
15న ‘పశ్చిమ’లో జగన్ పర్యటన
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 15వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని తెలిపారు.
జంగారెడ్డిగూడెం రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 15వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని తెలిపారు. ఆదివారం జంగారెడ్డిగూడెంలోని పొగాకు బోర్డు వద్ద నాని విలేకరులతో మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డి జంగారెడ్డిగూడెంతోపాటు రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో విలీనమైన కుక్కునూరు మండలంలో పర్యటించనున్నారని వెల్లడించారు.
15న ఉదయం 10 గంటలకు జంగారెడ్డిగూడెం వర్జీనియా పొగాకు బోర్డు వద్ద జగన్‌మోహన్‌రెడ్డి రైతులను కలుస్తారని, ఇక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారని, పామాయిల్, పొగాకు రైతుల కష్టాలను తెలుసుకుంటారని వివరించారు. అనంతరం 3 గంటలకు జగన్ కుక్కునూరు చేరుకుంటారని, అక్కడ ఏర్పాటు చేసిన సభలో కుక్కునూరుతోపాటు వేలేరుపాడు మండల ప్రజల సమస్యలను తెలుసుకుంటారని వెల్లడించారు. అనంతరం కుక్కునూరు మండలం వేలేరు చేరుకుని అక్కడ సభలో బూర్గంపాడు మండలంలోని ఐదు గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారని వెల్లడించారు. తర్వాత భద్రాచలం వెళతారని, ఆ రోజు రాత్రి అక్కడే బస చేస్తారని నాని వివరించారు.