నవనిర్మాణ దీక్షకు రూ.3 కోట్ల ఖర్చా? | Sakshi
Sakshi News home page

నవనిర్మాణ దీక్షకు రూ.3 కోట్ల ఖర్చా?

Published Tue, Jun 7 2016 9:00 AM

Nava Nirmana Deeksha costs nearly Rs 3 crore

 • అంతా ప్రభుత్వాధికారుల జేబుల్లోదే..
 • రోజుకు 5వేల మంది తరలింపు
 • ఉదయం నుంచి సాయంత్రం వరకూ బందీఖానా  
 •  
   ‘ప్రపంచస్థాయి రాజధాని మనముందున్న లక్ష్యం. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ పోవాలి. కూర్చోడానికి కనీసం కుర్చీ కూడా లేని పరిస్థితిలో పాలన ప్రారంభించాం. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి.’ అని పదేపదే చెబుతున్న సీఎం చంద్ర బాబు ప్రచార ఆర్భాటాలకు మాత్రం వృథాగా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని ప్రజల్లో విమర్శలు వస్తున్నాయి. తాజాగా నవనిర్మాణ దీక్ష.. దుబారా దీక్షగా మారిందని, దీనికోసం దాదాపు రూ.3 కోట్లుఖర్చుచేయడంపై అధికార వర్గాలు, ప్రజలు విస్తుపోతున్నారు.
   
   విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన నవనిర్మాణ దీక్షా వారోత్సవాలకు దాదాపు రూ.3 కోట్లు ఖర్చవుతోందని అంచనా. వారం రోజుల పాటు ఏడు మిషన్లుగా జరుపుతున్న ఈ కార్యక్రమాలకయ్యే ఖర్చు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, కిందిస్థాయి సిబ్బందికి పెనుభారంగా మారింది. వారోత్సవాలకు అయ్యే ఖర్చును జిల్లా యంత్రాంగమే ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ కార్యక్రమాల ఏర్పాట్లు, జనసమీకరణ, భోజనాలు, ఫలహారాలు.. అమాం బాపతు ఖర్చులన్నీ వివిధ శాఖల అధికారులే చూసుకుంటున్నారు.
   
   
   మొదటి రోజు
   నవనిర్మాణ దీక్ష అంటూ బెంజిసర్కిల్ వద్ద భారీస్థాయిలో దీక్షాస్థలి ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి కృష్ణాజిల్లాలోని అన్ని మండలాల నుంచి అన్నివర్గాల ప్రజలను తరలించారు. వీరికి స్నాక్స్, భోజన వసతికి అయిన ఖర్చు ఎంపీడీవోలు భరించారు. జనసమీకరణ కోసం పాఠశాలలు, కళాశాలల బస్సులను వినియోగించారు. రవాణా శాఖ కొన్ని  బస్సులను ఏర్పాటుచేసింది.
   
   
   రెండవరోజు
   విజయవాడలోని ఏ-1 కన్వెన్షన్ సెంటర్‌కు ఈనెల 2 నుంచి 7వ తేదీ వరకూ వివిధ కార్యక్రమాలపై అవగాహన, ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు రోజూ 5వేల మందిని జిల్లా నలుమూలల నుంచి తరలించాలని ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి గ్రామాల్లో తిరిగి జనాన్ని పోగు చేసుకుని 11 కల్లా విజయవాడ ఏ-1 కన్వెన్షన్ సెంటర్‌కు తీసుకురావడం వారి విధి.
   
