వారణాసి: దేశంలోని అత్యంత పురాతన పుణ్యక్షేత్రం వారణాసిలో పరిశుభ్రతకు స్థానిక అధికారులు మరింత ప్రాధాన్యతనిస్తున్నారు. బహిరంగంగా చెత్త వేసేవారిపై ఇప్పటికే కఠిన చర్యలు చేపడుతున్న వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) ఇకపై బహిరంగంగా రోడ్లపై ఉమ్మివేసేవారిపై జరిమానా విధించేందుకు సిద్ధం అయ్యింది.
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం అయిన వారణాసిని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) ప్రజా సంబంధాల అధికారి సందీప్ శ్రీవాస్తవ మీడియాకు తెలిపారు. ఇకపై వారణాసిలో ఎవరైనా రోడ్లపై బహిరంగంగా ఉమ్మి వేస్తే రూ.250 జరిమానా విధిస్తామన్నారు. ఉత్తరప్రదేశ్ ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య నియమాలు- 2021 ప్రకారం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. కదిలే వాహనం నుండి చెత్త వేయడం, ఉమ్మివేయడం లాంటి చర్యలు చేస్తే వెయ్యి రూపాయల వరకూ జరిమానా విధిస్తామని, వీధుల్లో జంతువులకు ఆహారాన్ని పెడితే రూ. 250 జరిమానా విధించనున్నామన్నారు.
నగరంలోని పార్కులు, రోడ్లు లేదా డివైడర్లపై చెత్త వేసేవారికి రూ. 500 జరిమానా విధిస్తామని, బహిరంగ ప్రదేశాల్లో కుక్కల మలాన్ని శుభ్రం చేయని పెంపుడు జంతువుల యజమానులపై కూడా జరిమానా ఉంటుందన్నారు. నదులు, కాలువలు, మురుగు నీటి కాలువల్లో వ్యర్థాలను లేదా జంతువుల అవశేషాలను పారవేస్తే రూ. 750 జరిమానా విధిస్తామని సందీప్ శ్రీవాస్తవ తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గంలో పరిశుభ్రతా ప్రమాణాలను ఆదర్శవంతంగా నిలిపేందుకే ఈ చర్యలు చేపడుతున్నామన్నారు.


