కమలాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డికి వరుసగా రెండవరోజు చుక్కెదురైంది. జనచైతన్యయాత్రల్లో ప్రజానీకం ప్రతిఘటిస్తున్నారు.
జనచైతన్య యాత్రల్లో ప్రతిఘటిస్తున్న ప్రజానీకం
చింతకొమ్మదిన్నె/సాక్షి, కడప : కమలాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డికి వరుసగా రెండవరోజు చుక్కెదురైంది. జనచైతన్యయాత్రల్లో ప్రజానీకం ప్రతిఘటిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం చింతకొమ్మదిన్నె మండలం కమ్మవారిపల్లెకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మిట్టమీదపల్లె గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో తాగునీటి కొళాయిలు వేయిస్తామని మాటిచ్చారు...ఇంతవరకు ఏర్పాటు చేయలేదంటూ పుత్తా నరసింహారెడ్డి ప్రసంగానికి అడ్డు తగిలారు. డ్వాక్రా మహిళలకు పెట్టుబడి నిధి ఇస్తామని గురువారం సాయంత్రమే దండోరా వేయించారు...జనచైతన్య యాత్రలో పంపిణీ చేస్తామని ప్రకటించారు....కూలీ పనులు వదులుకుని వచ్చింది మీ ప్రసంగాలు వినేందుకేనా? అని మూకుమ్మడిగా నిలదీశారు. దీంతో కోపోద్రిక్తుడైన పుత్తా నరసింహారెడ్డి పరుష పదజాలంతో దూషించారు.. రూ. 500 పెట్టి కొళాయి వేయించుకోలేరా? నేనేమైనా మీ గుమస్తానా? .మీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని అన్నారు. అక్కడే ఉన్న మిట్టమీదపల్లె టీడీపీ నేత జయచంద్రారెడ్డిని వారు అలా మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావంటూ గదమాయించారు. దీంతో మిట్టమీదపల్లె గ్రామస్తులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల కోసం ఉందా? మీ వ్యక్తిగత ఆర్బాటం కోసం ఉందా? అంటూ నిలదీశారు. గ్రామస్థులంతా ఆ కార్యక్రమం నుంచి నిష్క్రమించారు. గురువారం రోడ్డు కృష్ణాపురంలో దస్తగిరమ్మ, శుక్రవారం కమ్మవారిపల్లెలో వరుసగా ప్రజానీకం నుంచి ప్రభుత్వ వైఖరిపై ప్రతిఘటన లభించింది.