
సాకులెందుకో!
వెనుకటికొకరు గుండు కొట్టించుకుంటానని.. ఆనక ‘నా మోకాలు గుండులాగే ఉంది.. ఇక గుండు ఎందుకు’ అని అన్నారట.
♦ ఎమ్మెల్యే పదవి తోకలాంటిదన్నారు..
♦ పార్టీ మారితే పదవిని త్యజిస్తానన్నారు..
♦ ఆర్భాటపు మాటలు.. అంతలోనే యూటర్న్
♦ ఎమ్మెల్యే ఆది డొంకతిరుగుడు వ్యవహారంపై
♦ విస్తుపోతున్న ప్రజానీకం
సాక్షి ప్రతినిధి, కడప : వెనుకటికొకరు గుండు కొట్టించుకుంటానని.. ఆనక ‘నా మోకాలు గుండులాగే ఉంది.. ఇక గుండు ఎందుకు’ అని అన్నారట. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి శైలి చూస్తుంటే అచ్చం అలానే కన్పిస్తోంది. ‘ఎమ్మెల్యే పదవి తోక లాంటిదని, పార్టీ మారాల్సి వస్తే పదవికి రాజీనామా చేసి పార్టీ మారుతాన’ని స్పష్టంగా ప్రకటించారు. ఆది మాటలు విన్న ప్రజలు నైతికత కల్గిన నాయకుడుగా భావించారు. తీరా పార్టీ మారాక యూటర్న్ తీసుకుని టీడీపీ అధిష్టానాన్ని సాకుగా చూపిస్తున్నారు. జిల్లాలో వైఎస్ అనే చెట్టు నీడన దేవగుడి కుటుంబం ఎదిగిందనేది జగమెరిగిన సత్యం. ఆ విషయాన్ని విస్మరించి చంద్రబాబును మెప్పించడానికి పనిగట్టుకుని దివంగత ముఖ్యమంత్రిని విమర్శించడంపై విశ్లేషకులు సైతం విస్తుపోతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కోసం తాము పనిచేయలేదా? ఆయన ఉన్నతికి దోహదపడలేదా? అంటూ మాట్లాడుతుండటం
పట్ల ఆయన సన్నిహితులే పెదవి విరుస్తున్నారు. జిల్లా రాజకీయ చరిత్రను ఓమారు పరిశీలిస్తే వైఎస్సార్‌కు ఉన్న ఎంతో మంది అనుచరులల్లో దేవగుడి కుటుంబం కూడా ఒకటి. రాష్ట్ర వ్యాప్తంగా అపారంగా అభిమానులు, అనుచరగణాన్ని కల్గిన వైఎస్‌ఆర్.. 1985 నాటికే పీసీపీ అధ్యక్షుడిగా పని చేశారు. పీసీసీ అధ్యక్షుడి అనుచరులుగా దేవగుడి కుటుంబీకులకు జిల్లాలో గుర్తింపు లభించిందని పరిశీలకులు వివరిస్తున్నారు. అలాంటి పరిస్థితి నుంచి అంచెలంచెలుగా ఎదగడానికి వైఎస్ ఎంతో దోహదపడ్డారు. వాస్తవ చరిత్ర ఇలా ఉంటే తాము ఆ కుటుంబానికి అండగా నిలిచామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని పలువురు భావిస్తున్నారు.
డొంక తిరుగుడు ఎందుకు?
‘ఎమ్మెల్యే పదవి తోకతో సమానం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, పార్టీ మారుతానని పదేపదే ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రకటించారు. ఆ మేరకు ఆయన కట్టుబడి తన నైతికతను చాటుకోవాల్సి ఉంది. తాజాగా టీడీపీ అధిష్టానం ఒప్పుకోవడం లేదని చెబుతున్నారు. తాను పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమేనంటూనే ఇలా సాకులు చెప్పడం చూస్తుంటే ఆ పదవిపై ఆయనకు ఎంత ప్రేమో ఇట్టే తెలుస్తోంది. నిన్న లేక మొన్న టీడీపీలో చేరి, ఆ పార్టీ అధిష్టానానికి ఇస్తున్న విలువ, మర్యాద చూస్తున్న జనం.. 30 ఏళ్లుగా వైఎస్ కుటుంబంతో పెన వేసుకున్న అనుబంధాన్ని ఎలా త్యజించారని నిలదీస్తున్నారు. ఇదంతా పచ్చి అవకాశవాద రాజకీయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లి నైతికత చాటుకోవాల్సి ఉందని ప్రజాస్వామ్యవాదులు వివరిస్తున్నారు. మాజీ మంత్రి పి రామసుబ్బారెడ్డితో చెలిమి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తాజాగా సోమవారం కూడా ఆయన ప్రకటించారు. ఏం ప్రయోజనాలు ఆశించి టీడీపీలో చేరుతున్నావని మాజీ మంత్రి పి రామసుబ్బారెడ్డి ఇప్పటికే పలుమార్లు ధ్వజమెత్తారు. ఎవరి కోసం, ఎందు కోసం టీడీపీలోకి వస్తున్నావని నిలదీశారు. రాజకీయంగా ఆదరించిన వైఎస్ కుటుంబానికే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి.. భవిష్యత్‌లో టీడీపీకి వెన్నుపోటు పోడవరని గ్యారంటీ ఏముందని ఆయన ప్రశ్నించారు. కేవలం వియ్యంకుడు కేశవరెడ్డి పాఠశాలల ఆస్తులు కాపాడుకునేందుకే టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారని విమర్శించారు. ఈ ప్రశ్నలన్నింటికీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఇప్పటికీ జవాబు చెప్పలేదు. ఎప్పుడు సమాధానం చెబుతారా అని జనం ఎదురు చూస్తున్నారు.