ఇళ్లు పీకి పందిరేస్తున్నాయి.. | Sakshi
Sakshi News home page

ఇళ్లు పీకి పందిరేస్తున్నాయి..

Published Mon, Aug 22 2016 1:20 AM

ఇళ్లు పీకి పందిరేస్తున్నాయి..

 • నగరంలో బెంబేలెత్తిస్తున్న వానర సైన్యం
 • ఆందోళనలో మహా నగర వాసులు
 • గ్రేటర్‌ ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాల నడుమ సమన్వయ లోపం
 • కాంట్రాక్టర్‌కు రూ.4లక్షల బిల్లుల చెల్లింపులో జాప్యం
 •  
  వరంగల్‌ అర్బన్‌ : అడవుల శాతం తగ్గిపోవడంతో ఊర్లలోకి కోతులు వచ్చేశాయి.. అయితే, వచ్చిన కోతులు ఊరికే ఉంటాయా? నగరంలోని పలు ఇళ్లను పీకి పందిరేస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు వందలాది కోతులు నగరంలో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కోతులు పట్టే పని అప్పగించిన కాంట్రాక్టర్‌కు బిల్లులు మాత్రం చెల్లించకపోవడంతో చేతులెత్తేశాడు. ఫలితంగా నెల రోజుల నుంచి కోతుల కారణంగా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మహా నగర పాలక సంస్థ పరిధిలో ఒక కోతిని పట్టుకున్నందుకు గాను రూ. 450 చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.  పొరుగు రాష్ట్రంలోని నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి కోతులు, కుక్కలను పట్టే కాంట్రాక్టు తీసుకున్నారు. దీనికోసం సదరు కాంట్రాక్టర్‌ వద్ద పనిచేసే వారు బాగా సమస్య ఉన్న ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటుచేసి అందులో అరటి పండ్లు, పల్లీలు ఎరగా వేస్తారు.  వరుసగా రెండు రోజులపాటు వీటిని తినేందుకు కోతులు వస్తాయి. మూడోరోజు బోనులో కోతులు చిక్కుతాయి. ఇలా పట్టుకున్న కోతులను వారానికికోసారి నగరానికి దూరంగా భూపాలపల్లి, కాళేశ్వరం, ఏటూరునాగారం, పాఖాల కొత్తగూడెం అడవుల్లోకి తరలిస్తారు. అందుకోసం బల్దియా ప్రత్యేకంగా వాహనాన్ని సమకూరుస్తుంది. ఎప్పటికప్పుడు ఆ కాంట్రాక్టర్‌ కోతికి రూ.450 చొప్పున బల్దియా నుంచి బిల్లులు చెల్లించాలి. కానీ కొన్నిరోజులుగా బిల్లులు చెల్లించని కారణంగా సమస్య మళ్లీ మెుదటికొచ్చింది.]
   
  నాలుగు నెలలు.. 900 కోతులు
   
  గత నాలుగు నెలల కాలంలో పదమూడు వందల కోతులు పట్టుకున్నట్లు బల్దియా రికార్డులు చెబుతున్నాయి. ఇందులో గత రెండు నెలల కాలంగా 900 పైగా కోతులు పట్టుకున్నట్లు వివరాలు ఉన్నాయి. ఒక కోతిని పట్టుకుని బల్దియా వాహనంలో ఏటూరునాగారం అడవుల్లో వదిలేసినందుకు కాంట్రాక్టర్‌కు రూ.450 చొప్పన చెల్లిస్తున్నారు. గత రెండు నెలలుగా 900 కోతులకు సంబంధించిన రూ.4.05లక్షల సొమ్మును సదరు కాంట్రాక్టర్‌కు చెల్లించలేదు. దీంతో నెల రోజులుగా ఆ కాంట్రాక్టర్‌ కోతులు పట్టుకోవడం మానేశారు. దీంతో నగరంలో కోతుల సమస్య జఠిలంగా తయారైంది. ఇది పక్కన పెడితే కోతులను ఎప్పటికప్పుడు అడవుల్లో వదిలేస్తుండగా.. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లిస్తున్నారు. అయినా, మళ్లీ కోతులు పెద్దసంఖ్యలో ఎలా వస్తున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇకనైనా ఉన్నతాధికారులు సమస్యల మూలాలపై దృష్టి సారించడంతో పాటు కాంట్రాక్టర్‌కు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తూ కోతుల బెడద నుంచి తమను రక్షించాలని నగర వాసులు కోరుతున్నారు.
   
