
కాళేశ్వరం: రౌడీ కోతి అంటున్నారేంటని అనుకుంటున్నారా! నిజమేనండి.. మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో కోతుల గుంపునకు ఓ పెద్దలా వ్యవహరిస్తూ.. కోతుల గుంపునకు ముందుండి ప్రజలు, భక్తులందరినీ రౌడీలాగా వెంబడిస్తూ కరిచేది. కోతులు పట్టే మురుగన్ అతని సతీమణి రేణుక బోనులు ఏర్పాటు చేసి పెద్ద రౌడీ కోతిని ముప్పుతిప్పలు పడి పట్టుకోవడంతో ఆదివారం బోనులో చిక్కింది. దీంతో గ్రామస్తులు చూసేందుకు ఎగబడ్డారు. అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటికే 128 వరకు కోతులను ఇతర ప్రాంతం అడవిలో వదిలేశారు.
ఆదివారం మరో 50కి పైగా కోతులు బోనులో చిక్కినట్లు పంచాయతీ వర్గాలు తెలిపాయి. ఒక్కో కోతికి రూ.400వరకు కోతులు పట్టే వ్యక్తికి ఇస్తున్నారు. ఇప్పటికే మూడు రోజులుగా కోతులు పారాహుషార్ అయ్యాయి. బోనులో చిక్కిన కోతలకు దాణా, నీటి సౌకర్యం కల్పిస్తున్నారు. సీడబ్ల్యూసీ కార్యాలయం, ముక్తివనం పార్కు, (కొత్త బస్టాండ్) హనుమాన్‌నగర్, 86గదుల సముదాయం వైపు భారీగా కోతుల స్థావరాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.