   పోదామంటే పోనీయరు
   రోజూ ఉదయం వివిధ అంశాలపై చర్చాగోష్టి నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం భోజనాలు పెట్టి సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో సాయంత్రం వరకూ ఉంచుతున్నారు. సాయంత్రం 5 లేదా 6 గంటల సమయంలో సీఎం వచ్చి ప్రసంగించే వరకూ జనాన్ని బయటకు వదలట్లేదు. ఉదయం వచ్చిన జనం దాదాపు 7, 8 గంటలు మీటింగ్ హాల్‌లోనే ఉంటున్నారు. ఇందుకు ఇష్టపడని కొందరు బయటకు వెళ్లిపోతామంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. తలుపులకు తాళాలు వేసేస్తున్నారు. రోజూ సీఎం ప్రసంగంలో విభజన కష్టాలు, రాజధాని నిర్మాణం, ప్రతపక్షంపై చేసే విమర్శలే ఉండటంతో ‘ఎందుకొచ్చాం రా.. దేవుడా..’ అంటూ ఆపసోపాలు పడేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. దీంతో ఒకరోజు వచ్చినవారు మరుసటి రోజు రావడానికి సాహసించటం లేదు. 3వ తేదీన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర విభజన అనంతరం కట్టుబట్టలతో వచ్చిన పరిణామాలపై చర్చాగోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడు హాజరుకావాలని జిల్లా విద్యాశాఖాధికారి రూలింగ్ ఇచ్చారు. ఉదయం వచ్చిన టీచర్లను హాలులో ఉంచి పోలీసులు తాళాలు వేసేస్తున్నారు. సాయంత్రం సీఎం వచ్చి వెళ్లే వరకూ ఇదే పరిస్థితి. కొందరు టీచర్లు బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తే వారి పేర్లు, ఫోన్ నంబర్లు రికార్డు చేసి బెదిరింపు ధోరణి అవలంబిస్తున్నట్లు సమాచారం. నాల్గో తేదీన రెండేళ్లలో సాధించిన ప్రగతిపై డ్వాక్రా సంఘాలతో చర్చాగోష్టి నిర్వహించారు. ఉదయం వచ్చిన డ్వాక్రా మహిళలు రోజంతా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. 5, 6 తేదీల్లో రైతులు ఎన్‌ఆర్‌ఈజీఎస్ కూలీలను తరలించారు.
   
   రూ.కోట్లలో ఖర్చు
   వారోత్సవాల్లో భాగంగా ఏ-1 కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం వరకూ చర్చాగోష్టి, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 5వేల మందికి భోజనం, ఇతర తినుబండారాలకు కలిపి రోజుకు రూ.10 లక్షల చొప్పున 5 రోజులకు రూ.50 లక్షలు ఖర్చవుతుందని అంచనా. భోజనాలు ఏర్పాట్లు పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కన్వెన్షన్ సెంటర్ అద్దె రోజుకు సుమారు రూ.6 లక్షల చొప్పున వారం రోజులకు రూ.50 లక్షలు ఖర్చువుతోంది.
   
   ఇతర ఖర్చులు మరో రూ.2కోట్ల వరకూ అవుతుందని అంచనా. ఇదంతా స్థానికఅధికారులు తలతాకట్టు పెట్టి ఖర్చు చేస్తున్నారు. నవనిర్మాణ దీక్షకు సంబంధించి ఏర్పాట్లు, ఇతర కార్యక్రమాల్లో కృష్ణాజిల్లాలోని ఉన్నతాధికారులు, కిందిస్థాయి అధికారులు నిమగ్నమయ్యారు. 15 రోజులుగా ఇదే పని కావడంతో రోజువారీ కార్యక్రమాలు ఎక్కడికక్కడే స్తంభించాయి. జిల్లా కలెక్టర్ నుంచి గ్రామస్థాయి వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి వరకూ ఇదే పనిలో ఉన్నారు.
   
   దీక్షకు హాజరుకావాలి
   మచిలీపట్నం (చిలకలపూడి ): విజయవాడ ఏ-1 కన్వెన్షన్ సెంటర్‌లో ఈ నెల 7వ తేదీ ఉదయం 9 గంటలకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ దీక్షకు ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులు తప్పక హాజరుకావాలని కార్పొరేషన్ ఈడీ ఎన్‌వీవీ సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. గతంలో రుణాలు పొందిన లబ్ధిదారులు, ఈ ఏడాది మంజూరైన లబ్ధిదారులు ఈ సమావేశానికి హాజరుకావాలని ఆయన ఆదేశించారు.
   

Advertisement
 
Advertisement
 
Advertisement