పారితోషికం చెల్లింపులో కోత!
● అన్నంకు బదులుగా ఉప్మా
భూపాలపల్లి అర్బన్: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన పీఓలకు చెల్లించాల్సిన పారితోషికం చెల్లింపులో అధికారులు కోత విధించారు. పీఓగా విధులు నిర్వర్తించిన అధికారులకు రూ.2వేలకు బదులుగా కేవలం రూ.1500మాత్రమే చెల్లించారు. ఇతర జిల్లాలో రూ.2వేలు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. రెండు రోజులు ట్రైనింగ్, రెండు రోజులు ఎన్నికల విధులు నిర్వర్తించిన పారితోషికం తక్కువగా చెల్లించడం పట్ల అధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపీడీఓలను పలువురు అడగగా కలెక్టర్ ఆదేశాల మేరకే పారితోషికం తగ్గించి ఇస్తున్నట్లు ఎంపీడీఓ సమాధానం ఇచ్చారు. పోలింగ్ ముగించుకొని బ్యాలెట్ బాక్స్‌లు, ఎన్నికల సామగ్రిని తిరిగి అధికారులకు అప్పగించిన తరువాత సిబ్బంది అన్నం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. టేకుమట్ల, చిట్యాల మండలాల్లో ఆదివారం రాత్రి సిబ్బందికి అన్నంకు బదులుగా నాటు రవ్వతో చేసిన ఉప్మా పెట్టి ఇంటికి పంపడం పట్ల ఎన్నికల సిబ్బంది అసహనం వ్యక్తం చేశారు. తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.
పారితోషికం చెల్లింపులో కోత!