  ఏ కాలనీలో చూసినా కోతుల గుంపులే...
   
  వానర సేనలు గుంపులు గుంపులుగా నగరంలో సంచరిస్తున్నాయి. పాఠశాలకు వెళ్లే పిల్లలు కోతుల భయంతో వణికిపోతున్నారు. బజారుకు వెళ్లి కూరగాయలు, పండ్లు తీసుకుని వచ్చే సమయంలో మీద పడి చేతుల్లో ఉన్న కవర్లు, సంచులను లాక్కుంటున్నాయని నగర వాసులు వాపోతున్నారు. ఒకటో, రెండో కాకుండా పదుల సంఖ్యలో వానరాలు ప్రత్యక్షమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కోతులు ఆకలి, దప్పిక సమయాల్లో ఇళ్లల్లోకి చొరబడి ఇంటిలో ఉన్న పండ్లు, కూరగాయల తదితర సామాగ్రిలు ఎత్తుకుపోతున్నాయని చెబుతున్నారు.
   
   
  ఎక్కడెక్కడ అంటే..
   
  ట్రైసిటీ పరిధిలో కోతుల సమస్య తీవ్రంగా ఉంది. వరంగల్‌లోని గిర్మాజీపేట, గోవిందరాజుల గుట్ట, చౌర్‌బౌళి, పిన్నవారి వీధి, రామన్నపేట, పాపయ్యపేట చమన్, పోచమ్మమైదాన్, ఎల్‌బీ నగర్, కాశిబుగ్గ, క్రిస్టియన్‌ కాలనీ, గాంధీనగర్, అబ్బనికుంట, చింతల్, ఏ.సీ.రెడ్డి నగర్, శివనగర్, పెరకవాడ, ఖిలా వరంగల్, కరీమాబాద్, ఎస్‌ఆర్‌ఆర్‌.తోట, ఉర్సు, రంగశాయిపేట, వరంగల్‌ రైల్వేస్టేçÙన్, ఎల్లంబజార్, ప్రాంతాల్లో కోతుల బెడద విపరీతంగా ఉంది. ఇంకా హన్మకొండలోని కాకాజీ కాలనీ, పింజర్ల వీధి, శ్రీనివాస కాలనీ, లక్ష్మీపురం, బ్రాహ్మణవాడ, పద్మాక్ష్మి కాలనీ, న్యూశాయంపేట, దీన్‌దయాళ్‌ నగర్, నాగేంద్ర నగర్, రాయపురతో పాటు కాజీపేట రైల్వే స్టేషన్, విష్ణుపురి, సిద్ధార్థనగర్‌ తదితర ప్రాంతాల్లో కోతులు భయాందోళనకు గురిచేస్తున్నాయి.
   
   
  వారం రోజులుగా పట్టుకోవడం లేదు..
  కాంట్రాక్టర్‌కు బిల్లుచెల్లింపులో జాప్యమైన విషయం వాస్తవమే. దీంతో సదరు కాంట్రాక్టరు గత పక్షం రోజులుగా కోతులను పట్టుకోవడం లేదు. దీంతో ఫిర్యాదులు పెరిగాయి. నాలుగైదు రోజుల్లో కాంట్రాక్టర్‌కు రూ.4లక్షల చెక్కు ఇప్పిస్తాం. ఆ వెంటనే కోతులు పట్టుకునేలా చర్యలు వేగవంతం చేస్తాం. 
  – బాలముని, బల్దియా ఈఈ 

Advertisement
 
Advertisement
 
Advertisement