
ఆ మూడు విషయాలు మాట్లాడేందుకు వచ్చా: పవన్
మూడు విషయాల గురించి మాట్లాడేందుకు తిరుపతిలో బహిరంగసభ పెట్టానని సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
తిరుపతి: మూడు విషయాల గురించి మాట్లాడేందుకు తిరుపతిలో బహిరంగసభ పెట్టానని సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత రాజకీయాల్లో ఎదురైన అనుభవాలు, టీడీపీ పరిపాలన తీరు, రాష్ట్రాన్ని విడగొట్టి ప్రత్యేకహోదా ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంతో తేల్చుకోవాల్సిన విషయాల గురించి మాట్లాడేందుకు వచ్చానని చెప్పారు.
తిరుమలలో బసచేసిన పవన్ శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో సభావేదిక తిరుపతి ఇందిరా మైదానానికి చేరుకున్నారు. మన దేశ సంపద యువతే అంటూ గుంటూరు శేషేంద్ర శర్మ కవితతో ప్రసంగం ప్రారంభించారు. తాను ఏదైనా ఆలోచించే మాట్లాడుతానని, రాజకీయాలు, పదవుల మీద వ్యామోహం లేదని, అభిమానుల ప్రేమ చాలు అని అన్నారు. తనకు సినిమాల మీద వ్యామోహం లేదని, సమాజం మీద, దేశం మీద వ్యామోహం ఉందని చెప్పారు. సినిమాల్లో కోట్లు సంపాదిస్తానని, కోట్లలో టాక్స్ కడతానని, సుఖంగా ఇంట్లో ఉండొచ్చని, ప్రజలకు మంచి చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని పవన్ అన్నారు. రెండేళ్లక్రితం ఎన్నికల ప్రచారం సందర్భంగా నరేంద్ర మోదీ, చంద్రబాబు, తాను తిరుపతిలోనే తొలిసభలో మాట్లాడామని, అందుకే తిరుపతిలోనే మీటింగ్ పెట్టానని పవన్ చెప్పారు. పెదవి దాటిన మాటను వెనక్కు తీసుకోవడం కష్టమని, అందుకే సహనంతో ఎదురు చూస్తున్నానని చెప్పారు.