నేడు వెల్‌బేబీ షో
భూపాలపల్లి అర్బన్: సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు (సోమవారం) వెల్‌బేబీ షోను నిర్వహించనున్నట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక ఏరియా ఆస్పత్రి ఆవరణలో ఉదయం 10గంటలకు నిర్వహించినట్లు తెలిపారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు నిర్వహించినట్లు తెలిపారు. పాల్గొనేవారు ఉద్యోగుల ఐడీ కార్డు, తమ పిల్లల జనన ధృవీకరణ పత్రం, రోగ నిరోధక కార్డులను తీసుకురావాలని సూచించారు.
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
కాటారం: కాటారం నుంచి మహాముత్తారం వైపుగా కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం ఆదివారం మండలంలోని పోతుల్వాయి బ్రిడ్జి వద్ద పట్టుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు మహాముత్తారం వైపుగా వెళ్తున్న కారును తనిఖీ చేయగా అందులో మద్యం సీసాలను గుర్తించారు. రూ.20వేల విలువైన 142 మద్యం సీసాలను స్వాధీనపర్చుకున్నట్లు ఎస్సై తెలిపారు. మద్యం తరలిస్తున్న వలెంకుంటకు చెందిన కొండ శ్రావణ్, కొర్లకుంటకు చెందిన బొబ్బిలి వినోద్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
రామప్పలో యునెస్కో భారత రాయబారి
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని పారిస్ నుంచి వచ్చిన యునెస్కో భారత రాయబారి, శాశ్వత ప్రతినిధి విశాల్ వి.శర్మ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, (ఏఎస్‌ఐ) రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంరక్షణ, పరిరక్షణ చర్యలను ఆయన సమీక్షించారు. యునెస్కోకు సంబంధించిన ప్రతిష్టాత్మక ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సెషన్‌కు విశాల్ వి.శర్మ చైర్మన్‌గా వ్యవహరించారు. ఈ కీలక పదవిని నిర్వహించిన మొదటి భారతీయుడు. ఇటీవల ఢిల్లీలోని ఎరక్రోటలో జరిగిన ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఫర్ సేఫ్ గార్డింగ్ ది ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ 20వ సెషన్‌కు కూడా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలోనే దీపావళిని యునెస్కోకు చెందిన ఐసీహెచ్ జాబితాలో చేర్చారు. 2021లో రాయబారి విశాల్ వి.శర్మ సారథ్యంలోనే రామప్ప ఆలయం కూడా ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. ఇన్‌కోయిస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్) కార్యక్రమానికి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన.. పరిరక్షణ చర్యలను సమీక్షించేందుకు జిల్లాలో పర్యటించారు. ఏఎస్‌ఐ నుంచి డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్టు డాక్టర్ హెచ్.ఆర్. దేశాయ్, డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజికల్ ఇంజనీర్ కృష్ణ చైతన్య, అసిస్టెంట్ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్టు డాక్టర్ రోహిణి పాండే అంబేడ్కర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ నాగోజీరావు తదితరులు పాల్గొన్నారు.
హేమాచలంలో భక్తజనం
మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల క్షేత్రం వందలాది మంది భక్త జనంతో ఆదివారం కిటకిటలాడింది. స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి వంటి పట్టణాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.
బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుల నియామకం
కాజీపేట: అఖిల భారతీయ బ్రాహ్మణ సేవా సంఘం (చాణ్యక్య దళ్)ను పటిష్టంగా తీర్చిదిద్దడంలో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు నూతనంగా జిల్లా అధ్యక్షులను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు అయినవోలు మల్లికార్జున శాస్త్రి తెలిపారు. కాజీపేటలో ఆదివారం సంఘం సభ్యులతో కలిసి జిల్లా అధ్యక్షులను ప్రకటించారు. చిలుకపాటి వెంకటశివకుమార్ (హనుమకొండ), గూడా వెంకటరమణ శర్మ (వరంగల్ అర్బన్), కాంచనపల్లి సిద్ధేశ్వర శర్మ (వరంగల్), యల్లంబట్ల కరుణాకర శర్మ (జనగామ), కొట్లావజ్జుల రామమూర్తి శర్మ (మహబూబాబాద్), విరాళ చంద్రశేఖర్ శర్మ (సిద్దిపేట), చిన్నోజుల లక్ష్మిరాజాం శర్మ (రాజన్న సిరిసిల్ల), జి.శ్రావణ్ కుమార శర్మ (జయశంకర్ భూపాలపల్లి)ను నియమించారు. ఈ మేరకు నూతన అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేసి అభినందించారు.


