైక్టర్ ప్రియదర్శినిని బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆ శాఖలోని అధికారులు, ఉద్యోగులు సోమవారం నుంచి మరో దఫా ఆందోళనకు దిగనున్నారు.
నేటి నుంచి 3 రోజులు పెన్‌డౌన్ సమ్మె
సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ అధికారిణి, వ్యవసాయశాఖ డెరైక్టర్ ప్రియదర్శినిని బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆ శాఖలోని అధికారులు, ఉద్యోగులు సోమవారం నుంచి మరో దఫా ఆందోళనకు దిగనున్నారు. 26వ తేదీ వరకు పెన్‌డౌన్ సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికీ ఆమె బదిలీ జరగకపోతే 27వ తేదీ నుంచి సామూహిక సెలవుపై వెళ్లాలని తీర్మానించుకున్నారు. ఆమె బదిలీ జరి గేంత వరకు ఆందోళన చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. 15 రోజు ల క్రితం ఇలాగే పెన్‌డౌన్ సమ్మె చేశాక ఆమెను వారంలో బదిలీ చేస్తామని అప్పట్లో ఆ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఉద్యోగ నేతలకు హామీ ఇచ్చారు. అది అమలు కానందున ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభిస్తున్నారు.
విజయకుమార్‌ను చేర్పించుకోక పోవడంతో మళ్లీ వివాదం
వ్యవసాయశాఖ డెరైక్టర్ ఉద్యోగులను వేధిస్తున్నారని... కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారనేది ఉద్యోగుల ప్రధాన ఆరోపణ. అలాగే 15 రోజుల కిందట ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేయడంతో డెరైక్టర్‌పై ఉద్యోగులు ఆందోళనను ప్రారంభించారు. ఇప్పుడు మరో వివాదం తాజా ఆందోళనలకు కారణమైంది. వ్యవసాయశాఖ అదనపు సంచాలకులుగా విజయకుమార్‌ను నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసిన మరుసటి రోజే ఆయనకు ఏ బాధ్యతలూ లేవంటూ మెమో జారీచేయడం... ఆయన్ను ఆ పోస్టులో నియమించడానికి నిరాకరించడం తాజా వివాదానికి కారణంగా ఉద్యోగులు చెబుతున్నారు. కక్షతోనే విజయకుమార్‌ను చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నారని అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కె.రాములు తెలిపారు.